Begin typing your search above and press return to search.

‘సర్దార్’ దోపిడీ అధికారికంగానే..

By:  Tupaki Desk   |   7 April 2016 1:30 PM GMT
‘సర్దార్’ దోపిడీ అధికారికంగానే..
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే జనాల్లో ఉండే క్రేజుని ఎవరి స్థాయిలో వాళ్లు ఫుల్లుగా వాడేసుకుంటున్నారు. ఓ పక్క బెనిఫిట్ షోల పేరు చెప్పి మరీ అన్యాయం 1000-2000 మధ్య టికెట్ రేట్లు పెట్టి అభిమానుల ఉత్సాహాన్ని కొందరు సొమ్ము చేసుకుంటుంటే.. మరోవైపు బ్లాక్ టికెట్ల దందా ముందే మొదలైపోయింది. ఐతే ఇవన్నీ అనధికారికంగా సాగే కార్యక్రమాలు. కానీ అధికారికంగా కూడా జనాల్ని వాయించడానికి ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలూ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వానికి అప్లికేషన్లు పెట్టుకున్నాయి.

ఐతే ముందుంగా కృష్ణా జిల్లా వరకు థియేటర్లకు ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా వచ్చేశాయి. ఈ జిల్లాలోని అన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలోనూ టికెట్ ధరలు పెంచుకునే సౌలభ్యాన్ని కల్పించింది ప్రభుత్వం. రూ.70గా ఉన్న బాల్కనీ టికెట్ ను కొన్ని రోజుల పాటు రూ.90కి అమ్మబోతున్నారు. ఇలా ప్రభుత్వమే టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వడం అన్యాయమని జనాలు అంటున్నా పట్టించుకునే నాథుడెక్కడ? ఆల్రెడీ బెనిఫిట్ షోల ద్వారా కూడా కృష్ణా జిల్లాలో భారీ దోపిడీ జరుగుతోంది. ఏకంగా ఈ జిల్లాలో 44 బెనిఫిట్ షోలు వేస్తున్నారు. ఇలా షోలు వేయడం తప్పు కాదు. కానీ టికెట్ ధరలపై ఏమాత్రం నియంత్రణ లేకపోవడమే అన్యాయం. అభిమానుల ఉత్సాహాన్ని క్యాష్ చేసుకుంటూ దారుణమైన దోపిడీకి పాల్పడుతున్నారు ఈ షోల నిర్వాహకులు.