Begin typing your search above and press return to search.

రాస్కోరా సాంబ‌... ఇది రికార్డు రిలీజ్‌

By:  Tupaki Desk   |   2 April 2016 7:15 AM GMT
రాస్కోరా సాంబ‌... ఇది రికార్డు రిలీజ్‌
X
ఓవ‌ర్సీస్‌ లో తెలుగు సినిమాలు రిలీజ్ కావ‌డం కొత్తేమీ కాదు. అమెరికాలో అయితే ఇంగ్లీష్ సినిమాల‌కి ధీటుగా తెలుగు సినిమాలు విడుద‌ల‌వుతుంటాయి. అక్క‌డి థియేట‌ర్ల ద‌గ్గ‌ర పండ‌గ వాతావ‌ర‌ణం క‌నిపిస్తుంటుంది. అయితే అమెరికాలో ఇప్ప‌టిదాకా విడుద‌లైన తెలుగు సినిమాలు ఒకెత్తు, ఇప్పుడు విడుద‌ల‌వుతున్న స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌ సింగ్ ఒకెత్తు అన్న‌ట్టుగా మారింది ప‌రిస్థితి. ఏకంగా 188 ప్లేసుల్లో స‌ర్దార్ విడుద‌ల‌వుతోంద‌ట‌. ఓవ‌ర్సీస్‌ లో మొత్తం క‌లుపుకొంటే 42 దేశాల్లో 400 ప్లేసుల్లో స‌ర్దార్ విడుద‌లువుతున్న‌ట్టు ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఇది రికార్డు రిలీజ్ అని... సాంబా బుక్‌ లో రాస్కోవాల్సిన విష‌య‌మ‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

మ‌రోప‌క్క హిందీలో 800థియేట‌ర్ల‌లో సినిమాని విడుద‌ల చేస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అస‌లు ప‌వ‌న్‌ కి పోటీనే లేదు కాబ‌ట్టి త‌క్కువ‌లో త‌క్కువ 1400థియేట‌ర్లలో సినిమాని విడుద‌ల చేసే అవ‌కాశాలున్నాయి. క‌ర్ణాట‌క‌ - త‌మిళ‌నాడు - ఒడిశాలాంటి ప్రాంతాల్లోనూ వంద‌ల సంఖ్య‌ల థియేట‌ర్ల‌లో సినిమా విడుద‌ల‌వుతుంది. ఇంత భారీస్థాయిలో విడుద‌లువున్న సినిమా స‌ర్దార్ గ‌బ్బ‌ర్‌సింగే అని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ దెబ్బ‌తో ప‌వ‌న్ గ‌త రికార్డులన్నీ తుడిచి పెట్టుకుపోవ‌డం ఖాయ‌మ‌ని లెక్క‌గ‌డుతున్నాయి ట్రేడ్ వ‌ర్గాలు. అడ్వాన్స్ టికెట్ బుకింగ్ కౌంట‌ర్లు ఓపెన్ చేసిన ప్ర‌తి చోటా అనూహ్య‌మైన స్పంద‌న క‌నిపిస్తోంది. హైద‌రాబాద్‌ లో బెన్‌ ఫిట్ షోలు కూడా పెద్ద‌యెత్తున వేస్తున్నార‌ట‌. వివిధ ప్రాంతాల్లో 10 థియేట‌ర్ల‌లో బెన్‌ ఫిట్ షోలు జ‌రిపే అవ‌కాశాలున్నాయ‌ని లెక్క‌గ‌డుతున్నారు. ఈ మేనియా చూసి బాహుబ‌లి రికార్డులు కూడా బ‌ద్ద‌ల‌వుతాయ‌ని మెగా అభిమానులు సంతోష‌ప‌డిపోతున్నారు. సినిమాకి పాజిటివ్ టాక్ వ‌చ్చిందంటే అదే జ‌ర‌గొచ్చు.