Begin typing your search above and press return to search.

మినీ రివ్యూ: 'సర్దార్ ఉద్దమ్'

By:  Tupaki Desk   |   16 Oct 2021 1:29 PM GMT
మినీ రివ్యూ: సర్దార్ ఉద్దమ్
X
భారతీయ స్వాతంత్రోద్యమ సమయంలో చోటు చేసుకున్న 'జలియన్ వాలా బాగ్' మారణకాండను చరిత్ర ఎప్పటికీ మర్చిపోదు. భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో అత్యంత దురదృష్టమైన, హేయమైన దుర్ఘటనగా ఈ చీకటి ఉదంతం నిలిచిపోయింది. నాటి బ్రిటిష్ పాలకుల దుశ్చర్యకు వందలాది మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. దీన్ని భారతదేశ చరిత్రలో చీకటి దినంగా చరిత్రకారులు అభివర్ణిస్తారు.

అమృత్ సర్ పట్టణంలోని జలియన్ వాలాబాగ్ తోటలో వైశాఖీ ఉత్సవం సందర్భంగా 1919 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్ కు వేలాది మంది చేరుకున్నారు. బ్రిటిష్ ప్రభుత్వం తీసుకొచ్చిన రౌలత్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ జాతీయోద్యమకారులు సైతం ఇందులో పాల్గొన్నారు. రౌలత్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని.. సైఫుద్దీన్ కిచ్లూ - సత్యాపాల్ వంటి తమ నాయకులను విడుదల చేయాలని జలియన్ వాలా బాగ్ సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ సమయంలో పంజాబ్ లో శాంతిభద్రతల బాధ్యత చూసుకునే బ్రిగేడియర్ జనరల్ డయ్యర్.. తన సైన్యంతో వచ్చి నిరాయుధ ప్రజలపై పది నిమిషాల పాటు కాల్పులు జరిపించారు. ఈ దుర్ఘటనలో వేయికి పైగా జనం మరణించగా.. 2000 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షి సర్దార్ ఉద్ధమ్ సింగ్.

విప్లవ వీరుడు భగత్ సింగ్ మార్గంలో నడిచిన ఉద్ధమ్ సింగ్.. జలియన్ వాలాభాగ్ ఉదంతానికి బాధ్యుడైన జనరల్ డయ్యర్ మీద పగ తీర్చుకున్నారు. దుర్ఘటన జరిగిన 21 ఏళ్ల తర్వాత లండన్ నడిబొడ్డున డయ్యర్ ను కాల్చి చంపారు. ఇందుకు గానూ బ్రిటీష్ ప్రభుత్వం ఉద్ధమ్ కు మరణశిక్ష విధించింది. ఈ విధంగా దేశభక్తి ని చాటుకున్న విప్లవకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ ఉద్ధమ్ సింగ్ జీవిత కథ ఆధారంగా ''సర్ధార్ ఉద్ధమ్'' అనే సినిమా రూపొందింది.

'ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్' చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్.. ''సర్దార్ ఉద్దమ్'' లో టైటిల్ రోల్ పోషించారు. ప్రమోషనల్ కంటెంట్ తోనే అంచనాలు పెంచేసిన ఈ చిత్రం దసరా కానుకగా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అక్టోబరు 16 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సుజీత్ సర్కార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంటోంది. ఉద్దమ్ పాత్రలో విక్కీ కౌశల్ అత్యుత్తమ నటన కనబరిచారని తెలుస్తోంది. బ్రిటీష్ వారి మరణహోమానికి సాక్షిగా.. పగ సాధించడానికి కొన్నేళ్ల పాటు ఓపికగా ఎదురు చూసిన వ్యక్తిగా విక్కీ బాగా నటించారు.

1919 జలియన్ వాలాబాగ్ ఉదంతాన్ని డైరెక్టర్ సుజీత్ సర్కార్ కళ్ళకు కట్టినట్లు చూపించే ప్రయత్నం చేశారు. స్వాతంత్ర్యానికి ముందు కాలాన్ని తెరపై ఆవిష్కరించడంతో సక్సెస్ అయ్యారు. దీనికి రచయితలు శుభేన్దు భట్టాచార్య - రితేష్ షా సహకారం అందించారు. శాంతను మిహిత్ర బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మరియు అవిక్ ముఖోద్యాపాయ్ కెమెరా పనితనం ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. రోనీ లాహిరి మరియు షీల్ కుమార్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

అయితే సినిమా నివిడి 2గంటల 42 నిమిషాలు ఉండటం.. స్లో నెరేషన్.. మొదటి గంటలో మరియు మిడిల్ లో వచ్చే బోరింగ్ పోర్షన్.. విక్కీ కౌశల్ మినహా పెద్దగా తెలిసిన నటీనటులు లేకపోవడం ఈ చిత్రానికి మైనస్ గా మారాయి. అంతేకాదు దేశభక్తి ని చాటే పవర్ ఫుల్ డైలాగ్స్ ఈ సినిమాలో లేకపోవడం ప్రేక్షకులకు కాస్త వెలితిగా అనిపించింది. మొత్తం మీద జలియన్ వాలా బాగ్ ఉదంతం మరియు దాని తర్వాత పరిస్థితులను చూపించే వార్ డ్రామా ''సర్ధార్ ఉద్ధమ్'' ను తప్పకుండా చూడాలని మెజారిటీ ఆడియన్స్ చెబుతున్నారు.