Begin typing your search above and press return to search.

'సర్దార్ ఉద్దమ్' ట్రైలర్: ప్రతీకారం తీర్చుకొని ప్రాణత్యాగం చేసిన విప్లవకారుడు కథ..!

By:  Tupaki Desk   |   30 Sep 2021 12:01 PM GMT
సర్దార్ ఉద్దమ్ ట్రైలర్: ప్రతీకారం తీర్చుకొని ప్రాణత్యాగం చేసిన విప్లవకారుడు కథ..!
X
'ఉరీ: ది సర్జికల్ స్ట్రైక్' చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్.. ఇప్పుడు ''సర్దార్ ఉద్దమ్'' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. విప్లవకారుడు, స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ ఉద్ధమ్ సింగ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. జలియన్ వాలాభాగ్ దుర్ఘటనకు బాధ్యుడైన జనరల్ డయ్యర్ మీద పగ తీర్చుకున్న ఉద్ధమ్ సింగ్ పాత్రలో విక్కీ కనిపించనున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా అక్టోబరు 16న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.

'భారతీయులు తమ శత్రువులను ఎన్నటికీ క్షమించరు.. 20 సంవత్సరాల తర్వాత కూడా వారి మీద పగ తీర్చుకోవాలని చూస్తారు' అనే డైలాగ్ తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. ఢిల్లీ నుండి అమృత్ సర్ వెళ్లిన గాంధీని అరెస్టు చేసి బ్రిటిష్ వారు పన్నాగం పన్నినట్లు చూపించారు. 1919 జలియన్ వాలాబాగ్ ఉదంతం మరియు ఆ తర్వాత పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. జలియన్ వాలాబాగ్ లో సమావేశమైన స్వాతంత్ర్య సమరయోధులపై బ్రిటిష్ అధికారి, జనరల్ డయ్యర్ తన సైన్యంతో కలిసి కాల్పులు జరిపించారు. ఈ ఘటనలో వెయ్యికి పైగా భారతీయులు మరణించారు. భారతదేశ చరిత్రలో అదొక చీకటి దినంగా చరిత్రకారులు అభివర్ణిస్తారు.

బ్రిటీష్ వారు సృష్టించిన ఈ మారణహోమానికి ప్రతీకారంగా జనరల్ డయ్యర్ ను చంపడామే ఏకైక మార్గంగా ఉద్దమ్ సింగ్ దొంగ పాస్ పోర్ట్ తో లండన్ వెళ్లినట్లు ట్రైలర్ లో చూపించారు. లండన్ వీధుల్లో అతని కోసం వెతకడం.. రెక్కి నిర్వహించడం వంటివి ఆసక్తికరంగా చూపించారు. ఈ క్రమంలో ఉద్దమ్ సింగ్ ఎలాంటి కష్టాలు పడ్డాడు?.. చివరకు డయ్యర్ ను ఎలా కాల్చి చంపాడు? ఉద్దమ్ కథ ఎలా ముగిసింది? వంటి విషయాలు ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

''సర్దార్ ఉద్దమ్'' బయోపిక్ లో విక్కీ కౌశల్ అత్యుత్తమ నటన కనబరిచారని అర్థం అవుతుంది. నేపథ్య సంగీతం మరియు విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. స్వాతంత్ర్యానికి ముందు కాలాన్ని తెరపై అవిష్కరిస్తున్నాయి. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు రెట్టింపు చేసిందని చెప్పవచ్చు. సుజీత్ సర్కార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శుభేన్దు భట్టాచార్య - రితేష్ షా దీనికి రచయితలుగా వర్క్ చేశారు. రైజింగ్ సన్స్ ఫిలిమ్స్ బ్యానర్ పై రోనీ లాహిరి మరియు షీల్ కుమార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.