Begin typing your search above and press return to search.

ఎఫ్ 2లో మిగిలిన సీన్ల‌ను స‌రిలేరుకు వాడారా!

By:  Tupaki Desk   |   12 Jan 2020 1:30 AM GMT
ఎఫ్ 2లో మిగిలిన సీన్ల‌ను స‌రిలేరుకు వాడారా!
X
సంక్రాంతి భారీ అంచ‌నాల సినిమా స‌రిలేరు నీకెవ్వ‌రూ రానే వ‌చ్చింది. ఈ సినిమాపై మిక్స్ డ్ టాక్ రానే వ‌స్తోంది. బీభ‌త్స‌మైన రేటింగులు ఇచ్చే సినిమా కాద‌ని ఇప్ప‌టికే తేలిపోయింది. ఇక పండ‌గ సీజ‌న్లో ఈ సినిమా ఎంత మేర‌కు వ‌సూళ్ల‌ను సంపాదించుకుంటుందో వేచి చూడాల్సి ఉంది. ఈ సినిమాకు పోటీ అల‌వైకుంఠాపురంలో తో ఉంటుంద‌ని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు.

ఇక ఈ సినిమా విష‌యంలో ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి మీద క్రిటిక్స్ బాణాలు ఎక్కుపెట్టారు. ప్ర‌త్యేకించి ఏ జోన‌ర్ సినిమా తీయాలో అనిల్ కు ఎంత వ‌ర‌కూ క్లారిటీ ఉంది? అనేది ఇప్పుడు ప్ర‌శ్నార్థ‌కంగా నిలుస్తూ ఉంది. సినిమా ఆరంభం సీరియ‌స్ గా, ఆ త‌ర్వాత వెంట‌నే ఫ‌న్ మొద‌లుపెట్టేశాడు ద‌ర్శ‌కుడు. ఎంత‌లా అంటే.. కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ సీన్ల‌ను కూడా స‌ర‌దాగా మార్చేశాడు. ఇక అక్క‌డ నుంచి స‌ర‌దాగా సాగుతుంద‌నుకుంటే.. ట్రైన్ ఎపిసోడ్ ముగిశాకా మ‌ళ్లీ సినిమా సీరియ‌స్ అయిపోయింది.

దాదాపు గంట సేప‌టికి పైగా హీరోయిన్ క‌నిపించ‌దు! ట్రైన్ ఎపిసోడ్స్ మ‌రీ అంత బీభ‌త్సంగా పేల‌క‌పోవ‌డం ఈ సినిమాకు మ‌రో డ్రా బ్యాక్ అవుతూ ఉంది. అంత లెంగ్తీ ట్రైన్ ఎపిసోడ్ ఈ మ‌ధ్య కాలంలో ఎవ‌రూ చూసి ఉండ‌రు. ఎప్పుడో వెంకీ సినిమాలో, ఆ త‌ర్వాత వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్ లో లెంగ్తీ ట్రైన్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఆ త‌ర్వాత స‌రిలేరు నిలుస్తూ ఉంది.

ఇక ఈ ట్రైన్ ఎపిసోడ్ సీన్ల విష‌యంలో అనిల్ రావిపూడి హీరోయిన్-ఆమె త‌ల్లి-ఆమె అక్క‌లు- ఆమె తండ్రికి సంబంధించిన కామెడీ సీన్లు రాసుకున్నాడు. ఈ ట్రాక్ మొత్తం అనిల్ గ‌త ఏడాది సినిమా ఎఫ్ 2ను పోలి ఉంటుంద‌ని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు.

మొగుడిని కొంగుకు క‌ట్టేసుకున్న హీరోయిన్ త‌ల్లి, ఆమెకు ముగ్గురు కూతుళ్లు, ఆ కూతుళ్లు కూడా త‌మ మొగుళ్ల‌ను కొంగుకు కట్టేసుకున్న బాప‌తే. ఈ పాత్ర‌లే ఎఫ్ 2లో క‌నిపిస్తాయి. అవే పాత్ర‌లే.. స‌రిలేరులో క‌నిపిస్తాయి. అందులో ప్ర‌గ‌తి-త‌మ‌న్నా-మెహ్రీల పాత్ర‌లే ఇందులో సంగీత‌- ఆమె కూతుళ్ల పాత్ర‌ల్లో చేసిన ఇద్ద‌రికీ ద‌క్కాయి. ఇక హీరోయిన్ తింగ‌రి మేలం. ఇది కూడా ఎఫ్ 2 జోన‌ర్ పాత్రే.

ఒక సినిమా అనుకున్న‌ప్పుడు రెండు మూడు ర‌కాల సీన్ల‌ను రాసుకుంటారు ఎవ‌రైనా. బ‌హుశా అనిల్ రావిపూడి ఈ సీన్ల‌ను ఎఫ్ 2 కోస‌మే రాసుకుని ఉండొచ్చ‌ని, అప్పుడు మిగిలిపోయి ఉంటే.. ఈ సినిమాకు వాడుకుని ఉండ‌వ‌చ్చ‌ని క్రిటిక్స అభిప్రాయ‌ప‌డుతూ ఉన్నారు. మ‌రి అస‌లు క‌థేమిటో!