Begin typing your search above and press return to search.

థంబ్ నేల్స్ తో థండర్ స్టార్ ను ఆపలేరు!

By:  Tupaki Desk   |   16 May 2022 2:41 PM GMT
థంబ్ నేల్స్ తో థండర్ స్టార్ ను ఆపలేరు!
X
మహేశ్ బాబు - పరశురామ్ కాంబినేషన్లో రూపొందిన 'సర్కారువారి పాట' ఈ నెల 12వ తేదీన భారీస్థాయిలో విడుదలైంది. హ్యాట్రిక్ హిట్ తరువాత మహేశ్ బాబు చేసిన ఈ సినిమా, అనేక అంచనాల మధ్య థియేటర్లకు వచ్చింది. విడుదలైన ప్రతి ప్రాంతంలో భారీ వసూళ్లను రాబడుతోంది. రెండు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 103 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోను .. ఓవర్సీస్ లో కూడా గట్టి వసూళ్లనే రాబడుతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్ మీట్ ను కర్నూల్ లో 'మ మ మాస్ సెలబ్రేషన్స్' పేరుతో నిర్వహించారు.

ఈ సినిమాకి అన్ని పాటలు అనంత శ్రీరామ్ రాశాడు. 'కళావతి' .. 'మ మ మహేశా' పాటలకు అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ వేదికపై అనంత శ్రీరామ్ మాట్లాడుతూ .. "సాంబా .. సోనా మసూరి సత్తువ కలిసిన నెత్తురు మీది .. ఉప్పొంగే తుంగభద్రలా పరవళ్లు తొక్కే రక్తం మీది. మీది కర్నూలు .. మీలో రాయలసీమ రాజసం .. తెలుగువాడి పౌరుషం ఉంది. అలాంటి ఈ కర్నూల్ గడ్డ నడిబొడ్డు మీద విజయ గర్జన చేస్తున్న సూపర్ స్టార్ అభిమాన సింహాల సమూహానికి అభివాదం.

అర చేత్తో సూర్యుణ్ణి ఆపలేమనేది పాత మాట .. థంబ్ నేల్స్ లో థండర్ స్టార్ ను ఆపలేరనేది 'సర్కారువారి పాట నిరూపించిన మాట. ఈ సినిమా పాటలో ఒక లైన్ ఉంది. 'చెప్పకురా తోలు తొక్కా .. తప్పదురా వడ్డీ లెక్కా' అన్నట్టుగానే ఐదు రోజుల్లోనే అసలు మొత్తం వసూలు చేసి, వడ్డీ మీద వడ్డీ .. ఆ వడ్డీ మీద బారు వడ్డీ .. ఆ వడ్డీ మీద చక్ర వడ్డీ .. వసూలు చేసుకుంటూ దూసుకుపోతున్న విజయగాథకి ప్రత్యక్ష నిదర్శనం ఈ సభ.

మీ విజయ గర్జనలు .. మీ ఘోషలు చూస్తుంటే .. ఈ విజయ గాథ ఇక్కడితో ఆగేలా లేదు అనేది నా అభిప్రాయం. ఈ సందర్భంగా ఈ సినిమాలో ఐదు పాటలు రాసే అవకాశం ఇచ్చి .. ప్రతి పాట రాయడానికి ఊతం ఇచ్చిన .. ఊత పదం ఇచ్చిన పరశురామ్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆ ఊతానికి చేయూత నిచ్చిన తమన్ గారికి కృతజ్ఞతలు. ఇక ఈ సినిమాను తన భుజస్కందాలపై మోసి ఇంతటి విజయానికి కారణమైన సూపర్ స్టార్ మహేశ్ బాబుగారికి వే వేల ప్రణామాలు. ఇలాంటి ఒక మంచి సినిమాను నిర్మించిన నిర్మాతలకు ధన్యవాదాలు" అంటూ చెప్పుకొచ్చాడు.