Begin typing your search above and press return to search.

యుఎస్‌ లో మాత్రం సరైనోడు కాదు

By:  Tupaki Desk   |   2 May 2016 7:54 AM GMT
యుఎస్‌ లో మాత్రం సరైనోడు కాదు
X
డివైడ్ టాక్ ను కూడా తట్టుకుని.. తెలుగు రాష్ట్రాల్లో అదరగొడుతోంది ‘సరైనోడు’ సినిమా. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ రాష్ట్రాల్లో రూ.40 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసి సంచలనం రేపింది బన్నీ మూవీ. రెండో వీకెండ్ అయ్యేసరికే బయ్యర్లందరూ దాదాపుగా బ్రేక్ ఈవెన్‌ కు వచ్చేశారు. ఇక రాబోయేదంతా లాభాలే. పొరుగు రాష్ట్రం కర్ణాటకలో సైతం రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టిందీ సినిమా. దాదాపుగా అన్ని ఏరియాల్లోనూ బన్నీ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ అనిపించుకుంటోంది ‘సరైనోడు’. ఐతే ఒక్క యుఎస్ లో మాత్రం ‘సరైనోడు’ కలెక్షన్లు ఆశించిన స్థాయిలో లేదు. అక్కడి ప్రేక్షకులు క్లాస్ సినిమాలకు.. ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు మాత్రమే బ్రహ్మరథం పడతారు. మాస్ సినిమాలు అక్కడి జనాలకు అంతగా ఎక్కవు.

‘సరైనోడు’ను ముందు నుంచి మాస్ సినిమాలాగే ప్రొజెక్ట్ చేశారు. సినిమా కూడా అలాగే ఉండటంతో యుఎస్ లో కలెక్షన్లు ఆశాజనకంగా లేవు. పది రోజుల్లో ఈ సినిమా అక్కడ 8 లక్షల డాలర్లు వసూలు చేసింది. భారీ స్థాయిలో ప్రిమియర్లు వేయడం వల్ల.. పెద్ద ఎత్తున రిలీజ్ చేయడం వల్ల ఫస్ట్ వీకెండ్ అయ్యేసరికే హాఫ్ మిలియన్ క్లబ్బులో అడుగుపెట్టినప్పటికీ.. ఆ తర్వాత అతి కష్టం మీద బండి నడుస్తోంది. ఫస్ట్ వీకెండ్ అయ్యాక వారం రోజుల్లో 3 లక్షల డాలర్లు మాత్రమే వసూలయ్యాయి. అందులో మెజారిటీ షేర్ వీకెండ్లోనే వచ్చింది. ఐతే ‘సరైనోడు’కు వచ్చిన టాక్ ప్రకారం ఈ మాత్రం వసూళ్లు రావడం కూడా ఎక్కువే అంటున్నారు. ఈ వీకెండ్ సుప్రీమ్ తో పాటు 24 సినిమా కూడా రిలీజవుతున్న నేపథ్యంలో ‘సరైనోడు’ కథ దాదాపుగా ముగిసినట్లే. ఈ సినిమా మిలియన్ క్లబ్బులోకి రావడం అసాధ్యమే.