Begin typing your search above and press return to search.

రికార్డులొద్దు స్వామీ.. హిట్టయితే చాలు

By:  Tupaki Desk   |   19 April 2016 9:30 AM GMT
రికార్డులొద్దు స్వామీ.. హిట్టయితే చాలు
X
అత్యాశకు పోతే అసలుకే మోసం వస్తోందని.. ఈసారి రికార్డుల మాటే ఎత్తట్లేదు మెగా అభిమానులు. పోయినేడాది ‘బ్రూస్ లీ’ విషయంలో అభిమానుల అంచనాలు మామూలుగా లేవు. రామ్ చరణ్-శ్రీను వైట్ల కాంబినేషన్‌ కు ఉన్న క్రేజ్ చూసుకుని.. చిరంజీవి క్యామియో రోల్ ను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. ‘మగధీర’ రికార్డును చరణ్ దాటేస్తాడని.. ‘శ్రీమంతుడు’ను కొట్టేస్తాడని.. ఓవర్సీస్‌ లో తనకు అందని ద్రాక్షలా ఊరిస్తున్న మిలియన్ మార్కును అలవోకగా అందుకుంటాడని.. ఇంకా ఎన్నెన్నో ఆశలు పెట్టుకున్నారు. తీరా చూస్తే సినిమా డిజాస్టర్ అయింది. బయ్యర్లకు భారీ నష్టాలు మిగిల్చింది.

ఇక లేటెస్టుగా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ విషయంలోనూ ఇలాగే జరిగింది. ఈ సినిమా గురించి మాట్లాడినపుడల్లా రికార్డుల కబుర్లే వినిపించాయి. నాన్-బాహుబలి రికార్డులన్నింటినీ పవన్ తుడిచేయడం ఖాయం అనుకున్నారంతా. ఐతే తొలి రోజు వసూళ్లలో మినహాయిస్తే ఇంకే రికార్డుల గురించి ఆలోచించే పరిస్థితి లేకపోయింది. ఈ సినిమా కూడా బయ్యర్లకు భారీ నష్టాలే మిగిల్చింది. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ నుంచి రాబోతున్న కొత్త సినిమా ‘సరైనోడు’ విషయంలో అభిమానులెవరూ రికార్డుల ఊసు ఎత్తట్లేదు. నిజానికి ఈ సినిమా బిజినెస్ పరంగా కొన్ని కొత్త రికార్డులు నెలకొల్పింది. శాటిలైట్ రేట్ కూడా భారీగా పలికింది. అంచనాలకు తగ్గట్లు సినిమా ఆడితే కొన్ని రికార్డులు బద్దలవడం కూడా గ్యారెంటీ. ఐతే రికార్డుల గురించి ఎక్కువ మాట్లాడితే అసలుకే మోసం వస్తోందని.. అందుకే ఆ లెక్కల మాట తర్వాత ముందు సినిమాకు హిట్ టాక్ రావాలని కోరుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. తొలి రోజు పాజిటివ్ టాక్ తో మొదలైతే.. ఆ తర్వాత ఆటోమేటిగ్గా రికార్డులు బద్దలవుతాయని.. అప్పుడు ఆ విశేషాల గురించి మాట్లాడుకుందామని ప్రస్తుతానికి సైలెంటుగా ఉన్నారు.