Begin typing your search above and press return to search.

35 ఏళ్ల తరువాత 'గాడ్ ఫాదర్'కి తండ్రిగా రీ ఎంట్రీ!

By:  Tupaki Desk   |   27 Sep 2022 4:11 AM GMT
35 ఏళ్ల తరువాత గాడ్ ఫాదర్కి తండ్రిగా రీ ఎంట్రీ!
X
చిరంజీవి 'గాడ్ ఫాదర్' అనేక ప్రత్యేకతలను .. విశేషాలను సంతరించుకుంటూ ముందుకు వెళ్లిందనే విషయం తెలుస్తోంది. విడుదల తేదీ దగ్గర పడుతున్నా కొద్దీ ఈ విశేషాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. తాజాగా మరో ఆసక్తికరమైన విషయం బయటికి వచ్చింది. 'సిరివెన్నెల' హీరో సర్వదమన్ బెనర్జీ ఈ సినిమాలో 'గాడ్ ఫాదర్' కి తండ్రిగా కనిపించనున్నాడనేదే ఆ విశేషం. నిన్నటితరం ప్రేక్షకులకు సర్వదమన్ బెనర్జీ ఎవరో తెలుసునుగానీ, ఈ తరం ఆడియన్స్ కి తెలియదు. అందుకు కారణం ఆయన సినిమాలకు దూరమై చాలా కాలం కావడమే.

'సిరివెన్నెల' సినిమా ద్వారా బెనర్జీ తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. ఆ సినిమాలో అంధుడి పాత్రలో ఆయన ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఆ తరువాత 'స్వయం కృషి' సినిమాలోను సుమలత భర్తగా గుర్తుండిపోయే పాత్రనే చేశారు. అప్పటి నుంచి ఆయన కమర్షియల్ సినిమాల్లో కనిపించలేదు.

'స్వామి వివేకానంద' .. 'శ్రీదత్త దర్శనం' ప్రత్యేకమైన సినిమాలను మాత్రమే చేశారు. అలాంటి ఆయన 35 ఏళ్ల తరువాత 'గాడ్ ఫాదర్' సినిమాలో చిరంజీవికి తండ్రి పాత్రను పోషించారు. ఈ సినిమాలో ఆయన ముఖ్యమంత్రిగా .. చిరంజీవికి తండ్రిగా కనిపిస్తారు.

సర్వదమన్ బెనర్జీ ఫేస్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది .. ఆయన నటన కూడా చాలా సహజంగా ఉంటుంది. ముఖ్యమంత్రి పాత్ర కోసం చాలామంది పేర్లను పరిశీలించి చివరికి ఆయనను ఎంపిక చేసుకున్నారట. ఇక ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ 'గాడ్ ఫాదర్' సోల్ మేట్ గా కనిపించనున్నారు. చిరంజీవితో కలిసి ఈ సినిమాలో ఆయన స్టెప్పులు కూడా వేయడం అందరిలో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరో కీలకమైన పాత్రలో నయన తార కనిపించనుంది. ఆమె గ్లామర్ .. నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తావని మెగాస్టార్ చెప్పడం ఉత్కంఠను పెంచుతోంది.

'సైరా' సినిమాలో చిరంజీవికి జోడీగా కనిపించిన ఆమె, ఈ సినిమాలో ఆయనకి చెల్లెలి పాత్రను పోషించారు. అయితే ఈ సినిమా చూస్తున్నప్పుడు 'సైరా'లోని తమ జంట ఎవరికీ గుర్తుకురాదని చిరంజీవి తేల్చిచెప్పారు. ఇక దాదాపు నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో సత్యదేవ్ కనిపించనున్నాడు.

హీరోగా చేస్తూ వెళుతున్న ఆయన ఈ తరహా పాత్రను చేయడానికి ఒప్పుకోవడం విశేషం. ఇంతవరకూ హీరోయిన్ గానీ .. పాటలు గాని లేని సినిమాలు తాను చేయలేదనీ, అలా చేసిన సినిమా ఇదేనని చిరంజీవి చెప్పారు. కొత్తదనం కోసం ఆయన చేసిన ప్రయోగం మెగా అభిమానులను ఎంతవరకూ మెప్పిస్తుందనేది చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.