Begin typing your search above and press return to search.

శతమానం.. ముగ్గురు లెజెండ్స్ ఏమన్నారు?

By:  Tupaki Desk   |   10 Feb 2017 4:59 AM GMT
శతమానం.. ముగ్గురు లెజెండ్స్ ఏమన్నారు?
X
శతమానం భవతి.. చిన్న సినిమాగా మొదలై పెద్ద విజయం సాధించిన చిత్రం. సంక్రాంతికి భారీ చిత్రాలతో పోటీ పడి.. వాటికి దీటుగా వసూళ్లు సాధించింది ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్. పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే ఇది ఖైదీ నెంబర్ 150.. గౌతమీపుత్ర శాతకర్ణిల కంటే పెద్ద హిట్. అన్ని వర్గాల ప్రేక్షకలనూ ఈ చిత్రం మెప్పించింది. బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా విషయంలో తాను అందుకున్న ప్రశంసల్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటానని అంటున్నాడు దర్శకుడు సతీశ్ వేగేశ్న. తెలుగు పరిశ్రమకు పెద్ద దిక్కు అనదగ్గ ముగ్గురు లెజెండరీ డైరెక్టర్లు తన సినిమా గురించి గొప్పగా మాట్లాడటం అద్భుతమైన అనుభూతిని పంచిందని అతను చెప్పాడు. ఆ ముగ్గురు లెజెండ్స్ సినిమా గురించి ఏమన్నారో సతీశ్ మాటల్లోనే..

‘‘శతమానం భవతి సినిమా విడుదలకు ముందే ఈ కథపై ప్రశంసలు కురిపించారు రాఘవేంద్రరావు గారి. ఈ కథను ముందుగా ఆయనకే వినిపించాను. ఆయన విని ఎన్ని రోజులుగా ఈ కథపై పని చేస్తున్నావు అని అడిగారు. ఏడాది అని చెప్పాను. నా కష్టం ఈ స్క్రిప్టులో కనిపిస్తోంది అన్నారు. సాధారణంగా రచయితలు.. దర్శకులు హీరో హీరోయిన్ల మీదే దృష్టిపెడతారని.. కానీ ఈ కథలో ప్రతి పాత్రకూ ప్రాధాన్యం ఉందని మెచ్చుకున్నారు. సినిమా రిలీజైన తర్వాత దాసరి నారాయణరావు గారు అభినందనలతో బొకే పంపారు. తర్వాత ఫోన్ చేసి సినిమా ప్రశాంతంగా.. చాలా బాగుందని. కచ్చితంగా జాతీయ అవార్డుకు పంపమని అన్నారు. ఈ మధ్య దర్శకుల సంఘానికి షో వేసినపుడు విశ్వనాథ్ గారు వచ్చి సినిమా చూశారు. ఈ సినిమా చూశాక తాము కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉందనిపించిందని కితాబిచ్చారు. తెలుగు సినిమాను ఎక్కడికో తీసుకెళ్లిన ముగ్గురు లెజెండరీ డైరెక్టర్లు నా సినిమా గురించి ఇలా అనడం గొప్ప అనుభూతి’’ అని సతీశ్ అన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/