Begin typing your search above and press return to search.

దేవుడు అదరగొట్టేశాడుగా..

By:  Tupaki Desk   |   11 Feb 2017 5:46 AM GMT
దేవుడు అదరగొట్టేశాడుగా..
X
తెలుగు ప్రేక్షకులకు దేవుడంటే నందమూరి తారకరారామారావే. అప్పటి నటుల్లో ఇంకొందరు దేవుడి పాత్రలు వేశారు కానీ.. ఎన్టీఆర్ వేసిన ముద్ర మాత్రం అలాంటిలాంటిది కాదు. రాముడు.. కృష్ణుడు.. వేంకటేశ్వరుడు.. ఇలా ఏ దేవుడి పాత్ర అన్నా ఎన్టీఆరే గుర్తుకొస్తారు. ఆ ఫీలింగ్ కొన్ని దశాబ్దాల పాటు వెంటాడింది. ఐతే ‘అన్నమయ్య’ సినిమాతో సుమన్ వేంకటేశ్వరుడి పాత్రలో మెప్పించి.. తన ప్రత్యేకత చాటుకున్నాడు. ఆ తర్వాత ‘శ్రీరామదాసు’ తోనూ ఆకట్టుకున్నాడు సుమన్. ఇక అప్పట్నుంచి దేవుడి పాత్రలంటే సుమనే అన్న ఫీలింగ్ కలిగింది జనాలకు. ఈ నేపథ్యంలో ఒక పరభాషా నటుడు వచ్చి రాఘవేంద్రరావు సినిమాలో వేంకటేశ్వరుడి పాత్ర చేయడం అన్నది ఆశ్చర్యం కలిగించే విషయం.

‘ఓం నమో వేంకటేశాయ’ సినిమాలో శ్రీనివాసుడి పాత్రకు సౌరభ్ జైన్ అనే ఉత్తరాది సీరియల్ నటుడిని ఎంచుకున్నారన్న వార్త బయటికి రాగానే చాలామంది సందేహాలు వ్యక్తం చేశారు. సుమన్ ఉండగా.. అతనెందుకు అన్నారు. కానీ వేంకటేశ్వరుడి పాత్రలో సౌరభ్ ను చూశాక కానీ అర్థం కాలేదు.. రాఘవేంద్రుడిది ఎంత మంచి ఛాయిసో. ఇప్పుడు సినిమా చూశాక అందరూ రాఘవేంద్రరావుకు హ్యాట్సాఫ్ అంటున్నారు. వేంకటేశ్వరుడి పాత్రకు సౌరభ్ జైన్ అంత బాగా సూటయ్యాడు. అంతలా మెప్పించాడు. బహుశా ఎన్టీఆర్ తర్వాత దేవుడి పాత్రలో ‘ది బెస్ట్’ సౌరభ్ జైనే అంటే అతిశయోక్తి లేదు. అంత బాగా అతడికి ఆ పాత్ర కుదిరింది. అతడి ఆహార్యం ఆ పాత్రకు సరిగ్గా సరిపోయింది. నటన కూడా ఓకే అనిపించింది. సౌరభ్ ను చూస్తుంటే నిజంగా దేవుడినే చూస్తున్న అనుభూతి కలిగింది. అంత హుందాగా ఆ పాత్రను పోషించాడతను. అతను సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అనడంలో సందేహం లేదు. మున్ముందు దేవుడి పాత్ర అంటే మనవాళ్లకు సౌరభే గుర్తుకొస్తాడేమో.