Begin typing your search above and press return to search.

థియేట‌ర్ల‌ను కాపాడండి మ‌హా ప్ర‌భో! తెలంగాణ ప్ర‌భుత్వానికి లేఖ‌!!

By:  Tupaki Desk   |   8 July 2021 9:42 AM GMT
థియేట‌ర్ల‌ను కాపాడండి మ‌హా ప్ర‌భో! తెలంగాణ ప్ర‌భుత్వానికి లేఖ‌!!
X
క‌రోనా మ‌హ‌మ్మారీ క్రైసిస్ సినీరంగాన్ని థియేట‌ర్ల వ్య‌వ‌స్థ‌ను స‌ర్వ‌నాశ‌నం చేసిన సంగ‌తి తెలిసిందే. ఏడాదిన్న‌ర కాలంగా ఈ రంగంలో సందిగ్ధ‌త అలానే ఉంది. 24 శాఖ‌ల కార్మికుల ఉపాధితో పాటు థియేట‌ర్ రంగంలోని వేలాది మంది ఉపాధికి గ్యారెంటీ లేకుండా పోయింది. థియేట‌ర్లు మూసివేయ‌డంతో ఇప్ప‌టికీ ఈ రంగంలో బ‌తుకు తెరువు లేక అల్లాడుతున్నారు.

ఇలాంటి స‌మ‌యంలో ఇరు తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్లు తెరుచుకునేందుకు ప్ర‌భుత్వాల నుంచి క్లారిటీ వ‌చ్చేసింది. ఏపీలో 50శాతం ఆక్యుపెన్సీ.. తెలంగాణ‌లో 100శాతం ఆక్యుపెన్సీతో థియేట‌ర్లు తెర‌చుకోవ‌చ్చ‌ని ప్ర‌భుత్వాలు అనుమ‌తులిచ్చాయి. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ థియేట‌ర్ల‌ను తెరిచేందుకు ఎగ్జిబిట‌ర్లు సంసిద్ధ‌త‌ను వ్య‌క్తం చేయ‌లేదు.

అయితే ఈ సందిగ్ధ‌త‌కు కార‌ణం తాజాగా రివీలైంది. తెలంగాణ ఫిలింఛాంబ‌ర్ నుంచి కొన్ని డిమాండ్ల‌తో నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఓ లేఖ అందింది. ఈ లేఖ నినాదం..``సేవ్ సినిమా.. సేవ్ థియేట‌ర్స్``. సినీరంగాన్ని కాపాడాల‌న్నా థియేట‌ర్ల రంగాన్ని నిల‌బెట్టాల‌న్నా ప్ర‌భుత్వం నుంచి కొన్ని వెసులుబాట్లు కావాల‌ని ఈ లేఖ‌లో పేర్కొన్నారు. జీవో నంబ‌ర్ 75 ని పునఃప‌రిశీలించాల‌ని వెంట‌నే థియేట‌ర్ల‌లో పార్కింగ్ ఫీజుల‌ను వ‌సూలు చేసేందుకు అనుమ‌తులివ్వాల‌ని తెలంగాణ ఛాంబ‌ర్ ప్ర‌భుత్వాన్ని కోరింది. నామ‌మాత్ర‌పు ఫీజుల వ‌సూళ్ల‌కు అనుమ‌తులివ్వాల‌ని ఈ మార్పు వ‌ల్ల థియేట‌ర్ కార్మికుల జీతాల చెల్లింపులు స‌హా ఉపాధికి ఆస్కారం ఉంటుంద‌ని ఛాంబ‌ర్ తెలిపింది. ద‌శాబ్ధాల పాటు థియేట‌ర్ల‌ను నిల‌బెట్టింది పార్కింగ్ ఫీజు. దానిని ర‌ద్దు చేసిన జీవోని తిరిగి పునఃప‌రిశీలించాల‌ని కోరారు. ఉచిత పార్కింగ్ వ‌ల్ల థియేట‌ర్లు ఆదాయం కోల్పోతున్నాయి. ప్ర‌స్తుతం కోవిడ్ క‌ష్ట కాలంలో శానిటేష‌న్ కి భారీగా ఖ‌ర్చ‌వుతోంది.. పార్కింగ్ ఫీజుతో కొంత వెసులుబాటు క‌లుగుతుంద‌ని ఆ లేఖ‌లో పేర్కొన్నారు.

లాక్ డౌన్ లో ప్ర‌తి థియేట‌ర్ కి మినిమం డిమాండ్ పేరుతో క‌రెంట్ ఛార్జీల్ని వ‌సూలు చేశారు. కానీ దానిని త‌ట్టుకోవ‌డం క‌ష్టం. తిరిగి ఆ ఛార్జీల‌ను రీఇంబ‌ర్స్ చేయాల‌ని ప్ర‌భుత్వానికి ఈ లేఖ‌లో విన్న‌వించారు. రెండేళ్లుగా థియేట‌ర్లు మూత ప‌డి ఉన్నాయి. అందువ‌ల్ల ఈ రెండేళ్ల‌కు ఆస్తి ప‌న్ను ర‌ద్దు చేయాలి. మున్సిప‌ల్ శాఖ దీనిని విధిగా ప‌రిశీలించి సాయ‌ప‌డాలి. అలాగే జీఎస్టీని సాధ్య‌మైనంత త‌గ్గిస్తేనే థియేట‌ర్లు మ‌నుగ‌డ సాగిస్తాయి. కోవిడ్ క్రైసిస్ కాలానికి అన్నిటినీ ప‌రిశీలిస్తార‌నే ఆశిస్తున్నాం.. అని లేఖ‌లో పేర్కొన్నారు. సినిమాని కాపాడాలంటే .. థియేట‌ర్ రంగం బ‌త‌కాలంటే తెలంగాణ ప్ర‌భుత్వం పైవిధంగా స‌హ‌క‌రించాల‌ని తెలంగాణ ఫిలింఛాంబ‌ర్ ఆ లేఖ‌లో పేర్కొంది. సీఎం కేసీఆర్ - మంత్రివర్యులు కేటీఆర్ కి సినీప‌రిశ్ర‌మ త‌ర‌పున పైవిధంగా విన్న‌వించారు. ప్ర‌భుత్వాధీశులు ఏం చేస్తారో చూడాలి.

అటు ఏపీలో టిక్కెట్టు రేట్లు పెంచ‌క పోతే ఇరు తెలుగు రాష్ట్రాల్లో థియేట‌ర్లు తెర‌వ‌డం క‌ష్ట‌మేన‌ని ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఆ క్ర‌మంలోనే ఏపీ ప్ర‌భుత్వానికి తెలంగాణ ఛాంబ‌ర్ ఓ లేఖాస్త్రం సంధించిన సంగ‌తి తెలిసిందే. కానీ జ‌గ‌న్ స‌ర్కార్ దిగి రాలేదు.