Begin typing your search above and press return to search.

హైద‌రాబాద్‌కి సావిత్రికి తెలీని లింకు బ‌య‌ట‌కు..!

By:  Tupaki Desk   |   13 May 2018 5:00 AM GMT
హైద‌రాబాద్‌కి సావిత్రికి తెలీని లింకు బ‌య‌ట‌కు..!
X
దాదాపు 40 ఏళ్ల క్రితం స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయిన ఒక సీనియ‌ర్ న‌టి ఫీవ‌ర్ ఇప్పుడు తెలుగువాళ్ల‌ను ప‌ట్టేయ‌టం సాధ్య‌మేనా అంటే నో చెబుతారు. కానీ.. సావిత్రి అన్న పేరుతో జ‌త చేస్తే మాత్రం.. ఎస్ అంటారు. అదీ.. సావిత్రికున్న ఇమేజ్‌. అప్పుడెప్పుడో బ్లాక్ అండ్ వైట్ జ‌మానాకు చెందిన న‌టికి సంబంధించి బ‌యోపిక్ తీస్తే ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారా? అన్న అనుమానం ప‌క్క‌కుపోయి.. రికార్డు క‌లెక్ష‌న్ల‌తో దూసుకెళ్ల‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అదే స‌మ‌యంలో సావిత్రికి సంబంధించిన మ‌రిన్ని కొత్త విష‌యాల్ని తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు నేటి త‌రం. ఇదిలా ఉంటే.. నాటి మ‌ద్రాసులో ఉన్న సావిత్రికి.. హైద‌రాబాద్‌తో ఎలాంటి రిలేష‌న్ ఉండేది? ఆమెకు భాగ్య‌న‌గ‌రంతో ఉన్న అనుబంధం ఎలాంటిది అన్న విష‌యాల్లోకి వెళితే.. ఆస‌క్తిక‌ర అంశాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

మ‌హాన‌టి చిత్రంలో సావిత్రికి గ‌జ‌రాజు అంబారీ మీద ఎక్కించి స‌న్మానం చేసిన సీన్ అంద‌రిని విప‌రీతంగా ఆక‌ట్టుకుంటుంది. నిజానికి అది జ‌రిగింది హైదరాబాద్‌లోనే. అంతేనా.. సావిత్రికి హైద‌రాబాద్‌లో ఇల్లు ఉంద‌న్న విష‌యం చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే తెలుసు. సినిమా షూటింగ్ కోసం త‌ర‌చూ భాగ్య‌న‌గ‌రానికి వ‌చ్చే సావిత్రికి న‌గ‌రంలోని చెరువులు.. తోట‌లు.. న‌గ‌రం చుట్టూ విస్త‌రించి ఉండే ప‌చ్చ‌ద‌నం ఆమెను అమితంగా ఆక‌ట్టుకునేవి.

అందేకే కాబోలు హైద‌రాబాద్ న‌గ‌రంలో ఆమె రెండిళ్ల‌ను నిర్మించుకున్నారు. షూటింగ్‌ల కోసం త‌ర‌చూ హైద‌రాబాద్‌కు వ‌చ్చే సావిత్రి యూస‌ఫ్ గూడ‌లో ఎక‌రం భూమి కొని అందులో రెండు భ‌వ‌నాలు నిర్మించారు. అదంతా 1960 ప్రాంతంలో జ‌రిగింద‌న్న విష‌యం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. షూటింగ్ కోసం న‌గ‌రానికి వ‌చ్చే సావిత్రి హైద‌రాబాద్ అందాల‌కు మురిసిపోయి మ‌రీ త‌న అభిరుచికి త‌గ్గ‌ట్లు రెండిళ్లు ప‌క్క‌ప‌క్క‌నే నిర్మించారు.

అందులో ఒక ఇంటి బాల్క‌నీలో కూర్చొని ఎదురుగా ఉన్న చెరువు.. ప్ర‌స్తుతం కృష్ణ‌కాంత్ పార్కు ఉన్న చోటుని చూస్తూ గ‌డ‌ప‌టం ఆమె ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డే వార‌న్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. అప్ప‌ట్లో ఆ ఇంటిని సావిత్రి బంగ్లా అని పిలిచేవారట‌. త‌ర్వాతి కాలంలో ఆ భ‌వ‌నాలు సావిత్రి అక్క మారుతి భ‌ర్త మ‌ల్లికార్జున‌రావు సొంత‌మ‌య్యాయి. ప్ర‌స్తుతం ఆ భ‌వ‌నాల స్థానే పెద్ద అపార్ట్ మెంట్ ఒక‌టి వ‌చ్చేసింది. సావిత్రి బంగ్లా క‌నుమ‌రుగైపోయింది.