Begin typing your search above and press return to search.

ఘంటసాల మనమరాలు ఇప్పుడెందుకు వార్తల్లో వ్యక్తి అయ్యారు?

By:  Tupaki Desk   |   20 April 2020 5:00 AM GMT
ఘంటసాల మనమరాలు ఇప్పుడెందుకు వార్తల్లో వ్యక్తి అయ్యారు?
X
అమర గాయకుడిగా.. తెలుగువారందరికి సుపరిచితులు ఘంటసాల. తరం ఏదైనా ఘంటసాల అద్భుత గానానికి ఫిదా కావాల్సిందే. అలాంటి అద్భుతమైన వ్యక్తి కుటుంబానికి సంబంధించిన వివరాలు పెద్దగా బయటకు రావు. ఆ మాటకు వస్తే.. వారి పనేమిటో వారు అన్నట్లుగా ఉండటం.. గ్లామర్ రంగానికి దూరంగా ఉండటం కూడా ఒక కారణంగా చెప్పాలి. ఇలాంటివేళ.. ఘంటసాల మనమరాలు ఒక్కసారిగా తెర మీదకు వచ్చారు.

కరోనా వేళ.. దాన్ని కంట్రోల్ చేసేందుకు అనుసరించాల్సిన వివిధ విధానాల గురించి ప్రపంచ వ్యాప్తంగా పలువురు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మన ఘంటసాల వారి మనమరాలు ఆస్ట్రేలియాలోని ఫ్లిడర్స్ విశ్వవిద్యాయలంలోని ఎండీ చదువుతున్న శాస్త్రవేత్త కె. లాలిత్య తాజాగా ఒక అంతర్జాతీయ జర్నల్ కు ఒక కాన్సెప్ట్ పేపర్ ను సమర్పించారు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనాకు వ్యాక్సిన్ లేని వేళ.. ప్లాస్మా చికిత్సపై పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. ఘంటసాల మనమరాలు ప్రస్తుతం ఇదే విషయం మీద ఒక రీసెర్చ్ పేపర్ సబ్మిట్ చేశారు. ఇందులో ఆసక్తికర అంశాలు ఉండటంతో ఇప్పుడు ఆమె వార్తల్లో వ్యక్తిగా మారారు. ప్రముఖ మీడియా సంస్థతో ఇదే విషయం మీద ప్రత్యేకంగా మాట్లాడారు.చైనాలో చేసిన ప్లాస్మా థెరపీ ప్రయోగంతో పాటు.. పలు అంశాల్ని ఆమె చెప్పుకొచ్చారు. ఆమె చెప్పిన అంశాల్లో కీలకమైనవి చూస్తే..

% కరోనా వైరస్ తో చికిత్స పొందుతున్న ఐదుగురి రక్తంలోకి చైనాలోని షెన్జాన్ ఆసుపత్రి వైద్యులు ఫ్లాస్మా థెరపీ ద్వారా యాంటీ బాడీల్ని ప్రవేశ పెట్టారు. వారిలో ముగ్గురు కోలుకోవటంతో వారిని ఇళ్లకు పంపారు. పాజిటివ్ గా తేలి.. తర్వాత దాన్ని అధిగమించిన వారి రక్తాన్ని సేకరించి.. అందులోని తెల్ల రక్త కణాల్ని పాజిటివ్ రోగులకు ఎక్కించటం ద్వారా కరోనాను ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే.. ఈ వ్యవహారంలో తమ రక్తాన్ని ఇచ్చేందుకు కొందరు ముందుకు రారు. ఇలాంటి ఇబ్బందిని అధిగమించేందుకు వారి రక్తంలోని తెల్లరక్తకణాల్ని పోలిన వాటిని డీఎన్ఏ కణంగా మార్చాలి. ఇందుకోసం ఫాజీ డిస్ ప్లే పద్దతిని అనుసరించాలి.

% ఇలా రూపొందించిన యాంటీ బాడీలను ప్రయోగశాల్లలో యాంటీ బాడీకి అవసరమైన కణజాల పదార్థంగా తయారు చేయాలి. ఇందుకోసం దాదాపుగా నెల సమయం తీసుకుంటుంది. ఇలా యాంటీబాడీని ఒక్కటి తయారు చేస్తేచాలు.. వాటి నకళ్లను లక్షల్లో తయారుచేసే అవకాశం ఉంటుంది. తొలుత వీటిని కుందేళ్లు.. కోతులపై ప్రయోగించి.. తర్వాత వాటిని మనుషుల్లో ప్రయోగిస్తే.. ఫలితం ఉంటుంది. యాంటీ బాడీ తయారీకి 30రోజులు.. వాటి పని తీరు తెలుసుకోవటానికి పద్నాలుగు రోజులు కలిపి మొత్తంగా యాభై రోజుల్లో ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. యాంటీ బాడీని తయారు చేసిన తర్వాత దానిని భవిష్యత్తు లో వ్యాక్సిన్ కింద ఉపయోగించుకోవచ్చన్నది ఆమె వాదన. ఆసక్తికరంగా ఉన్న ఈ వాదన వాస్తవరూపం దాలిస్తే... అద్భుతమే అవుతుంది. అందుకు మన ఘంటసాల వారి మనమరాలు కావటం తెలుగోళ్లకు మరో గొప్పగా మారుతుందనటంలో సందేహం లేదు.