Begin typing your search above and press return to search.

ముంబయిలో మరాఠీ సినిమా రచ్చ

By:  Tupaki Desk   |   9 April 2015 3:30 AM GMT
ముంబయిలో మరాఠీ సినిమా రచ్చ
X
ప్రాంతీయ అభిమానం ఉండటంలో తప్పు లేదు.. కానీ ఆ అభిమానం హద్దులు దాటితేనే ప్రమాదం. మహారాష్ట్రలో మరాఠీల ప్రాంతీయ అభిమానాన్ని క్యాష్‌ చేసుకునేందుకు నవనిర్మాణ సేన పార్టీ వేసే వేషాల గురించి తరచుగా వింటూనే ఉంటాం. ఐతే భారతీయ జనతా పార్టీ కూడా ఇదే దారిలో పయనిస్తుండటమే విడ్డూరం. మంచి పాలకుడిగా గుర్తింపు తెచ్చుకున్న ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్‌ తీసుకున్న నిర్ణయం మహారాష్ట్రలో తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

ముంబయి సహా మహారాష్ట్రలోని పెద్ద నగరాల్లో మల్టీప్లెక్స్‌లన్నీ హిందీ సినిమాలతోనే నిండిపోతున్నాయని.. దీని వల్ల మరాఠీ సినిమా మరుగున పడిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ.. సాయంత్రం 6 నుంచి 9 మధ్య ప్రతి మల్టీప్లెక్స్‌లోనూ మరాఠీ సినిమాలు తప్పకుండా ప్రదర్శించాలని.. అలా చేయని పక్షంలో థియేటర్ల లైసెన్సులు రద్దు చేస్తామని ఆర్డర్‌ పాస్‌ చేశారు సీఎం పడ్నవీస్‌. దీనిపై థియేటర్ల యజమానులు, బాలీవుడ్‌ జనాలు మండిపడుతున్నారు. కలెక్షన్లు ఉన్న సినిమాలు ప్రదర్శించడం తమ ఇష్టమని.. ఫలానా సినిమాలే ప్రదర్శించాలని చెప్పడం ఎంతవరకు న్యాయమని అడుగుతున్నారు థియేటర్ల యజమానులు. బాలీవుడ్‌ తరఫున ముఖేశ్‌, శోభా డే లాంటి వాళ్లు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఎవరూ అడక్కపోయినా పడ్నవీస్‌ ఇలా ఎందుకు చేస్తున్నారని.. ఇది కొన్ని వర్గాల ఓటు బ్యాంకు కోసం తీసుకున్న నిర్ణయం కాదా అని ముఖేశ్‌ ప్రశ్నించగా.. త్వరలో థియేటర్లలో పాప్‌కార్న్‌ బదులు పావ్‌ బాజే అమ్మాలని కూడా రూల్‌ పెడతారేమో అని శోభా డే సెటైర్‌ వేసింది. దీనిపై మహారాష్ట్ర అసెంబ్లీలోనూ చర్చ జరుగుతోంది.