Begin typing your search above and press return to search.
రేచీకటితో 'సెబాస్టియన్' నాన్ స్టాప్ కామెడీ!
By: Tupaki Desk | 5 Feb 2022 2:30 AM GMTయంగ్ హీరోలు వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టేస్తున్నారు. ఒక సినిమా తరువాత ఒక సినిమా థియేటర్లకు వెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఎవరూ కూడా ఎక్కడా గ్యాప్ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వెళుతున్నారు. అలాంటి హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. 'రాజావారు రాణిగారు' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ఈ కథానాయకుడు, 'ఎస్. ఆర్. కల్యాణ మంటపం' సినిమాతో మరో విజయాన్ని అందుకున్నాడు. అప్పటి నుంచి ఆయన దూకుడు పెంచాడు. ఇప్పుడు ఓ నాలుగు సినిమాలను ఆయన సెట్స్ పైకి తీసుకుని వచ్చాడు.
ఆ సినిమాల్లో 'సెబాస్టియన్ PC 524' ఒకటిగా కనిపిస్తోంది. ఈ సినిమాలో కిరణ్ కానిస్టేబుల్ గా కనిపించనున్నాడు. సిద్ధార్థ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో నమ్రత దారేకర్ .. కోమలి ప్రసాద్ కథానాయికలుగా పరిచయమవుతున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను థియేటర్లకు తీసుకొస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ .. థ్రిల్లర్ ను కలుపుకుని ఈ కథ సాగుతుందని కిరణ్ అబ్బవరం చెప్పాడు.
ఈ నెల చివరి నుంచి పెద్ద సినిమాల జోరు మొదలుకానుంది. అందువలన చిన్న సినిమాలన్నీ కూడా ఈ లోగానే థియేటర్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి దిగిపోతున్నాయి. అలా ఈ సినిమా కూడా లైన్ పైకి వచ్చింది. సమయం తక్కువగా ఉండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకూ వచ్చిన అప్ డేట్స్ కూడా అంతంత మాత్రమే. అందువలన జనంలోకి తీసుకుని వెళ్లడానికి తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమాను గురించి కిరణ్ అబ్బవరం మాట్లాడాడు.
'చంటి' సినిమాలో బ్రహ్మానందం చేసిన రేచీకటి ఉన్న పాత్ర అంటే నాకు చాలా ఇష్టం. అలాంటి పాత్రను చేయాలనే ఆసక్తి నాకు ఎప్పటి నుంచో ఉంది. అలా చేసే అవకాశం ఈ పాత్ర వలన కుదిరింది. ఇంతవరకూ నేను చేసిన పాత్రలలో కామెడీ టచ్ ఎక్కువగా ఉన్న పాత్ర ఇది. అందువలన నాకు మంచి పేరు తీసుకువస్తుందని భావిస్తున్నాను. గిబ్రాన్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అనుకుంటున్నాను. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందని నమ్మకం ఉంది" అని చెప్పుకొచ్చాడు.