Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : సెబాస్టియన్

By:  Tupaki Desk   |   4 March 2022 6:28 PM GMT
మూవీ రివ్యూ :  సెబాస్టియన్
X
చిత్రం : సెబాస్టియన్

నటీనటులు: కిరణ్ అబ్బవరం-నువేక్ష-రోహిణి-కోమలి ప్రసాద్-ఆదర్శ్ బాలకృష్ణ-శ్రీకాంత్ అయ్యంగార్-పృథ్వీ తదితరులు
సంగీతం: జిబ్రాన్
ఛాయాగ్రహణం: రాజ్ కె.నల్లి
నిర్మాతలు: సిద్ధారెడ్డి రాజు-ప్రమోద్
రచన-దర్శకత్వం: బాలాజి సయ్యపురెడ్డి

రాజావారు రాణివారు.. ఎస్ఆర్ కళ్యాణమండపం చిత్రాలతో ఆకట్టుకున్న యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం నుంచి వచ్చిన కొత్త చిత్రం ‘సెబాస్టయిన్’. ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ లాగే ఇది కూడా ట్రైలర్ తో ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించింది. మరి ఆ చిత్రంలా మెరుపులు ట్రైలర్ కే పరిమితం అయ్యాయా.. లేక సినిమాలోనూ విషయం ఉందా.. తెలుసుకుందాం పదండి.

కథ:

సెబాస్టియన్ (కిరణ్ అబ్బవరం) ఒక పోలీస్ కానిస్టేబుల్. అతడికి చిన్నతనం నుంచి రేచీకటి ఉంటుంది. ఎంతమంది డాక్టర్ల దగ్గర చూపించినా ఫలితం ఉండదు. ఈ లోపం బయటి వాళ్లకు తెలియకుండా సెబాస్టయిన్.. అతడి తల్లి జాగ్రత్త పడుతుంటారు. అలా దాచిపెట్టే అతను చనిపోయిన తన తండ్రి కోరిక ప్రకారం పోలీస్ అవుతాడు. కానీ రేచీకటితో పోలీస్ ఉద్యోగంలో నెట్టుకురావడం సెబాకు చాలా కష్టమవుతుంది. అయినా ఎలాగోలా మేనేజ్ చేస్తుంటాడు. కానీ అతడి రేచీకటి వల్ల ఒక అమ్మాయిని కాపాడాల్సిన సమయంలో కాపాడలేకపోతాడు. ఆమె హత్యకు గురవుతుంది. ఆధారాలు లేక పోలీసులు ఈ కేసును మూసేసినా.. ఆ అమ్మాయి కేసు తనను రేయింబవళ్లు వెంటాడుతుండటంతో సెబా తనకు తానుగా విచారణ చేస్తూ ముందుకెళ్తాడు. చివరికి ఈ హత్య కేసు మిస్టరీని అతనెలా ఛేదించాడన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

‘సెబాస్టియన్’ ఏ టైపు సినిమా అంటే చెప్పడం కష్టం. కాసేపు ఇది కామెడీ సినిమా అనిపిస్తుంది. ఇంకాసేపు సెంటిమెంట్ మూవీలా కనిపిస్తుంది. మరి కాసేపేమో హీరో ఎలివేషన్లతో నడిచే ఫక్తు కమర్షియల్ సినిమాలా తోస్తుంది. ఇంకాస్త ముందుకెళ్తే థిల్లర్ లాగా కనిపిస్తుంది. కానీ ఎందులోనూ పర్ఫెక్షన్ మాత్రం కనిపించదు. పర్ఫెక్షన్ లేకపోయినా.. ఏదో ఒక రకంగా ఇది ఎంటర్టైన్ చేస్తే సర్దుకపోవచ్చు కానీ.. మొదలుపెట్టిన దగ్గర్నుంచి ఈ కథను ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియని అయోమయమే తప్ప కాస్తయినా ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించే కథనం లేక ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. అసలు దర్శకుడు ఏం చెప్పదలుచుకున్నాడో.. ఏ సన్నివేశం ఎందుకొస్తుందో.. ఏ పాత్ర ఎలా ప్రవర్తిస్తుందో తెలియని గందరగోళంతోనే చివరి దాకా గడిచిపోయి ప్రేక్షకులకు ఎన్నో శేష ప్రశ్నలను మిగులుస్తుంది ‘సెబాస్టియన్’. ప్రపంచ సినిమా, సిరీస్‌లన్నీ అరచేతుల్లోకి వచ్చేసిన ఈ రోజుల్లో ఇంత పేలవంగా ఓ మర్డర్ మిస్టరీని నడిపించి ప్రేక్షకులను మెప్పించగలమని భావించిన ‘సెబాస్టయిన్’ మేకర్స్ ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే.

‘సెబాస్టియన్’ ట్రైలర్ చూస్తే ఇదొక వినోదాత్మక చిత్రం లాగే కనిపించింది. రేచీకటి ఉన్న హీరో.. ఆ లోపంతో పోలీస్ ఉద్యోగంలో ఎలా నెట్టుకొస్తాడన్నది వినడానికి చాలా ఆసక్తికరంగా అనిపించే కాన్సెప్ట్. దీన్ని కామెడీ కోసమే కాక డ్రామాకు కూడా బాగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఆరంభంలో ఒకట్రెండు సన్నివేశాలు చూస్తే.. హీరో క్యారెక్టర్ భలేగా అనిపిస్తుంది. మంచి ఎంటర్టైనర్ చూడబోతున్న ఫీలింగ్ కలగుతుంది ప్రేక్షకులకు. కానీ హీరో పరిచయ సన్నివేశాల వరకే ఆ మెరుపులు పరిమితం. రేచీకటి కాన్సెప్ట్ ను తర్వాత పెద్దగా ఉపయోగించుకున్నది లేదు. మర్డర్ మిస్టరీ మొదలైన దగ్గర్నుంచి రైటింగ్ డొల్లతనం అంతా బయటపడిపోయింది. దర్శకుడి అనుభవ లేమి ప్రతి సన్నివేశంలోనూ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది. హీరోయిన్ పాత్రను తీర్చిదిద్దిన విధానం.. దాన్ని తెరపై చూపించే తీరుతోనే ‘సెబాస్టియన్’ స్థాయి ఏంటో అర్థమైపోతుంది. యూట్యూబ్ లో అమెచ్యూర్స్ చేసే షార్ట్ ఫిలిమ్స్ కూడా నయం అనిపిస్తుంది కొన్ని సన్నివేశాలు చూస్తే. అర్థం పర్థం లేకుండా.. ఒక దశా దిశా లేకుండా వచ్చిపోయే సన్నివేశాలు పూర్తిగా ప్రేక్షకులు ఈ సినిమాతో డిస్కనెక్ట్ అయిపోయేలా చేస్తాయి.

కిరణ్ అబ్బవరం చివరి సినిమా ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ సినిమాగా ఆకట్టుకోకపోయినా.. అందులో చెప్పుకోదగ్గ కథ ఉంది. కథనంలో ఒక పద్ధతి కనిపిస్తుంది. కానీ ‘సెబాస్టియన్’ అలా కాదు. ఇందులో కథగా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. ఇక కథనం గురించైతే చెప్పాల్సిన పని లేదు. మర్డర్ మిస్టరీని ఎంత పేలవంగా చూపించాలో అంత పేలవంగా చూపించారిందులో. ఎక్కడా కనీస స్థాయిలో కూడా ఉత్కంఠ రేపేలా కథనాన్ని తీర్చిదిద్దుకోలేదు. కథ చెప్పాల్సిన చోట.. ఉత్కంఠ రేకెత్తించాల్సిన చోట అవసరం లేని హీరో ఎలివేషన్లు.. బ్యాగ్రౌండ్ స్కోర్ తో చెవుల తుప్పు వదిలించడం తప్ప సన్నివేశాల్లో పస లేకపోయింది. పోలీస్ స్టేషన్లో అనుమానితులను ఎస్ఐ విచారించే సీన్లు చూస్తే ఇది ఏ కాలం సినిమా అనిపిస్తుంది. థ్రిల్లర్ సినిమాలంటే తర్వాత ఏం జరుగుతుందా ఉత్కంఠ కలగాలి కానీ.. త్వరగా క్లైమాక్సుకు తీసుకెళ్లిపోయి హంతుకుడెవరో చెప్పేస్తే ఇక బయటపడతాం అనే ఫీలింగ్ కలిగిస్తుంది ‘సెబాస్టయిన్’. రెండు గంటల నిడివిలో ముగిసినా చాలా పెద్ద సినిమా చూసిన భావన కలిగిస్తుందంటే ‘సెబాస్టయిన్’ ఎలా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.

నటీనటులు:

కిరణ్ అబ్బవరం చూడటానికి బాగున్నాడు. అతడి నటనా ఆకట్టుకుంటుంది. చిత్తూరు-కడప యాసలో అతను చెప్పే డైలాగులూ బాగున్నాయి. కానీ తన వరకు ప్రామిసింగ్ గా అనిపించే అతను.. కథల ఎంపికలో మాత్రం మళ్లీ మళ్లీ తప్పటడుగులే వేస్తున్నాడు. సరైన టీంను ఎంచుకోవడంలో విఫలమవుతున్నాడు. సినిమాలో అతను కాకుండా శ్రీకాంత్ అయ్యంగార్ కొంచెం ఆకట్టుకుంటాడు. హీరోయిన్ నువేక్ష గురించి చెప్పడానికి ఏమీ లేదు. ఆమె పాత్ర చాలా పేలవం. విలన్ పాత్రధారి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఆదర్శ్ బాలకృష్ణను దర్శకుడు ఉపయోగించుకోలేదు. పృథ్వీ పర్వాలేదు. రోహిణి తల్లి పాత్రలో బాగానే చేసింది. కానీ ఆ పాత్ర కనిపించినపుడల్లా విసుగెత్తిపోయేలా సన్నివేశాలను తీర్చిదిద్దాడు దర్శకుడు.

నేపథ్య సంగీతం:

పిండి కొద్దీ రొట్టె అన్నట్లే సాంకేతిక విభాగాలు కూడా సినిమాలో విషయానికి తగ్గట్లే పని చేశాయి. జిబ్రాన్ ఈ సినిమాకు సంగీతం అందించాడంటే నమ్మబుద్ధి కాదు. నేపథ్య సంగీతంలో అనవసర హడావుడే తప్ప.. ప్రేక్షకులను సినిమాలో ఇన్వాల్వ్ చేసేలా లేదు. రాజ్ కె.నల్లి ఛాయాగ్రహణం ఆకట్టుకోదు. నిర్మాణ విలువల విషయంలో బాగా రాజీ పడ్డ విషయం ఎక్కడికక్కడ కనిపిస్తూనే ఉంటుంది. దర్శకుడు బాలాజీ సయ్యపురెడ్డి ట్రైలర్ కట్ చేయడంలో చూపించిన ప్రతిభను.. స్క్రిప్టు.. టేకింగ్ లోనూ చూపించి ఉండాల్సింది. రైటింగ్ దగ్గరే తేలిపోయిన ‘సెబాస్టియిన్’.. స్క్రీన్ మీదికి వచ్చేసరికి ఇంకా పేలవంగా తయారైంది. దర్శకుడి తడబాటు చాలా సన్నివేశాల్లో కనిపిస్తుంది.

చివరగా: సెబాస్టియన్.. మొత్తం చీకటే

రేటింగ్-2/5

Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre