Begin typing your search above and press return to search.

'లీడర్' డైలాగ్ నుంచి 'లవ్ స్టోరీ' పుట్టింది: శేఖర్ కమ్ముల

By:  Tupaki Desk   |   20 Sep 2021 6:32 AM GMT
లీడర్ డైలాగ్ నుంచి లవ్ స్టోరీ పుట్టింది: శేఖర్ కమ్ముల
X
టాలీవుడ్ దర్శకులలో శేఖర్ కమ్ముల స్థానం ప్రత్యేకం. కథాకథనాలపై ఆయనకి మంచి పట్టు ఉంది .. సంగీతంపై మంచి అవగాహన ఉంది. పాత్రలను ఆయన తెరపై ఆవిష్కరించే తీరు సహజంగా ఉంటుంది. ఈ కారణంగానే ఆయన సినిమాలు అన్నివర్గాల ప్రేక్షకులకు వెంటనే కనెక్ట్ అవుతుంటాయి. ఆయన తాజా చిత్రమైన 'లవ్ స్టోరీ' సినిమా ఈ నెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శేఖర్ కమ్ముల మాట్లాడుతూ,
ఈ సినిమా విశేషాలను పంచుకున్నారు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవిగారు రావడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఆయన చెప్పిన మాటలు మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఈ సినిమా టీమ్ అంతా కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటోంది. ఇక అసలు ఈ ఫంక్షన్ కి ఆమిర్ ఖాన్ వస్తారని నేను ఊహించలేదు. ఒక ఇంటర్నేషనల్ స్టార్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఆమిర్ ఖాన్ గారు చేసిన సినిమాలు .. నేను చేసిన సినిమాలు చూస్తూ వెళితే, మా సినిమాల మధ్య ఎక్కడో తెలియని ఒక కనెక్షన్ ఉందనిపించింది. ఆమిర్ ఖాన్ చేసిన 'సత్యమేవ జయతే' చూసినప్పుడు, ఆయనలా ఈ సొసైటీ గురించి ఎవరూ ఆలోచించలేరని అనిపించింది.

నేను ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చాను .. నా సినిమాల ద్వారా మంచి చెప్పడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. 'లీడర్' సినిమాలో నేను ఒక డైలాగ్ రాశాను .. అరవై ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా 'కుల వివక్ష' ఉందని. ఆ డైలాగ్ నుంచి పుట్టిన కథనే 'లవ్ స్టోరీ'. ఈ సినిమా షూటింగు సమయంలో కరోనా ఫస్టు వేవ్ .. రిలీజ్ చేయాలనుకున్నప్పుడు సెకండ్ వేవ్ వచ్చాయి. అయినా టీమ్ అంతా కూడా ఎంతో అంకితభావంతో వర్క్ చేస్తూ వెళ్లింది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఈ సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేయాలనే నిర్ణయంతో ఉన్న నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమాను థియేటర్లలో చూడండి .. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది" అని చెప్పుకొచ్చారు.

ఇక సాయిపల్లవి మాట్లాడుతూ .. "నాకు చిరంజీవిగారి డాన్సులంటే ఎంతో ఇష్టం .. అలాంటిది ఆయన నా డాన్సును మెచ్చుకోవడం ఎంతో ఆనందంగా అనిపిస్తోంది. ఆమిర్ ఖాన్ గారు వస్తారని నేను ఎంతమాత్రం అనుకోలేదు. నా కళ్లను నేను నమ్మలేకపోతున్నాను. శేఖర్ కమ్ములగారు ఈ పాత్రను నేను చేయగలనని అనుకోవడమే గొప్ప విషయం. ఆయనతో నాకు ఇది రెండో సినిమా .. ఈ టీమ్ తో మరో సినిమా చేయాలనుంది. నాగచైతన్య వండర్ఫుల్ కో స్టార్ .. ఆయనతో కలిసి నటించడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఈ సినిమాలోనూ ఒక సందేశం ఉంది .. అమ్మాయిలంతా తమని తాము ప్రశ్నించుకుంటూ ఇంటికి వెళతారు" అంటూ చెప్పుకొచ్చింది.