Begin typing your search above and press return to search.

అదొక్కటే ఫెయిల్యూర్ అంటున్న కమ్ముల

By:  Tupaki Desk   |   31 Dec 2017 4:30 PM GMT
అదొక్కటే ఫెయిల్యూర్ అంటున్న కమ్ముల
X
ఆనంద్.. గోదావరి.. హ్యాపీడేస్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు శేఖర్ కమ్ముల. ‘హ్యాపీడేస్’తో బ్లాక్ బస్టర్ ఇచ్చాక కమ్ములపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కానీ ఆ తర్వాత ఆయన తీసిన మూడు సినిమాలు.. ‘లీడర్’.. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’.. ‘అనామిక’ నిరాశ పరిచాయి. ఇప్పుడు ‘ఫిదా’తో మళ్లీ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు కమ్ముల. ఐతే తన కెరీర్లో ఒక్క ‘అనామిక’ సినిమాను మాత్రమే ఫెయిల్యూర్ గా భావిస్తున్నట్లు కమ్ముల చెప్పాడు. మిగతా సినిమాలేవీ ఫెయిల్యూర్స్ కాదని చెప్పాడు.

‘‘చాలామంది అనుకున్నట్లుగా ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’.. ‘లీడర్’ ఫెయిల్యూర్లు కాదు. లీడర్ సినిమా మేం ఆశించిన స్థాయిలో ఆడలేదు కానీ.. ఫెయిల్యూర్ కాదు. దానికి బాగానే డబ్బులొచ్చాయి. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ కూడా అంతే. ఐతే ఆ సినిమాలు నా అంచనాల్ని అందుకోలేదు. అంతే. ‘అనామిక’ విషయంలో మాత్రం నా వైఫల్యాన్ని ఒప్పుకుంటాను. అది రీమేక్ మూవీ. నేనే సొంతంగా కథ రాసి ఉంటే బాగుండేది. ఆ సినిమా వచ్చింది వెళ్లింది కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. అదే నా రియల్ ఫెయిల్యూర్’’ అని కమ్ముల చెప్పాడు. ఇక తాను ‘ఆనంద్’ కంటే ముందు తీసిన ‘డాలర్ డ్రీమ్స్’ ఇప్పుడు చూసుకున్నా గొప్పగా అనిపిస్తుందని.. ఇంత గొప్పగా ఎలా తీశానా అనిపిస్తుందని.. ఒక్క డబ్బింగ్ విషయం పక్కన పెడితే అందులో ఏ లోపాలూ లేవని శేఖర్ అన్నాడు. ‘ఆనంద్’ విషయంలోనూ డబ్బింగ్ విషయంలో కొన్ని ఇబ్బందులుంటాయని అతనన్నాడు.