Begin typing your search above and press return to search.

త్రివిక్రమ్ అంత గొప్పగా రాయలేను కానీ..

By:  Tupaki Desk   |   31 Dec 2017 11:30 PM GMT
త్రివిక్రమ్ అంత గొప్పగా రాయలేను కానీ..
X
తెలుగు సినిమాలోకి ఒక తాజాదనపు వెల్లువను తీసుకొచ్చిన దర్శకుల్లో శేఖర్ కమ్ముల ఒకడు. అతడు వేసిన బాటను తర్వాతి కాలంలో ఎంతోమంది యువ దర్శకులు నడిచారు. కమ్ముల సినిమాల్లో అడుగడుగునా అతడి ముద్ర కనిపిస్తుంది. పాత్రలు.. వాటి చిత్రణ.. సంభాషణలు.. అన్నింటా ఒక కొత్తదనాన్ని తెచ్చాడు కమ్ముల. ముఖ్యంగా కమ్ముల సినిమాల్లో డైలాగ్స్ చాలా సహజంగా.. అందరూ ఈజీగా కనెక్టయ్యేలా ఉంటాయి. కమ్ముల కొత్త సినిమా ‘ఫిదా’లో డైలాగ్స్ ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిందే. ఐతే తాను డైలాగ్స్ బాగా రాస్తా కానీ.. త్రివిక్రమ్ శ్రీనివాస్ అంత గొప్పగా మాత్రం రాయలేనని కమ్ముల ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం.

‘‘నేను త్రివిక్రమ్ అంత గొప్పగా మాటలు రాయలేదు. కొత్త పదాలు పుట్టించలేను కానీ నా సినిమాల్లో పాత్రలు.. సన్నివేశాలకు అనుగుణంగా మాట్లాడుకుంటాయి. బాధొస్తే పంచుకుంటాయి. ‘లీడర్’ సినిమాలో ఒక అమ్మాయికి న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత పోతే ఎంత అని ఒక డైలాగ్ ఉంటుంది. ఆ సన్నివేశంలో రెండు పేజీల పవర్ ఫుల్ డైలాగుల కంటే ఇదే ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది. అవినీతి చేయకపోవడమే త్యాగం అంటూ ఆ సినిమాలో మరో మంచి డైలాగ్ ఉంటుంది. ఇలా సన్నివేశాలకు అనుగుణంగానే నా మాటలుంటాయి. నేను హైదరాబాద్ లో పుట్టి పెరగడం వల్ల ‘ఫిదా’ సినిమాలో ఈ మాండలికంలో బాగా మాటలు రాయగలిగాను. నిజానికి ఈ మాండలికంలో నేను రాయడం మొదలుపెడితే ప్రవాహంలా వెళ్లుతుంది. ‘ఆనంద్’ సినిమా చదువుకున్న వాళ్లే చూశారనుకుంటే.. ‘ఫిదా’ సినిమాను అందరూ చూశారు. అది జన సామాన్యంలోకి వెళ్లింది’’ అని కమ్ముల చెప్పాడు.