Begin typing your search above and press return to search.

శేఖర్ కమ్ముల మళ్లీ పాత స్టయిల్లో

By:  Tupaki Desk   |   5 July 2018 5:41 AM GMT
శేఖర్ కమ్ముల మళ్లీ పాత స్టయిల్లో
X
‘అనామిక’ సినిమా తర్వాత అడ్రస్ లేకుండా పోయాడు శేఖర్ కమ్ముల. మూడేళ్లకు పైగా సినిమానే లేదు అతడికి. అందరూ కమ్ములను మరిచిపోతున్న తరుణంలో దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత అతడిని నమ్మి ‘ఫిదా’ తీశాడు. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ తిరుగులేని విజయాన్నందించాడు కమ్ముల. ఈ సినిమా శేఖర్ లోనూ ఆత్మవిశ్వాసాన్నినింపినట్లుంది. ఈసారి మరో నిర్మాత మీద ఆధారపడాల్సిన అవసరం లేకపోయింది. మళ్లీ పాత స్టయిల్లో సొంత సినిమా చేయడానికి కమ్ముల రెడీ అవుతున్నట్లు సమాచారం. ‘ఫిదా’ తర్వాత పెద్ద బేనర్లు.. పెద్ద హీరోలు అతడితో పని చేయడానికి రెడీగా ఉన్నప్పటికీ.. సొంత బేనర్లో కొత్తవాళ్లతో సినిమా చేయడానికే కమ్ముల ఆసక్తితో ఉన్నట్లు సమాచారం.

ఇంతకుముందు ‘ఆనంద్’.. ‘హ్యాపీడేస్’.. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ లాంటి సినిమాలు నిర్మించిన తన ‘అమిగోస్ క్రియేషన్స్’ బేనర్లోనే కమ్ముల తర్వాతి సినిమా ఉంటుందట. ఈ చిత్రంలో ఒక కొత్త హీరో నటిస్తాడని.. అతడి సరసన మాత్రం పేరున్న కథానాయికే కనిపిస్తుందని.. మిగతా నటీనటుల్లో ఎక్కువమంది కొత్తవాళ్లే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘ఫిదా’ రిలీజై దాదాపు పది నెలలు కావస్తున్నా కమ్ముల ఇంకా తర్వాతి సినిమానైతే ప్రకటించలేదు. ఇంకొన్ని రోజుల్లోనే ప్రకటన వస్తుందంటున్నారు. హిట్టు కొట్టినా.. ఫ్లాప్ తీసినా కమ్ములలో హడావుడి ఉండదు. బాగా టైం తీసుకుని స్క్రిప్టు రెడీ చేసుకుంటాడు. ఈసారి కూడా అలాగే నింపాదిగా ఉన్నాడు. ఐతే స్క్రిప్టు రెడీ అయ్యాక మాత్రం వేగంగా సినిమా తీసేస్తాడు. త్వరలోనే సినిమాను మొదలుపెట్టి వచ్చే వేసవికి బాక్సాఫీస్ బరిలో నిలవాలని కమ్ముల యోచిస్తున్నట్లు సమాచారం.