Begin typing your search above and press return to search.

ప్రతి సినిమాకూ 4-5 కిలోలు తగ్గుతాడట

By:  Tupaki Desk   |   19 July 2017 5:30 PM GMT
ప్రతి సినిమాకూ 4-5 కిలోలు తగ్గుతాడట
X
సినిమా తీయడం మొదలుపెడితే తనకు లోకమే తెలియదంటున్నాడు శేఖర్ కమ్ముల. తనతో పని చేయడం చాలామందికి కష్టమని.. తన పనితీరు అదో తరహాలో ఉంటుందని అతను చెప్పాడు. ‘‘నా వరకు ప్రతి సినిమా ఒక కల. నా టైం నేను తీసుకుని చేస్తే బెస్ట్ ఔట్ పుట్ ఇవ్వగలను. నా ప్రతి సినిమాకూ నేను 4-5 కిలోల బరువు తగ్గుతుంటాను. నా టీంతో కలిసి అంతగా కష్టపడతాను’’ అని శేఖర్ కమ్ముల చెప్పడం విశేషం.

‘ఫిదా’ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణ శైలికి.. తన దర్శకత్వ శైలికి కూడా చాలా తేడా ఉంటుందని కమ్ముల తెలిపాడు. ‘‘నేను.. ఆయన భిన్నమైన వాతావరణాల్లో పని చేస్తాం. ఆయన ప్లాన్డ్ సెటప్ లో వర్క్ చేస్తారు. నేను సెట్లో అప్పటికప్పుడు నా ఆలోచనలకు తగ్గట్లుగా నా టీంతో పని చేస్తాను. అందుకేనేమో ‘ఫిదా’ విషయంలో ఆయన అస్సలు జోక్యం చేసుకోలేదు. నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు’’ అని కమ్ముల తెలిపాడు.

దర్శకుడు ఓ కథ విషయంలో మనసులో అనుకునేదంతా తెరమీదకు తీసుకురావడం చాలా కష్టమని కమ్ముల తెలిపాడు. అది ఏ దర్శకుడి వల్లా సాధ్యం కాదన్నాడు. మన ఆలోచనల్ని 70 శాతం తెర మీదికి తీసుకురాగలిగితే.. ఆ సినిమా అద్భుతంగా ఉంటుందని.. ఐతే తాను 60 శాతం వరకు తీసుకురాగలనని కమ్ముల చెప్పాడు. ‘ఫిదా’ సినిమాను తాను అనుకున్నదానికి దగ్గరగానే తీశానని కమ్ముల తెలిపాడు.