Begin typing your search above and press return to search.

అమ్మాయిలకు అందమే కాదు, ఆత్మవిశ్వాసమూ ఉండాలి: శేఖర్ కమ్ముల

By:  Tupaki Desk   |   11 Oct 2021 1:30 AM GMT
అమ్మాయిలకు అందమే కాదు, ఆత్మవిశ్వాసమూ ఉండాలి: శేఖర్ కమ్ముల
X
సినిమా కథలలో రెండు రకాలు కనిపిస్తాయి. ఆకాశంలో తేలే కథలు కొన్నయితే . నేలపై నడిచే కథలు కొన్ని. ఆకాశంలో తేలే కథలు తొందరగా అదృశ్యమవుతాయి. నేలపై నడిచే కథలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. కళ్లముందు ఎక్కువ కాలం ఉంటాయి. అలా నేలపై నడిచే కథలను తెరపై అద్భుతంగా ఆవిష్కరించే అతి తక్కువ మంది దర్శకులలో శేఖర్ కమ్ముల ఒకరుగా కనిపిస్తారు. ఆయన కథలు ఊహల్లో నుంచి పుట్టవు. కలల రెక్కలను తగిలించుకుని ఎగరవు. తన చుట్టూ ఉన్న జీవితాలను పరిశీలిస్తూ, వాటిలో నుంచి తన కథకు కావలసిన ముడిసరుకును ఆయన తయారు చేసుకుంటారు. అందువల్లనే ఆయన కథలు మనసుకు అంత దగ్గరగా ఉంటాయి.

సినిమా అనగానే కాలక్షేపానికి కాసేపు చూసేది .. అందానికి మించిన వినోదం మరేదీ అందించలేదు. ఆ కోణంలో హీరోయిన్లను చూపిస్తే సరిపోతుందనుకునే దర్శకులు లేకపోలేదు. కానీ హీరోయిన్ కి అందమే కాదు ఆత్మాభిమానం ఉంటుంది .. ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఆడిపాడటమే కాదు అంతకు మించిన విలువైన వ్యక్తిత్వం ఉంటుందనే విషయాన్ని శేఖర్ కమ్ముల తన సినిమాల ద్వారా చెబుతుంటారు. ఆయన సినిమాల్లో హీరోయిన్ తన వ్యక్తిత్వం కోసం పోరాడుతుంది. తన ఉనికి చాటుకోవడానికి ఉప్పెనకు ఎదురు నిలబడుతుంది.

'డాలర్ డ్రీమ్స్' నుంచి ఇటీవల విడుదలైన 'లవ్ స్టోరీ'వరకూ ఈ విషయాన్నే చాటిచెబుతాయి. ప్రేమ రెండు మనసులకు సంబంధించినది .. పెళ్లి రెండు కుటుంబాలకు సంబంధించినది. ఒకదాని కోసం ఒకటి వదులుకోకూడదు అనే బలమైన సందేశాన్ని ఆయన అంతర్లీనంగా ఇస్తూ ఉండటం వల్లనే, యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఆయన సినిమాలను ఎక్కువగా ఆదరిస్తుంటారు. ఆయన సినిమాల్లో ఆత్మవిశ్వాసంతో కూడిన నాయిక పాత్రలను ప్రేక్షకులు మరిచిపోలేరు. అంతగా అవి వాళ్లను ప్రభావితం చేస్తుంటాయి. ఆ పాత్రలను ఆయన ఎలా సృష్టించింది ఒక సందర్భంలో ప్రస్తావించారు.

"అమెరికా వెళ్లడమే ఒక కలగా పెట్టుకుని ఆరాటపడటం అనవసరమనే ఒక ఆలోచనలో నుంచి 'డాలర్ డ్రీమ్స్' కథ పుట్టుకొచ్చింది. ఈ కథలో నలుగురు కుర్రాళ్లు .. ఉష అనే ఒక అమ్మాయి ఫ్రెండ్స్. మన దేశాన్ని తక్కవగా చూస్తూ విదేశాలకు విలువనిస్తూ మాట్లాడే నలుగురు కుర్రాళ్లకు ఉష పాత్ర ద్వారా కౌంటర్ ఇచ్చాను. అలాంటి ఒక పాత్రకు అమ్మాయినే ఎంచుకోవడానికి కారణం, అమ్మాయిలు ఎదుర్కుంటూ వస్తున్న వివక్షనే. ఒకేసారి రెండు ఆలోచనలను రేకెత్తించడం ఇక్కడి ఉద్దేశం. ఈ పాత్ర నేను ఆశించిన స్థాయిలోనే ప్రభవితం చేసింది.

ఇక 'ఆనంద్'లో రూప పాత్ర ద్వారా నేను బలవంతంగా సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఆ పాత్రను సహజంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో అలా ఒక్కొక్కటిగా కుదిరిపోయాయి. ఒక సాధారణమైన కుటుంబానికి చెందిన ఒక అమ్మాయి, తనకి ఎదురైన పరిస్థితులను తట్టుకుని ఎలా నిలబడింది? అనేది రాసుకుంటూ వెళ్లాను. ఆ క్రమంలోనే ఆ పాత్ర మరింత బలపడుతూ వెళ్లింది .. తన ఆత్మభిమానం కాపాడుకునే క్రమంలో ఆమె తీసుకున్న నిర్ణయాలను ప్రేక్షకులు బలపరచడం వల్లనే ఆ సినిమా అంతగా విజయాన్ని సాధించగలిగింది.

'గోదావరి' గలగలలను గుర్తుచేసేలా ఈ సినిమాలో సీత పాత్రను తీర్చిదిద్దాను. ఆడపిల్లలు తమకాళ్లపై తాము నిలబడాలి .. తమని తమలానే స్వీకరించే వారిని పెళ్లి చేసుకోవాలనే ఒక ఆలోచనకు సీత పాత్ర ప్రతినిథిలా కనిపిస్తుంది. 'ఆనంద్'లోని రూప పాత్రకు .. 'గోదావరి'లోని సీత పాత్రకు మధ్య ఎంతో వైవిధ్యం ఉంది. అయినా ఈ పాత్రకు కూడా ఎంతో ఆదరణ లభించింది. అందుకు కారణం వ్యక్తిత్వంతో కూడిన ఆ పాత్రను తీర్చిదిద్దిన తీరు. ఇక 'అనామిక' విషయానికి వస్తే, నిర్భయకి నివాళిగా తీసిన సినిమా ఇది. స్త్రీని గౌరవించవలసిందే అనే విషయం చెప్పడానికి, నాకు ఇష్టం లేని రీమేక్ వైపుకు కూడా వెళ్లాను. ఆ సినిమాను నా స్టైల్లో నేను చెప్పాను .. వసూళ్ల సంగతి అలా ఉంచితే, మంచి పేరు తెచ్చిపెట్టింది.

పెళ్లి అనే పేరుతో ఆడపిల్లలు తాము పుట్టిపెరిగిన ఊరును .. కన్నవాళ్లను వదిలివెళ్లలేరు. ఆ విషయన్ని బయటికి బలంగా చెప్పిన అమ్మాయిగా 'ఫిదా'లో భానుమతి పాత్ర కనిపిస్తుంది. ఆమె యాస .. భావజాలం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. 'లవ్ స్టోరీ' సినిమాలో మౌనిక నా మిగతా సినిమాల్లోని నాయికల మాదిరిగా బలంగా కనిపించదు. ఎందుకంటే ఆ పాత్ర ద్వారా నేను బలమైన సందేశాన్ని ఇవ్వాలనుకున్నాను కనుక. ఒక బలమైన సందేశాన్ని సున్నితంగా చెప్పండంలో నేను సక్సెస్ అయ్యానని చెప్పడానికి నిదర్శనం, ఈ సినిమా సాధించిన విజయమే" అని శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చారు.