Begin typing your search above and press return to search.

ఎన్నాళ్లకెన్నాళ్లకు ఎదురుచూసిన రోజును చూపించిన ‘లవ్ స్టోరీ’

By:  Tupaki Desk   |   24 Sep 2021 4:30 AM GMT
ఎన్నాళ్లకెన్నాళ్లకు ఎదురుచూసిన రోజును చూపించిన ‘లవ్ స్టోరీ’
X
కరోనా పీడకలను ఎంత త్వరగా మర్చిపోదామని అనుకుంటున్నా సాధ్యం కాని పరిస్థితి. అన్ని రంగాలకు కాకున్నా..కొన్ని రంగాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. మాయదారి మహమ్మారి కారణంగా దారుణంగా దెబ్బ తిన్న రంగాల్లో సినిమా పరిశ్రమ ఒకటి. కరోనా కానీ రాకుండా ఉండి ఉంటే.. సినిమా హాలుకు ప్రత్యామ్నాయం ఓటీటీలన్న భావన రావటానికి మరికొంతకాలం పట్టేదేమో? కానీ.. మొదటి వేవ్.. రెండో వేవ్ ల కారణంగా నెలల తరబడి థియేటర్లు మూతబడి ఉండటం.. ఆ గ్యాప్ లో ఓటీటీ ప్రతి ఇంట్లోనూ సెటిల్ కావటమే కాదు.. థియేటర్ కు ఎందుకు? కాస్త ఆగితే ఇంట్లోకే వచ్చేస్తుంది కదా? అన్న వరకు విషయం వచ్చేసింది.

దీనికి తోడు కొన్ని ఓటీటీ ఫ్లాట్ ఫాంలు.. ఫ్యాన్సీ రేట్లను సినిమాల్ని కొనేసి.. ఓటీటీల్లో విడుదల చేయటం థియేటర్లకు పెను సవాలుగా మారింది. ఒక కుటుంబం ఒక సినిమా కోసం థియేటర్ కు వెళితే అయ్యే ఖర్చుతో.. తక్కువలో తక్కువ రెండు.. మూడు ఓటీటీ ఫ్లాట్ ఫాంలను ఏడాది పాటు కొనేసే అవకాశం ఉండటం.. అందులోని వెసులుబాటుతో ఇద్దరు.. ముగ్గురు కలిసి ప్యాక్ లు కొనుగోలు చేసే వెసులుబాటు ఉండటంతో.. ఇంటి వినోదానికే మొగ్గు చూపుతున్న పరిస్థితి.

ఇలాంటి వేళ.. భారీ అంచనాలు ఉన్న సినిమాలు.. భారీ బడ్జెట్ తో తీసిన సినిమాలు.. పెద్ద హీరోల మూవీల విడుదల విషయంలో అంతులేని అంతర్మధనం సాగుతోంది. ఇంతకాలం ఆగాం.. మరికొంతకాలం ఆగితే పోలా? అన్న ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి. ధైర్యం చేసి విడుదల చేసినా.. థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా? అన్నదిప్పుడు పెద్ద సందేహంగా మారింది. ఈ కారణంగానే సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు ఓపెన్ అయి వారాలకు వారాలు అవుతున్నా.. సరైన సినిమాను విడుదల చేయటానికి నిర్మాతలు సాహసించని పరిస్థితి.

నిజానికి థియేటర్లలో విడుదలయ్యే సినిమాలతో పోలిస్తే.. ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద విడుదల అవుతున్న కొన్ని సినిమాలు చూస్తే.. థియేటర్ల కంటే మెరుగ్గా ఉందే అనే పరిస్థితి. అయితే.. అలా విడుదలైన సినిమాలు బాగున్నాయా? లేదా? అన్నది మరో చర్చ అనుకోండి. అంతులేని అపనమ్మకం.. వసూళ్ల మీద భారీ అభద్రత నెలకొన్న వేళ.. భారీ అంచనాలు ఉన్న శేఖర కమ్ముల మూవీ ‘లవ్ స్టోరీ’ ఈ రోజు థియేటర్లలో సందడి చేయనుంది. ఏషియన్ సినిమా థియేటర్ల అధినేత నిర్మాతగా వ్యవహరించిన మూవీ కావటంతో.. సాహసించి మరీ సినిమాను విడుదల చేస్తున్నారు.

నిజానికి ఆయన అనుకున్న షెడ్యూల్ తో పోలిస్తే ఇప్పటికి దాదాపు ఐదారు నెలల తేడా ఉంది. ఇప్పటికి మనసులో సందేహాలున్నా.. కూసింత సాహసం చేసి సినిమాను విడుదల చేస్తున్నారని చెప్పాలి. నిజానికి ఇలాంటి సినిమా మామూలు రోజుల్లో విడుదల అవుతుంటే.. ముందు రోజుకు అన్నీ థియేటర్లు హౌస్ ఫుల్ అన్నంత కాకున్నా.. తొంభై శాతం మల్టీఫ్లెక్సులు.. డెబ్భై శాతం సింగిల్ థియేటర్లు విడుదలకు ముందే ఎర్ర గుర్తు కనిపించేది. కానీ.. కరోనా కారణంగా.. విడుదలకు ముందు రోజుకు బ్రౌన్ గుర్తు కనిపించి నిర్మాతలు హమ్మయ్య అనుకునేలా చేసే పరిస్థితి. పూర్తిగా థియేటర్ నిండకున్నా.. దాదాపు 80 శాతం మేర థియేటర్ నిండినట్లుగా ఆన్ లైన్ బుకింగ్ లను చూసినప్పుడు అర్థమవుతుంది. దీనికి తోడు భారీ సంఖ్యలో థియేటర్లలో విడుదల చేయటంతో కూడా దీనికి కారణంగా చెప్పాలి.

హైదరాబాద్ మహానగరంలోని ఒక ప్రముఖ మల్టీఫ్లెక్సుల గ్రూపునకు చెందిన థియేటర్లలో ఏకంగా 135 షోలను వేస్తున్నారు. మెజార్టీ థియేటర్లలో ఈ మూవీనే విడుదల చేస్తున్నారు. ఇలాంటి వేళలో.. విడుదలకు రోజు ముందే.. బుకింగ్ లు బ్రౌన్ మార్కుకు రావటం చూసినప్పుడు.. ఎన్నాళ్లకెన్నాళ్లకు అన్న భావన కలగటం ఖాయం. ఈ మూవీలోని పాటలు ఎంతలా హిట్ అయ్యాయో.. సినిమా కూడా హిట్ టాక్ వస్తే.. కలెక్షన్ల వర్షం కురవటంతో పాటు.. ఇంతకాలం నిర్మాతల్ని వెంటాడి వేధిస్తున్న భయం నుంచి అంతో ఇంతో బయటపడతారని చెప్పక తప్పదు. ప్రేక్షకుల తీర్పు ఏ రీతిలో ఉంటుందో చూడాలి.