Begin typing your search above and press return to search.

అపోలో ఆస్పత్రికి సీనియర్ నటుడు కైకాల!

By:  Tupaki Desk   |   20 Nov 2021 7:30 AM GMT
అపోలో ఆస్పత్రికి సీనియర్ నటుడు కైకాల!
X
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ(88) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో టాలీవుడ్ లో ఆందోళన నెలకొంది. సత్యనారాయణ కోలుకోవాలని పలువురు నటీనటులు, అభిమానులు కోరుకుంటున్నారు.

గత కొన్ని రోజుల క్రితం కైకాల సత్యనారాయణ ఇంట్లో కాలు జారిపడగా సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే.

1959లో సిపాయి కూతురు సినిమాతో కైకాల సత్యనారాయణ వెండితెరకు పరిచయం అయ్యారు. హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఏ పాత్రలో నటించినా ఆ పాత్రకు జీవం పోసి నవరస నట సార్వభౌమగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఖ్యాతిగడించారు. తనదైన నటనలో అభిమానులను అలరించడమే కాదు.. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు.

గత 60 ఏళ్లుగా సినీ రంగంలో ఉన్న కైకాల గత కొంతకాలం క్రితం వరకూ తండ్రి, తాత పాత్రలను పోషించారు. సుధీర్ఘ సినీ కెరీర్ లో సుమారు 777 సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించారు.

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎస్వీఆర్ తర్వాత ఆ రేంజ్ లో వైవిధ్య పాత్రల్లో నటించింది ఒక్క కైకాల మాత్రమే. పౌరాణిక, సాంఘిక , చారిత్రక , జానపద చిత్రాల్లో హాస్య, విలన్, హీరోగా నటించిన కైకాల సత్యనారాయణ కాలక్రమంలో నేటి తరానికి తండ్రి, తాత పాత్రల్లో కూడా నటించారు.

సీనియర్ ఎన్టీఆర్ తో కైకాల సత్యనారాయణకు మంచి అనుబంధం ఉంది. పలుమార్లు సత్యనారాయణ ఎన్టీఆర్ కు డూప్ గా నటించారు. కృష్ణ జిల్లా గుడ్ల వల్లేరు మండలం కౌతరం గ్రామంలో 1935 జూలై 25న కైకాల జన్మించారు. 1960లో నాగేశ్వరమ్మని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు.. ఇద్దరు కూతుళ్లు.