Begin typing your search above and press return to search.

థియేటర్లకు ఎందుకు రావట్లేదో చెప్పి.. ట్వీట్లతో గుండె ఝల్లు మనేలా చేశాడు

By:  Tupaki Desk   |   28 Aug 2022 4:25 AM GMT
థియేటర్లకు ఎందుకు రావట్లేదో చెప్పి.. ట్వీట్లతో గుండె ఝల్లు మనేలా చేశాడు
X
శుక్రవారం వచ్చిందంటే చాలు.. విడుదలయ్యే మూవీ గురించిన ముచ్చట్లతో పాటు.. రిలీజ్ అయిన సినిమాల్ని చూసేందుకు పడే ఆత్రుత.. థియేటర్లకు పోటెత్తే రోజులన్ని అప్పటి రోజులుగా మారాయి. అందుకు భిన్నంగా శుక్రవారం వస్తుందంటే చాలు.. తాము విడుదల చేసే సినిమాకు జనాలు వస్తారా? రారా? వస్తే.. ఎంత కలెక్షన్లు వస్తాయి? సినిమాకు మంచి టాక్ వస్తుందా? లేనిపోని రీతిలో బాయ్ కాట్ ఉచ్చులో చిక్కుకుంటే పరిస్థితి ఏంటి? ఇలాంటివెన్నో ప్రశ్నలతో దర్శక నిర్మాతలు వణికిపోతున్నారు. దీనంతటికి కారణం కరోనా మహమ్మారే.

మిగిలిన రంగాల సంగతి ఎలా ఉన్నా.. కరోనా కారణంగా సినిమా ఇండస్ట్రీ మొత్తం మహమ్మారికి ముందు.. తర్వాత అన్న విభజన తప్పనిసరిగా మారినట్లు చెప్పక తప్పు. దీనికి తోడు కొందరు నిర్మాతల అత్యాశ.. థియేటర్ల యజమానుల పేరాశతో.. థియేటర్లలో సినిమాలు చూసే అనుభవాన్ని అంతకంతకు తగ్గించేసుకోవటమే కాదు.. థియేటర్ల వంక చూసే ఆలోచన కూడా చేయని పరిస్థితి నెలకొంది. దీంతో.. చిత్రపరిశ్రమకు కరోనా వేసిన దెబ్బ ఒక ఎత్తు అయితే.. అనూహ్యంగా తెర మీదకు వచ్చిన కష్టాలు అతలాకుతలం చేస్తున్నాయి.

ఇలాంటివేళలో.. అనుకోని సాంత్వనను అందించాయి కల్యాణ్ రామ్ నటించిన బింబిసార.. సీతారామం.. కార్తికేయ 2 విజయాలు టాలీవుడ్ కు సరైన సంతోషాన్ని ఇచ్చాయని చెప్పాలి. అదే సమయంలో థియేటర్లు కూడా కళకళలాడిన పరిస్థితి. దీంతో.. ఇంతకాలం వరకు సాగిన ప్రచారాలు తప్పేనని తేలింది. ఓటీటీలు వచ్చాక జనాలు థియేటర్లకు రావటం మానేశారన్న మాట నూటికి నూరు శాతం నిజం కాదని తేలింది. ఎందుకంటే.. కంటెంట్ ఉండాలే కానీ థియేటర్లకు వచ్చి సినిమాలు చూసేందుకు సిద్దంగా ఉన్నారన్న విషయాన్ని స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో సీనియర్ నటుడు నరేశ్ చేసిన ట్వీట్లు ఆసక్తికరంగానే కాదు.. ఇండస్ట్రీ మొత్తం ఆయన గురించి మాట్లాడుకునేలా చేశాయని చెప్పాలి.

''టికెట్ల రేట్లు ఎక్కువగా ఉండటంతో జనాలు థియేటర్‌కు రావడం లేదన్న మాట వాస్తవమే! కానీ అదొక్కటే కారణం కాదు. ఒకప్పుడు పెప్సి, పాప్‌కార్న్‌ రూ,20, రూ.30కే దొరికేవి. కానీ ఇప్పుడు వాటి ధర రూ.300. అంటే ఓ మధ్యతరగతి కుటుంబం సినిమా చూడాలంటే మొత్తంగా రూ.2500 ఖర్చు పెట్టాల్సిందే! అలాంటప్పుడు ప్రజలు థియేటర్‌కు ఎందుకు వస్తారు? వారు మంచి సినిమాతో పాటు మంచి ఎక్స్‌పీరియన్స్‌ కోరుకుంటారు. కాస్త ఆలోచించండి'' అని నరేశ్‌ ట్వీట్‌ చేశారు.

దీనికి కొనసాగింపుగా మరో ట్వీట్ చేసిన ఆయన.. ఖర్చుల గురించి ప్రస్తావించారు. ''నేనేం అంటున్నానంటే.. ఒకప్పుడు వారం రోజుల పాటు సినిమాలు చక్కగా ఆడేవి. కానీ ఇప్పుడు ఎంత పెద్ద సినిమా అయినా రెండో రోజుకే థియేటర్‌ ఖాళీ అయిపోతుంది. ముందు థియేటర్స్‌లో ఖర్చు తగ్గిస్తే జనాలు ఎక్కువసార్లు సినిమాలు చూసేందుకు వస్తారు'' అని పేర్కొన్నారు. మొత్తంగా ఉన్నది ఉన్నట్లుగా.. చెప్పాలనుకున్న విషయాన్ని సుత్తి లేకుండా సూటిగా చెప్పేసిన నరేశ్ ట్వీట్లు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.