Begin typing your search above and press return to search.

ఆ ప్రోపర్టీ ఇప్పుడుంటే వేలకోట్లు అయ్యేది: సీనియర్ నటి

By:  Tupaki Desk   |   14 May 2022 11:30 PM GMT
ఆ ప్రోపర్టీ ఇప్పుడుంటే వేలకోట్లు అయ్యేది: సీనియర్ నటి
X
పాత సినిమాల గురించి తెలిసినవారికి 'షావుకారు జానకి 'ని గురించి ప్రత్యేకించి పరిచయం చేయనవసరం లేదు. 1950 ల లో తెలుగు తెరపైకి వచ్చిన కథానాయికలలో ఆమె ఒకరు. 'షావుకారు' సినిమాతో పరిచయం కావడం వల్లనే అది ఆమె ఇంటిపేరుగా మారిపోయింది. చాలా చిన్న వయసులోనే ఆమె సినిమాల్లోకి వచ్చింది. తొలి సినిమానే పెద్ద బ్యానర్లో చేసిన జానకి, నటన పరంగా శభాష్ అనిపించుకున్నారు. ఆ తరువాత కెరియర్ పరంగా ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. అందుకు కారణం ఆమె అంకితభావం అనే చెప్పాలి.

అప్పట్లో సావిత్రిని మించిన సహజనటి లేదు. జమునని మించిన అందగత్తె లేదు. ఇక మూడవ స్థానంలో కొనసాగిన కృష్ణకుమారి .. షావుకారు జానకి సొంత చెల్లెలే. అలాంటి కథానాయికల పోటీని తట్టుకుంటూ , తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును షావుకారు జానకి సంపాదించుకున్నారు.

అప్పట్లో ఆమె సొంత బంగ్లా మద్రాసులోనే ఫేమస్. వివిధ భాషలకి చెందిన ఎన్నో సినిమాల షూటింగులు అందులో జరుగుతూ ఉండేవి. సావిత్రితో సమానమైన ఆభరణాలు కలిగిన కథానాయికగా షావుకారు జానకి పేరే వినిపిస్తూ ఉండేది.

తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. " ఒకప్పుడు మద్రాసులో నాకు ఎంతో ప్రాపర్టీ ఉండేది. ఇప్పటి ధరతో చూసుకుంటే కొన్ని వేలకోట్ల ప్రాపర్టీ అది. ఆ ప్రాపర్టీని నేను అమ్మలేదు .. నాకు కొనడమే తప్ప అమ్మడం తెలియదు. వాళ్లు దానిని అమ్మేశారు అంతే.

జీవితంలో డబ్బే ముఖ్యం కాదు .. నమ్మకం కూడా చాలా ముఖ్యమైనదనే విషయాన్ని నేను గ్రహించాను. నేను మా వారు విడిపోయాము .. అయినా నేను ఆయనకి ఎప్పుడూ ఏ లోటూ రానీయలేదు. ఆయన దీనస్థితిలో ఉండటం నాకు ఇష్టం లేదు. అందువలన సాయం చేశాను.

అలా ఇచ్చినప్పటికీ ఆయన చాలా వృథా చేసేశాడు. మా వారి వాళ్ల ఫ్యామిలీ మంచిదే. అయితే డబ్బు దగ్గరికి వచ్చేసరికి వాళ్లంతా ఇలానే ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు చేస్తారనే విషయం ఆ తరువాత నాకు తెలిసింది. వాళ్ల నాన్నగారు సంపాదించిన ఆస్తిపాస్తులను ఈయన బ్రదర్స్ అంతా కూడా అలాగే పాడు చేశారట. అన్ని వ్యసనాలకు ఆయన అలవాటు పడ్డారు. నా విషయంలో పిల్లల మనసులను మార్చేంత దూరం వెళ్లిపోయారు. అయినా ఆయన చివరి క్షణాల్లో నేను ఆయన పక్కనే ఉన్నాను" అంటూ చెప్పుకొచ్చారు.