Begin typing your search above and press return to search.

సీనియర్ జర్నలిస్ట్ రామారావు కన్నుమూత

By:  Tupaki Desk   |   11 Feb 2020 10:15 AM GMT
సీనియర్ జర్నలిస్ట్ రామారావు కన్నుమూత
X
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో తీవ్రవిషాదం చోటు చేసుకుంది. సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా అయన ఆరోగ్య సమస్యలతో సతమతమౌతున్నారు. ఈ క్రమంలోనే అయన యూరిన్ ఇన్ఫెక్షన్‌ కు గురి కావడంతో రెండు రోజుల కింద వనస్థలిపురంలోని ప్రైవేటు హాస్పిటల్లో చేర్పించారు. అయితే , అక్కడే పరిస్థితి విషమించడంతో నేడు మరణించారు. పసుపులేటి రామారావు కి , తెలుగు సినిమా ఇండస్ట్రీ తో విడదీయరాని అనుబంధం ఉంది. 80వ దశకం నుంచి కూడా ఈయన సినిమాలతో మమేకమై, సినిమానే ప్రపంచంగా జీవిస్తున్నారు.

ఇకపోతే , పసుపులేటి రామారావు స్వస్తలం ఏలూరు. డిగ్రీ పూర్తిచేసిన ఆయన.. ప్రజానాట్య మండలి, కమ్యూనిస్టు పార్టీలో యాక్టివ్ మెంబర్‌గానూ ఉన్నారు. ఈయన జర్నలిస్ట్‌ గా తొలిసారిగా విశాలాంధ్ర పత్రికకు పనిచేసారు. ఆ తర్వాత జ్యోతిచిత్ర పత్రికకు కూడా కొన్నిరోజులు పనిచేసారు.అలాగే అనేక సినిమాలకు పీఆర్వోగా కూడా చేసారు. ప్రస్తుతం సురేష్ కొండేటి సంతోషం సినీ పత్రికకు జర్నలిస్ట్‌‌ గా పనిచేస్తున్నారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు తెలుగు సినిమా ప్రముఖులు. ముఖ్యంగా మెగా కుటుంబంతో ఆయనకు చాలా మంచి సాన్నిహిత్యం ఉంది. మెగాస్టార్ చిరంజీవిపై ఆయన పుస్తకాలు కూడా రాశారు. ముఖ్యంగా ఖైదీ నెంబర్ 150 సినిమా విడుదలైన తర్వాత చిరంజీవి 150 సినిమాల ప్రయాణంపై ఈయన రాసిన చిరంజీవితం పుస్తకం చాలా బాగా హైలైట్ అయింది.

పసుపులేటి రామారావు మృతి పట్లు పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి , రామారావు తనకెంతో ఆప్తుడని అయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకున్నారు. అలాగే సాయి ధరమ్ తేజ్ - నాని - దర్శకుడు హరీష్ శంకర్ - నిర్మాత దిల్ రాజు తదితరులు అయన మృతికి సంతాపం ప్రకటించారు. అలాగే రామారావు మృతి పట్ల జర్నలిస్టులు కూడా తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు. పత్రికా లోకానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.