Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ బిజీ అవుతున్న సీనియ‌ర్ స్టార్ హీరోయిన్స్...!

By:  Tupaki Desk   |   29 Aug 2020 11:30 PM GMT
మ‌ళ్లీ బిజీ అవుతున్న సీనియ‌ర్ స్టార్ హీరోయిన్స్...!
X
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎన్ని హిట్స్ అందుకున్నా ఎంత క్రేజ్ తెచ్చుకున్నా కొన్నాళ్ళు మాత్రమే స్టార్ స్టేటస్ తో కొనసాగుతారు. హీరోలు మాత్రం ఎప్పుడూ వాళ్లే ఉంటారు కానీ హీరోయిన్స్ మాత్రం ఏదొక రోజు ఫేడ్ అవుట్ అయిపోవాల్సిందే. ఇక ఏజ్ పెరుగుతున్న కొద్దీ హీరోయిన్స్ కి అవ‌కాశాలు కూడా త‌గ్గిపోతుంటాయి. ఆ తర్వాత పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవడమే లేదా సినిమా మీద ఇష్టంతో క్యారక్టర్ ఆర్టిస్టుగా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ నెట్టుకొస్తుంటారు. అయితే ఏజ్ బార్ అవుతున్న నలుగురు సీనియర్ స్టార్ హీరోయిన్స్ మాత్రం వరుస సినిమా ఆఫర్స్ దక్కించుకుంటూ నేటిత‌రం హీరోయిన్ల‌కి పోటీగా మారుతున్నారు. వారే త్రిష‌ - న‌య‌తార‌ - త‌మ‌న్నా - కాజ‌ల్ అగర్వాల్.

కాగా ఈ న‌లుగురు ముద్దుగుమ్మలు గ‌త కొన్నేళ్లుగా ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్నారు. వారిలో సీనియర్ బ్యూటీ నయనతార.. మూడు పదుల వయసు దాటినా ఇప్పటికీ తరగని అందంతో క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటూ బిజీగా గడుపుతోంది. సీనియర్ హీరోలతో పాటు కుర్ర హీరోల‌తో లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌లో నటిస్తూ ఉంది. ప్రస్తుతం నయన్ లైనప్ చూస్తుంటే ఆమె డేట్స్ దొర‌కాలంటే రెండేళ్లు ఆగాల్సిన ప‌రిస్థితి కనిపిస్తోంది. 'నేత్రికాన్' 'మూకుతి అమ్మన్' 'కాతువాకుల రెండు కాదల్' చిత్రాలతో పాటు సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన 'అన్నాత్తే' సినిమాలోనూ నటిస్తోంది.

ఇక కాజ‌ల్ పాప ది కూడా సేమ్ పొజిషన్. కెరీర్ స్టార్ట్ చేసి పన్నెండేళ్ళు అవుతున్నా ఇప్పటికీ అదే జోరు కొనసాగిస్తోంది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమాతో పాటు మంచు విష్ణు 'మోసగాళ్లు' మూవీలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇక తమిళంలో కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్ లో వస్తున్న 'ఇండియన్ 2' మరియు 'హే సినామికా' అనే సినిమాలో నటిస్తోంది. అలాగే హిందీలో 'ముంబయి సాగా' అనే సినిమాలో కనిపించనుంది. ఈ క్రమంలో 'లైవ్ టెలికాస్ట్' అనే తమిళ్ వెబ్ సిరీస్ లో నటిస్తూ ఓటీటీ వరల్డ్ లో సత్తా చాటడానికి ప్లాన్స్ వేసుకుంది. ఇప్పుడు మాలీవుడ్ నుంచి కూడా అమ్మడికి ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది.

మిల్కీ బ్యూటీ తమన్నా సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక బ్రాండ్ సెట్ చేసుకుంది. కెరీర్ స్టార్ట్ చేసిన ఇన్నేళ్ళలో ఒక్క ఏడాది కూడా మిల్కీ బ్యూటీ ఖాళీగా లేదంటేనే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం 'సీటీమార్' సినిమాలో నటిస్తున్న తమన్నా కన్నడలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'లవ్ మాక్ టైల్' తెలుగులో రీమేక్ 'గుర్తుందా శీతాకాలం'లో నటించనుంది. అయితే కేవ‌లం హీరోయిన్ రోల్స్ నే కాకుండా విల‌న్ కూడా చేయ‌డానికి ముందుకు వస్తోందని.. ఈ బ్యూటీఫుల్ లేడీ విల‌న్ కి క‌థ‌లు కూడా రెడీ చేస్తున్నారని సమాచారం.

సీనియర్ హీరోయిన్లలో ఒకరైన త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళవుతున్నా కొత్త హీరోయిన్స్ కి పోటీగా అవాకాశాలు అందిపుచ్చుకుంటూ ఇప్పటికీ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. త్రిషకి ఆ మధ్య కొన్నాళ్లు గ్యాప్ వచ్చినా మ‌ళ్లీ ఈ బ్యూటీ ఫుల్ స్పీడ్ పెంచింది. త్రిష ప్రస్తుతం మణిరత్నం తెరకెక్కిస్తున్న 'పొన్నియన్ సెల్వన్' చిత్రంలో నటిస్తోంది. అలాగే ఆమె నటించిన 'పారపాధమ్ విలయట్టు' 'గర్జనాని' 'రాంగీ' 'షుగర్' 'రామ్' లాంటి చిత్రాలు రిలీజ్‌ కు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ స్టార్ హీరోయిన్స్ బ్యాచ్ లోంచి అనుష్క‌ - హ‌న్సిక మాత్రం ఇప్పుడు సైడ్ అయిపోయారు. ఒకటీ అర సినిమాలు తప్ప పెద్దగా సినిమాలు కమిట్ అవడం లేదు. ఇక సీనియర్ హీరోయిన్ ఛార్మీ సినిమాల్లో ఉన్నా హీరోయిన్ గా కాకుండా నిర్మాతగా బిజీ అయిపోయింది.