Begin typing your search above and press return to search.

'ఆర్.ఆర్.ఆర్' గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన సెంథిల్...!

By:  Tupaki Desk   |   3 Jun 2020 3:43 PM GMT
ఆర్.ఆర్.ఆర్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన సెంథిల్...!
X
సినీ ఇండస్ట్రీలో విజనరీ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి - సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ కలయికలో ఇప్పటి వరకు ఏడు చిత్రాలు వచ్చాయి. ఈ సినిమాలు సూపర్ హిట్స్ గా నిలవడమే కాకుండా విజువల్ వండర్స్ గా మిగిలిపోయాయి. 'బాహుబలి' సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా పాకేలా చేసారు. రాజమౌళి - సెంథిల్ కుమార్ ల బంధం 'సై' సినిమాతో ప్రారంభమైంది. వీరి కాంబినేషన్ లో ఆ తర్వాత 'యమదొంగ' 'మగధీర' 'ఈగ' 'ఛత్రపతి' 'బాహుబలి - ది బిగినింగ్' 'బాహుబలి - ది కంక్లూషన్' వంటి అద్భుతమైన సినిమాలు వచ్చాయి. రాజమౌళి పనితనం దగ్గరి నుండి చూసిన వారిలో సెంథిల్ ఒకరు. ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 'ఆర్.ఆర్.ఆర్' వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న 8వ సినిమా. దర్శకధీరుడు రాజమౌళి రెండేళ్ల గ్యాప్ తీసుకొని స్టార్ హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ లతో 'రౌద్రం రణం రుధిరం' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

టాలీవుడ్ లో భారీ మల్టీస్టారర్‌ గా రూపొందుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్‌ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో చరణ్ 'మన్నెం దొర అల్లూరి సీతారామ రాజు'గా కనిపిస్తుండగా తారక్ 'కొమరం భీమ్' పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. యావత్ సినీ అభిమానులు 'ఆర్.ఆర్.ఆర్' సినిమా కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాకి సంభందించిన పలు విషయాలను సినిమాటోగ్రాఫర్ కె.కె.సెంథిల్ కుమార్ పంచుకున్నారు.ఈ సందర్భంగా రాజమౌళితో తన ఎక్సపీరియన్స్ గురించి షేర్ చేసుకుంటూ.. రాజమౌళి సినిమా సినిమాకి కొత్తదనం చూపించాలని ఆశపడతారు.. గత చిత్రానికి మించి ప్రస్తుతం తీసే సినిమా ఉండాలని కోరుకుంటారు.. వర్క్ విషయంలో ఎప్పటికప్పుడు అప్డేట్ అవగలిగే వ్యక్తులు మాత్రమే అతనితో పని చేయగలరని చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా 'బాహుబలి' 'ఆర్.ఆర్.ఆర్' గొప్ప సినిమాలు.. కానీ రెండు వేటికి అవే డిఫరెంట్. 'బాహుబలి' కల్పిత కథ. మాహిస్మతి సామ్రాజ్యం ఉహల్లోంచి పుట్టుకొచ్చింది. కానీ 'ఆర్.ఆర్.ఆర్' రియలిస్టిక్ పాత్రలతో జరిగే కథ. ఆ పాత్రల తీరు తెన్నులు ఎలా ఉంటాయో ప్రజలకు తెలుసు.. అలానే ఇండిపెండెన్స్ కి ముందు జరిగిన చరిత్ర కూడా ప్రజలకు తెలుసు. దీని వలన ఆ రోజుల్లో ఇండియా ఎలా ఉండేదో.. పరిస్థితులు ఎలా ఉండేవో కచ్చితంగా చూపించాల్సి వస్తుంది. అందుకే ఈ సినిమా నాకు ఛాలెంజింగ్ మూవీ అని చెప్పవచ్చు. దీనికి తగ్గట్టే ఈ సినిమా చిత్రీకరణ కొనసాగిందని వెల్లడించారు. అంతేకాకుండా 'ఆర్.ఆర్.ఆర్'లో చరణ్ - తారక్ ఇద్దరూ అద్భుతమైన నటన కనబరిచారని కొనియాడారు. కాగా పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగణ్ అలియా భట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జక్కన్న ఆస్థాన సంగీత దర్శకుడు కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని అందించనున్నారు.