Begin typing your search above and press return to search.

కలవరపెడుతున్న సీక్వెల్ సెంటిమెంట్..!

By:  Tupaki Desk   |   7 May 2022 1:30 AM GMT
కలవరపెడుతున్న సీక్వెల్ సెంటిమెంట్..!
X
టాలీవుడ్ లో సీక్వెల్స్ - ఫ్రాంచైజీలు పెద్దగా వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. ఏవో ఒకటీ రెండు తప్ప.. ఎక్కువ శాతం అలాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. విజయవంతమైన సినిమాలకు సీక్వెల్స్ లేదా ఫ్రాంచైజీలు కావడంతో.. చాలా వరకు అంచనాలను అందుకోవడంలో విఫలమై ఫ్లాప్స్ లేదా డిజాస్టర్లుగా మిగిలాయి.

ఇతర ఇండస్ట్రీల్లో ఒక హిట్ ఫార్ములా అయిన సీక్వెల్ తంతు.. తెలుగులో మాత్రం సెక్సస్ కాలేకపోతోంది. బాలీవుడ్ - కోలీవుడ్ మాదిరిగా మనోళ్లు సీక్వెల్స్ తో సూపర్ హిట్లు అందుకోలేకపోయారు. స్టార్ హీరోలు - క్రేజీ కాంబినేషన్స్ లో చేసినా ఎక్కువ శాతం నిరాశే ఎదురైంది.

'మనీ' హిట్ అయితే.. కొనసాగింపుగా వచ్చిన 'మనీ మనీ' 'మనీ మనీ మోర్ మనీ' ప్లాప్ అయ్యాయి. 'శంకర్ దాదా ఎంబీబీఎస్' విజయం సాధిస్తే.. అదే ప్రాంఛైజీలో రూపొందిన 'శంకర్ దాదా జిందాబాద్' నిరాశ పరించింది. సూపర్ హిట్ 'గాయం' చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన 'గాయం 2' డిజాస్టర్ అయింది. 'శివ' ప్రాంఛైజీలో తెరకెక్కిన 'శివ 2' డిజార్డర్ ఫలితాన్ని అందుకుంది.

'చంద్రముఖి' చిత్రానికి సీక్వెల్ గా రూపొందిన 'నాగవల్లి'.. 'వినాయకుడు' తర్వాత వచ్చిన 'విలోజ్ లో వినాయకుడు' సినిమాలు ప్లాప్స్ గా ముగిశాయి. 'ఆర్య' ప్రాంఛైజీలో 'ఆర్య 2'.. 'కిక్' సీక్వెల్ 'కిక్ 2'.. 'యమలీల' సీక్వెల్ 'యమలీల మళ్ళీ మొదలైంది' వంటి చిత్రాలు పరాజయం చవిచూశాయి. 'గబ్బర్ సింగ్' చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన 'సర్దార్ గబ్బర్ సింగ్' డిజాస్టర్ అయింది.

ఇప్పుడు తెలుగులో మరికొన్ని హిట్ చిత్రాలకు సీక్వెల్స్ రాబోతున్నాయి. వాటిల్లో ముందుగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ''ఎఫ్ 3'' సినిమా థియేటర్లలోకి రాబోతోంది. మే 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

'F 3' అనేది సీక్వెల్ కాదు.. 2019లో వచ్చిన బ్లాక్ బస్టర్ 'F 2' యొక్క ఫ్రాంచైజీ. కొత్త కథతో అవే పాత్రలు - క్యారెక్టరైజేషన్లతో రెట్టింపు వినోదంతో ఈ సినిమా రూపొందింది. 'ఎఫ్ 2' చిత్రంలో భార్యాభర్తల కథకు ఫన్ - ఫస్ర్టేషన్ కలిపి చూపిస్తే.. ఈసారి డబ్బు అనే ఎలిమెంట్ ని జత చేశారు. డబ్బు కారణంగా వీరు ఎదుర్కొనే ఇబ్బందులు.. పరిస్థితులు మనల్ని నవ్వించబోతున్నాయి.

ఇందులో విక్టరీ వెంకటేష్ రేచీకటి బాధితుడిగా.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నత్తితో మాట్లాడే యువకుడిగా కనిపించనున్నారు. తమన్నా భాటియా - మెహ్రీన్ హీరోయిన్లుగా నటించగా.. సోనాలి చౌహన్ స్పెషల్ రోల్ లో నటించింది. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేతో ఐటమ్ సాంగ్ చేయించారు.

ఇప్పటికే విడుదలైన 'ఎఫ్ 3' ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మే 9న 2:32 నిమిషాల నిడివితో థియేట్రికల్ ట్రైలర్ విడుదల కానుంది. ఇందులో సునీల్ - రాజేంద్ర ప్రసాద్ - వెన్నెల కిషోర్ - మురళీ శర్మ - రఘుబాబు - శ్రీకాంత్ అయ్యంగార్ - పృథ్వీరాజ్ వంటి భారీ తారాగణం కనిపించనున్నారు.

'ఎఫ్ 3' చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. హర్షిత్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. తమ్మిరాజు ఎడిటింగ్ చేశారు.

అయితే సీక్వెన్ సినిమాల నెగెటివ్ సెంటిమెంట్ సినీ అభిమానులను కలవరపెడుతోంది. ఆ సెంటిమెంటును 'ఎఫ్ 3' సినిమాతో బ్రేక్ చేయాలని కోరుకుంటున్నారు. అదే జరిగి F3 బ్లాక్ బస్టర్ సాధిస్తే.. అనిల్ రావిపూడి భవిష్యత్ లో ఈ ప్రాంఛైజీలో 'ఎఫ్ 4' సినిమా రూపొందే అవకాశం ఉంది. మరి బాక్సాఫీస్ వద్ద ఏం జరుగుతుందో చూడాలి.