Begin typing your search above and press return to search.

మ‌హేష్ తో సీక్వెల్స్ .. పూరి అలా అనేశారేంటీ?

By:  Tupaki Desk   |   24 Aug 2022 4:17 AM GMT
మ‌హేష్ తో సీక్వెల్స్ .. పూరి అలా అనేశారేంటీ?
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టించిన 'పోకిరి' అప్ప‌ట్లో ఆల్ టైమ్ ఇండ‌స్ట్రీ హిట్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా డైలాగులు యువ‌త‌రంలో గొప్ప ప్ర‌భావం చూపాయి. పూరి మార్క్ స్ఫూర్తివంత‌మైన సంభాష‌ణ‌లు పెద్ద‌గా క్లిక్క‌య్యాయి. ఈ మూవీ తెలుగులో క‌మ‌ర్షియ‌ల్ విజయం సాధించ‌డ‌మే గాక ప‌లు భాష‌ల్లోకి రీమేకై అక్క‌డా సంచ‌ల‌న విజ‌యాలు న‌మోద‌య్యాయి. పోకిరి మహేష్ బాబు కెరీర్ లో ఒక మైలురాయిగా మిగిలిపోయింది.

అందుకే పోకిరికి సీక్వెల్ తెర‌కెక్కించే ఆలోచ‌న‌ పూరి మైండ్ లో ఉంద‌ని చాలా కాలంగా ప్ర‌చారం ఉంది. కానీ మ‌హేష్ తో ఇటీవ‌ల పూరీకి అవ‌కాశం చిక్క‌డం లేదు. ఇక పోకిరి త‌ర్వాత మ‌హేష్ తో చేసిన బిజినెస్ మేన్ కూడా విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ కాన్సెప్ట్ ఆస‌క్తిక‌రం. తెర‌కెక్కించిన విధానం అంతే బ్రిలియంట్ గా ఉంటుంది. పోకిరి త‌ర్వాత ఆ రేంజులో బిజినెస్ మేన్ డైలాగులు పేలాయి. యూత్ బాగా హ‌మ్ చేసారు. అందుకే ఈ మూవీకి కూడా సీక్వెల్ ని తెర‌కెక్కించాల‌ని పూరి భావించారు. కానీ అది కూడా వీలు ప‌డ‌లేదు. పూరి ఓ ప్రాజెక్ట్ కోసం మ‌హేష్ ని సంప్ర‌దించినా అది టేకాఫ్ కాలేదు. ఆ త‌ర్వాత ఇరువురి న‌డుమా దూరం పెరిగిన సంగ‌తి తెలిసిందే.

కానీ ఇప్ప‌టికీ మ‌హేష్ తో సీక్వెల్స్ చేయాల‌నే ఆలోచ‌న‌లో పూరి ఉన్నారు. మ‌హేష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన పోకిరి- బిజినెస్ మేన్ చిత్రాల‌కు సీక్వెల్స్ రూపొందించాల‌నే ఆలోచ‌న పూరి మైండ్ లో బ‌లంగా ఉంది. ఇటీవ‌ల త‌న మూవీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో సీక్వెల్స్ ఆలోచన గురించి పూరీ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. బిజినెస్ మేన్ ను సులభంగా ఫ్రాంచైజీగా మార్చుకోవచ్చని పూరీ జగన్నాథ్ అన్నారు. సూర్య భాయ్ క్యారెక్టర్ తో తాను చేయగలిగినవి ఇంకా చాలా ఉన్నాయని అన్నారు. పోకిరి ఫ్రాంఛైజీని కూడా కొన‌సాగించే వీలుంద‌ని పూరి త‌న అభిప్రాయం చెప్పారు.

'పోకిరి' పార్ట్ 2 పై 2010 ప్రారంభంలోనే నాకు ఆలోచన వచ్చింది. బిజినెస్ మేన్ 2 ఆలోచనా ఉంది. కానీ మహేష్ సార్ ఇతర చిత్రాలతో బిజీగా ఉన్నారు. మేము అప్పుడు సీక్వెల్స్ గురించి ఎప్పుడూ చర్చించలేదు. అందుకే రెండు సినిమాలూ ప్రారంభం కాలేదు.. అని పూరి అన్నారు. ఆ రెండిటి విజ‌యాల‌ను ప‌రిశీలిస్తే.. సీక్వెల్స్‌ ఎంత పెద్దవిగా ఉంటాయో అంచ‌నా వేయొచ్చు. ఇక బిజినెస్ మేన్ (యావ‌రేజ్ హిట్) తెలుగులో బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన స్థాయికి చేరుకోక‌పోవ‌డం కూడా ఈ క‌ల‌యిక రిపీట్ కాక‌పోవ‌డానికి కార‌ణ‌మైంద‌ని గుస‌గుస కూడా వినిపించింది.

ఆ త‌ర్వాత మ‌హేష్ తో 'జ‌న‌గ‌న‌మ‌ణ' చేయాల‌ని పూరి శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మ‌య్యాడు. ఇప్పుడు అదే సినిమాని దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కిస్తున్నారు. ఇక 'బిజినెస్ మేన్' ని హిందీలో రీమేక్ చేయాలనుకుంటున్నట్లు కూడా పూరీ చెప్పారు. హీరో పాత్రకు చాలా స్కోప్ ఉంటుంది. ఇది డైలాగ్ ఆధారిత చిత్రం .. హిందీ బెల్ట్ లో ఇది గొప్ప విజ‌యం సాధిస్తుంద‌ని భావిస్తున్నాను. ఈ ఆలోచనపై రీవర్క్ చేయడానికి .. హిందీ ప్రేక్షకులకు త్వరలో అందించడానికి నాకు అవకాశం లభిస్తుందని ఆశిస్తున్నాను.. అని కూడా పూరి ఆశాభావం వ్య‌క్తం చేశారు.

అయితే భారీ అంచ‌నాల న‌డుమ రిలీజ‌వుతున్న లైగ‌ర్ విజ‌యం దేనికైనా స‌మాధానంగా నిలుస్తుంది. ఒక‌వేళ లైగ‌ర్ పాన్ ఇండియా కేట‌గిరీలో సంచ‌ల‌న విజ‌యం సాధిస్తే వెంట‌నే మ‌హేష్ నుంచి పూరీకి కాల్ రావొచ్చు. పోకిరి.. బిజినెస్ మేన్ లైన్స్ తో సీక్వెల్స్ గురించి అడిగినా అడ‌గొచ్చు. ఎలానూ మ‌హేష్ త‌దుప‌రి త్రివిక్ర‌మ్ - రాజ‌మౌళి తో వ‌రుస‌గా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. త‌దుప‌రి పూరీతోనూ పాన్ ఇండియా ప్లాన్ వ‌ర్క‌వుట‌వుతుంద‌నే భావించాలి. హిట్టు ఇచ్చే ద‌ర్శ‌కుల వెంట ప‌డే మ‌హేష్ .. ఈసారి పూరీకి టచ్ లోకి రావాలంటే 'లైగ‌ర్' తోనే సమాధానం ఇవ్వాలి!!