Begin typing your search above and press return to search.

'లవ్ స్టోరీ' కోసం రెండు క్లైమాక్సులను సెట్ చేశారట!

By:  Tupaki Desk   |   22 Sep 2021 5:30 PM GMT
లవ్ స్టోరీ కోసం రెండు క్లైమాక్సులను సెట్ చేశారట!
X
ప్రేమలో పడటానికి ఎవరి అనుమతి అవసరం లేదు .. కానీ ఆ ప్రేమ ఫలించాలంటే మాత్రం పెద్దల అనుమతి కావాలి. కులం .. గోత్రం .. వారం .. వర్జ్యం .. జాతకాలు చూసుకుని ప్రేమలో పడరు కనుక, ఆ ప్రేమకు పెద్దల అనుమతి ఎలాగూ లభించదు. ఇటు ప్రేమను వదులుకోలేరు .. అటు పెద్దలను ఎదిరించలేరు. అలాంటి పరిస్థితుల్లో ఒక ప్రేమజంట ఏం చేసింది? ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంది? అనే ఆసక్తికరమైన మలుపులతో 'లవ్ స్టోరీ సినిమా రూపొందింది. చైతూ - సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమాకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించాడు.

నారాయణ దాస్ నారంగ్ - రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమాను, ఈ నెల 24వ తేదీన భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో .. ఈ సినిమా కోసం శేఖర్ కమ్ముల రెండు క్లైమాక్సులను అనుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ రెండు క్లైమాక్సులను ఆయన చిత్రీకరించాడట. ఒక క్లైమాక్స్ హ్యాపీ ఎండింగ్ తో కూడినదైతే, మరో క్లైమాక్స్ విషాదాంతమని తెలుస్తోంది. చివరి నిమిషంలో ఏ క్లైమాక్సును ఆయన సెట్ చేస్తారనే విషయం ఎవరికీ తెలియదట. ఎడిటింగ్ రూమ్ నుంచి కూడా ఈ విషయం బయటికి రాలేదని చెప్పుకుంటున్నారు. ఏ క్లైమాక్స్ ను ఆయన ఫిక్స్ చేసి ఉంటాడనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.

ఇక సెకండ్ వేవ్ తరువాత థియేటర్లకు చాలా సినిమాలు వచ్చాయి. అయితే జనంలో ఇంకా జంకు పోకపోవడం వలన కొన్ని సినిమాలకు మంచి టాక్ వచ్చినా వసూళ్లు గిట్టుబాటు కాలేదు. మరికొన్ని సినిమాలు థియేటర్లకు వచ్చి వెళ్లిన విషయం కూడా ఎవరికీ తెలియదు. కానీ 'లవ్ స్టోరీ' విషయంలో మాత్రం పరిస్థితి అలా లేదు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగులు చాలా వేగంగా జరిగిపోతున్నాయి. ఊహించనంత వేగంగా టికెట్లు అమ్ముడవుతున్నాయట. ఇప్పటికే వీకెండ్ లో టికెట్లు దొరికే పరిస్థితి లేదని అంటున్నారు. ముఖ్యంగా నగరాల్లో హౌస్ ఫుల్స్ ఎక్కువగా పడనున్నాయని చెబుతున్నారు. శేఖర్ కమ్ముల టేకింగ్ పై గల నమ్మకం .. సాయిపల్లవి నటన పట్ల గల ఇష్టం .. పాటలు బాగుండటం ఈ సినిమా పట్ల ఈ స్థాయి క్రేజ్ పెరగడానికి కారణమని చెప్పుకుంటున్నారు.