Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : శాకుంత‌లం.. దృశ్య‌కావ్యం అదృశ్యం!

By:  Tupaki Desk   |   14 April 2023 3:18 PM GMT
మూవీ రివ్యూ : శాకుంత‌లం.. దృశ్య‌కావ్యం అదృశ్యం!
X
శాకుంత‌లం మూవీ రివ్యూ
న‌టీన‌టులు: స‌మంత‌-దేవ్ మోహ‌న్-స‌చిన్ ఖేద్క‌ర్-మోహ‌న్ బాబు- అన‌న్య నాగ‌ళ్ళ‌-అదితి బాల‌న్- శివ బాలాజీ-మ‌ధుబాల-క‌బీర్ సింగ్ దుల్హ‌న్-సుబ్బ‌రాజు త‌దిత‌రులు
సంగీతం: మ‌ణిశ‌ర్మ‌
మాటలు: సాయిమాధ‌వ్ బుర్రా
నిర్మాత‌లు: నీలిమ గుణ‌-దిల్ రాజు
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: గుణ‌శేఖ‌ర్

కెరీర్ ఆరంభం నుంచి విల‌క్ష‌ణ చిత్రాల‌కు పెట్టింది పేరైన గుణ‌శేఖ‌ర్.. అంద‌రూ త‌న ప‌నైపోయింద‌నుకున్న ద‌శ‌లో కొన్నేళ్ల కింద‌ట‌ రుద్ర‌మ‌దేవి లాంటి సాహ‌సోపేత చిత్రంతో మెప్పించారు. ఆ సినిమా త‌ర్వాత శాకుంత‌లం పేరుతో ఆయ‌న మ‌రో సాహ‌సం చేశారు. ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో కాస్త ఆల‌స్య‌మై.. ఎట్ట‌కేల‌కు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిందీ చిత్రం. దీని విశేషాలేంటో చూద్దాం ప‌దండి.


క‌థ:

విశ్వామిత్రుని త‌ప‌స్సుని భ‌గ్నం చేయ‌డానికి మేన‌క (మ‌ధుబాల‌)ను భూలోకానికి పంపించ‌గా.. మేనక త‌న బాధ్య‌త‌ను నిర్వ‌ర్తించే క్ర‌మంలో విశ్వామిత్రుడితో ఒక్క‌టై బిడ్డ‌కు జ‌న్మ‌నిస్తుంది. త‌ర్వాత ఆ బిడ్డ‌ను భూమ్మీదే వ‌దిలేసి స్వ‌ర్గానికి వెళ్లిపోతుంది. ఆ బిడ్డ‌ను చేర‌దీసి పెంచి పెద్ద చేస్తాడు క‌ణ్వ మ‌హ‌ర్షి (స‌చిన్ ఖేద్క‌ర్). ఆ చిన్నారే శ‌కుంత‌ల (స‌మంత‌). క‌ణ్వ మ‌హ‌ర్షి ఆశ్ర‌మంలో అల్లారు ముద్దుగా పెరిగి పెద్ద‌యిన శాకుంత‌ల‌.. యుక్త వ‌య‌సు వ‌చ్చాక.. త‌న ఆశ్ర‌మానికి వ‌చ్చిన దుష్యంత మ‌హారాజు (దేవ్ మోహ‌న్)తో ప్రేమ‌లో ప‌డి.. అత‌ణ్ని గాంధ‌ర్వ వివాహం చేసుకుంటుంది. తాను రాజ్యానికి వెళ్లి తిరిగి త‌న‌ను రాజ లాంఛ‌నాల‌తో తీసుకెళ్తాన‌ని చెప్పి వెళ్తాడు దుష్యంతుడు. కానీ అత‌ను ఎంత‌కీ తిరిగిరాడు. ఈ లోపు శకుంత‌ల గ‌ర్భ‌వ‌తి అవుతుంది. నిండు చూలాలిగా దుష్యంతుడి రాజ్యానికి వెళ్లి త‌న‌ను స్వీక‌రించాల‌ని కోర‌గా.. దుష్యంతుడు ఆమె ఎవ‌రో తెలియ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తాడు.. అందుకు కార‌ణ‌మేంటి.. దుష్యంతుడి ఆ స్పంద‌న త‌ర్వాత శ‌కుంత‌ల ప‌రిస్థితి ఏమిటి.. చివ‌రికి ఆమె భ‌ర్త‌తో ఒక్క‌టైందా లేదా అన్న‌ది మిగ‌తా క‌థ‌.


క‌థ‌నం-విశ్లేష‌ణ:

పౌరాణిక‌.. జాన‌ప‌ద.. చారిత్రక నేప‌థ్యం ఉన్న‌ క‌థ‌ల్ని ఇప్ప‌టి ప్రేక్ష‌కులు కూడా గొప్ప‌గా ఆద‌రిస్తార‌న‌డానికి చాలా ఉదాహ‌ర‌ణ‌లే ఉన్నాయి. కానీ ఆ క‌థ‌ల్ని తెర‌పై ఆక‌ట్టుకునేలా చూపించ‌డం అంత తేలిక కాదు. కేవ‌లం భారీత‌నంతో క‌నిక‌ట్టు చేస్తామంటే ప్రేక్ష‌కులు ఒప్పుకోరు. పెద్ద పెద్ద‌ సెట్టింగ్స్ వేసి.. గ్రాఫిక్స్ తో మాయ చేస్తే.. వాళ్లు సంతృప్తి చెంద‌రు. నేప‌థ్యం ఎలాంటిదైనా క‌ట్టి ప‌డేసే క‌థాక‌థ‌నాలు ఉండాలి. పాత్ర‌లు ఆక‌ట్టుకునేలా ఉండాలి. వాటిని పోషించిన న‌టీన‌టులు మెప్పించాలి. శాకుంత‌లం సినిమాలో ఇవేవీ కూడా ప్రేక్ష‌కులు కోరుకున్న విధంగా ఉండ‌వు. చ‌రిత్ర‌లో గొప్ప క‌థ‌గా పేరున్న కాళిదాసు అభిజ్ఞాన శాకుంత‌లంను ఒక దృశ్య‌కావ్యంలా తీర్చిదిద్దాల‌న్న గుణ‌శేఖ‌ర్ అండ్ టీం బెడిసికొట్టింది. సినిమాలో భారీత‌నానికి లోటు లేక‌పోయినా.. ఏదో ఒక కృత్రిమ వాతావ‌ర‌ణంలోకి వెళ్లిన భావ‌న క‌ల‌గ‌డం.. నాట‌కీయత శ్రుతి మించిన‌ట్లు అనిపించ‌డం శాకుంత‌లంకు అతి పెద్ద ప్ర‌తికూల‌త‌లు. ఈ క‌థ తెలిసిన వారికి అది చ‌దువుతున్న‌పుడు క‌లిగే ఫీలింగ్ తెర‌పై చూస్తున్న‌పుడు క‌ల‌గ‌దు. ఇక ఈ క‌థ‌ తెలియ‌ని వారికి.. సినిమా చూశాక ఏముంది ఇందులో అనే భావ‌న క‌లుగుతుంది సినిమా చూస్తుంటే.

జాన‌ప‌ద‌.. చారిత్ర‌క నేప‌థ్యంలో ఒక క‌ల్పిత క‌థ అంటే ద‌ర్శ‌కుడి ఊహ‌ల‌కు హ‌ద్దులేమీ ఉండ‌వు. తెర‌పై ఏం చూపించినా.. ఎన్ని విన్యాసాలు చేసినా చెల్లిపోతుంది. కానీ వాస్త‌వ క‌థ‌ను చూపిస్తున్న‌పుడు చాలా ప‌రిమితులు ఉంటాయి. భారీత‌నంతో సొబ‌గులు అద్ద‌గ‌ల‌రు. అద‌న‌పు హంగులు జోడించ‌గ‌ల‌రు. కానీ ఉన్న క‌థను దాటి ఏం చేయ‌డానికి వీల్లేదు. ఆల్రెడీ క‌థ తెలుసుకుని థియేట‌ర్ల‌లో అడుగు పెట్టిన ప్రేక్ష‌కుల‌ను అబ్బుర‌ప‌ర‌చాలంటే క‌థ‌నం అద్భుతంగా అనిపించాలి. స‌న్నివేశాలు చూస్తుంటే.. అబ్బా ఏం తీశాడురా అనిపించాలి. కానీ శాకుంత‌లం సినిమా మొత్తంలో వావ్ ఫీలింగ్ క‌లిగించే ఒక్క ఎపిసోడ్... స‌న్నివేశం కూడా సినిమాలో లేదు. చివ‌రికి అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ చాలా చిన్న వ‌య‌సులో చ‌లాకీగా న‌టించ‌డం.. త‌న చురుకుద‌నం.. ముద్దు ముద్దు మాట‌లు చూసి క‌లిగే ఆశ్చ‌ర్యం సినిమాలో ఇంకెక్క‌డా క‌ల‌గ‌క‌పోవ‌డమే శాకుంత‌లం దుస్థితికి నిద‌ర్శ‌నం.

అభిజ్ఞాన శాకుంత‌లం క‌థ తెలిసిన ఎవ‌రికైనా.. శ‌కుంత‌ల పాత్ర‌ను ఊహించుకున్న‌పుడు క‌లిగే భావ‌న.. స‌మంత‌ను చూస్తున్న‌పుడు క‌ల‌గ‌క‌పోవ‌డం శాకుంత‌లంలో అతి పెద్ద మైన‌స్. స‌మంత మంచి న‌టే. ఆమెకు ఒక ఇమేజ్ ఉంది. శాకుంత‌లం పాత్ర‌కు న్యాయం చేయ‌డానికి ఆమె బాగానే క‌ష్ట‌ప‌డింది. కానీ ఈ పాత్ర‌కు ఆమె యాప్ట్ అన్న ఫీలింగ్ మాత్రం క‌ల‌గ‌దు. దీనికి తోడు ఆమెకు జోడీగా దుష్యంత మ‌హారాజు పాత్ర‌కు మ‌న‌కు ప‌రిచ‌యం లేని దేవ్ మోహ‌న్ ను తీసుకున్నారు. మ‌న‌కు ప‌రిచ‌య‌మే లేని న‌టుడు యోధుడిగా క‌నిపిస్తూ యుద్ధ స‌న్నివేశాల్లో వీర‌త్వం చూపిస్తుంటే.. మ‌నం కోరుకునే కిక్కు రాదు. దేవ్ మోహ‌న్ త‌న పాత్ర‌కు న్యాయం చేసినా స‌రే.. అత‌ణ్ని మ‌నం ఓన్ చేసుకోలేం. ఇలా రెండు ప్ర‌ధాన పాత్ర‌ల‌తో క‌నెక్ట్ కాలేని ప‌రిస్థితుల్లో ఇక వారి ప్ర‌ణ‌య గాథ‌తో ఎమోష‌నల్ క‌నెక్ట్ ఎలా ఏర్ప‌డుతుంది?

సినిమాలో ఎమోష‌న‌ల్ సీన్లు చాలానే ఉన్నా.. వాటిని చూసి ప్రేక్ష‌కులు క‌దిలిపోయేలా తీర్చిదిద్ద‌డంలో గుణ‌శేఖ‌ర్ విఫ‌ల‌మ‌య్యాడు. ఏదో ఒక కృత్రిమ‌త్వం.. అతి నాట‌కీయ‌త ఆయా స‌న్నివేశాల‌తో ప్రేక్ష‌కులు క‌నెక్ట్ కాలేని ప‌రిస్థితి క‌ల్పించాయి. ప్రేక్షకుల‌ను ఒక కొత్త ప్ర‌పంచంలోకి తీసుకెళ్లాల‌ని.. భారీత‌నం ఫీల‌య్యేలా చేయాల‌ని సెట్టింగ్స్ మీద.. గ్రాఫిక్స్ మీద బాగానే ఫోక‌స్ పెట్టారు. కానీ ఈ ప్ర‌య‌త్నంలో స‌హ‌జ‌త్వం లోపించింది. ఆశ్ర‌మాలను అత్యంత అందంగా చూపించాల‌నే ప్ర‌య‌త్నం తేడా కొట్టేసింది. యుద్ధ స‌న్నివేశాలు సైతం ఏమాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయాయి. దీన్ని మించిన ఘ‌ట్టాల్ని బాహుబ‌లి స‌హా ప‌లు చిత్రాల్లో చూసేట‌ప్ప‌టికి.. ఇవి ఎంత మాత్రం ఆన‌వు. క‌థ‌గా చూసుకుంటే శాకుంత‌లంలో ఆస‌క్తిక‌ర మ‌లుపులు ఉన్న‌ప్ప‌టికీ.. తెర‌పై చూస్తున్న‌పుడు అవి ఏమంత ఎగ్జైట్ చేయ‌వు. స‌న్నివేశాల‌తో పాటు సంభాష‌ణ‌లు సైతం మ‌రీ నాట‌కీయంగా అనిపించ‌డంతో చాలా చోట్ల ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష త‌ప్ప‌దు. మొత్తంగా శాకుంత‌లం ఒక పెద్ద‌ మిస్ ఫైర్ అన‌డంలో సందేహం లేదు.


న‌టీన‌టులు:

గ‌తంలో చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌ను త‌న భుజం మీద మోసింది స‌మంత‌. కానీ శాకుంత‌లం సినిమాను అలా మోయ‌లేక‌పోయింది. ముందుగా శ‌కుంత‌ల పాత్ర‌కు స‌మంత యాప్ట్ అనిపించ‌లేదు. ఈ పాత్ర‌లో ముగ్ధ‌మ‌నోహ‌ర‌మైన అందంతో.. నిండైన విగ్ర‌హంతో క‌ట్టిప‌డేసే క‌థానాయిక ఉండాల్సింది. మేక‌ప్ తో ఎంత మేనేజ్ చేయాలని చూసినా.. ఆ పాత్ర‌కు స‌మంత అనిపించ‌లేదు. న‌ట‌న ప‌రంగా స‌మంత‌కు కొన్ని స‌న్నివేశాల్లో మంచి మార్కులే ప‌డినా.. స్క్రీన్ ప్రెజెన్స్ ద‌గ్గ‌ర మాత్రం కొంచెం తేడాగానే అనిపిస్తుంది. దీనికి తోడు ఆమె సొంతంగా చెప్పుకున్న డ‌బ్బింగ్ కూడా కుద‌ర‌లేదు. గ్రాంథిక ట‌చ్ ఉన్న డైలాగుల‌ను స‌మంత స‌రిగ్గా ప‌ల‌క‌లేక‌పోయింది. దుష్యంతుడి పాత్ర‌లో దేవ్ మోహ‌న్ మెప్పించాడు. అత‌ను అందంగా ఉన్నాడు. చ‌క్ర‌వ‌ర్తి పాత్ర‌కు సూట‌య్యాడు. కానీ దేవ్ మ‌న‌కు ప‌రిచ‌యం లేక‌పోవ‌డం ప్ర‌తికూలం అయింది. ఇలాంటి పాత్ర‌ల్లో తెలిసిన‌.. మాస్ ఇమేజ్ ఉన్న న‌టుడైతే బాగుండేది. క‌ణ్వ మ‌హ‌ర్షి పాత్ర‌లో స‌చిన్ ఖేద్క‌ర్.. దుర్వాసుడిగా మోహ‌న్ బాబు త‌మ అనుభ‌వాన్ని చూపించారు. చ‌క్క‌గా న‌టించారు. అదితి బాల‌న్.. అన‌న్య నాగ‌ళ్ళ‌.. గౌత‌మి త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. శివ బాలాజీ.. క‌బీర్ సింగ్ దుల్హ‌న్.. మ‌ధుబాల‌.. మిగ‌తా న‌టీన‌టులంతా ఓకే.


సాంకేతిక వ‌ర్గం:

ఇలాంటి సినిమాల‌కు మ‌ణిశర్మ స‌రైన ఎంపికే కావ‌చ్చు కానీ.. ఆయ‌న శాకుంత‌లంకు ఆశించిన స్థాయిలో న్యాయం చేయ‌లేక‌పోయాడు. పాట‌లు ఏదో వ‌చ్చాయి వెళ్లాయి అన్న‌ట్లున్నాయే త‌ప్ప‌.. ఏదీ విన‌సొంపుగా అనిపించ‌లేదు. పాట‌లకు మంచి స్కోప్ ఉన్న సినిమానే అయినా.. మ‌ణిశ‌ర్మ న్యాయం చేయ‌లేకపోయాడు. ప్ర‌ణ‌య గీతాల్ని కూడా మామూలుగా లాగించేశాడు. నేప‌థ్య సంగీతం ఓకే. శేఖ‌ర్ వి.జోసెఫ్ ఛాయాగ్ర‌హ‌ణం బాగుంది. నిర్మాణ విలువ‌ల‌కు ఢోకా లేదు. సినిమాలో భారీత‌నం క‌నిపిస్తుంది. బాగానే ఖ‌ర్చు పెట్టారు. గ్రాఫిక్స్ అక్క‌డ‌క్క‌డా కాస్త‌ కృత్రిమంగా అనిపించినా.. ప‌రిమిత బ‌డ్జెట్లో బాగానే చేశారు. సాయిమాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు బాగున్నాయి. ఈ రోజుల్లో శాకుంత‌లం క‌థ‌ను ఇంత భారీత‌నంతో చెప్పాల‌న్న‌ గుణ‌శేఖ‌ర్ ప్ర‌య‌త్నం అభినంద‌నీయ‌మే. కానీ ఆ క‌థ‌ను తెర‌పై అబ్బుర‌ప‌రిచేలా చూపించ‌లేక‌పోయాడు గుణ‌. క‌థ‌కుడిగా.. దర్శ‌కుడిగా ఆయ‌న ప‌నిత‌నం సాధార‌ణంగా అనిపిస్తుంది. ఎక్క‌డా మెరుపులు క‌నిపించ‌లేదు.

చివ‌ర‌గా - శాకుంత‌లం.. దృశ్య‌కావ్యం అదృశ్యం

రేటింగ్-2/5

Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theater