Begin typing your search above and press return to search.

#క‌రోనా: దేశ ప్ర‌జ‌ల కోసం బాద్ షా ఏదీ చేయ‌లేదా?

By:  Tupaki Desk   |   3 April 2020 4:37 AM GMT
#క‌రోనా: దేశ ప్ర‌జ‌ల కోసం బాద్ షా ఏదీ చేయ‌లేదా?
X
క‌రోనా మ‌హ‌మ్మారీని ఎదుర్కొనేందుకు భార‌త‌దేశం చేస్తున్న యుద్ధం గురించి తెలిసిందే. ఇప్ప‌టికే లాక్ డౌన్ కొంత‌వ‌రకూ పెనుముప్పును ఆప‌గ‌లిగింది. అయినా ర‌క‌ర‌కాల మార్గాల్లో ముప్పు ఇంకా పొంచి ఉండ‌డంతో వంద‌లాది పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. ఆ క్ర‌మంలోనే దేశాన్ని ఈ ప్ర‌మాదం నుంచి ర‌క్షించేందుకు సెల‌బ్రిటీలు స‌హా ప్ర‌ముఖులంతా విరివిగా పీఎం నిధికి విరాళాల్ని అందిస్తున్నారు. అంబానీ.. స‌చిన్ టెండూల్క‌ర్.. విరుష్క‌.. ప్ర‌భాస్.. చిరంజీవి... ఇలా ఎంద‌రో భారీ డొనేష‌న్లు అందించారు.

మ‌రి దేశం కోసం ది గ్రేట్ స్టార్ .. బాద్ షా షారూక్ ఖాన్ ఏం సాయం చేస్తున్నారు? అంటే దానికి తాజాగా ఆయ‌న నుంచి స‌మాధానం వచ్చింది. కరోనావైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాటంలో కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయపడే వరుస కార్యక్రమాలను బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్ తాజాగా ప్రకటించారు. స‌త్వ‌ర స‌హాయానికి తన సంస్థలైన కోల్‌కతా నైట్ రైడర్స్.. రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్- మీర్ ఫౌండేషన్ -రెడ్ చిల్లీస్ విఎఫ్ఎక్స్ సహాయం తీసుకోనున్నామ‌ని తెలిపారు.

``అవ‌స‌రాన్ని బ‌ట్టి నా బృందం .. నేను సేవ‌ల‌కు అందుబాటులో ఉంటాం. నిరాడంబరమైన మార్గంలో సహకరించే మార్గాలను ఇప్ప‌టికే మేం చర్చించాం. వరుస కార్యక్రమాలతో ముందుకు వస్తున్నాం. ఇది ఇత‌ర మార్గాల‌తో పోలిస్తే చిన్నపాటి వేరియేష‌న్ చూపించే ఉద్ధేశ‌మే`` అని షారూక్ ట్విట్ట‌ర్ లో ప్ర‌క‌టించారు. కోవిడ్ -19 కి వ్యతిరేకంగా పోరాటంలో పిఎం నరేంద్ర మోడీ.. రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ముఖ్యంగా ఉద్దవ్ ఠాక్రే.. మమతా బెనర్జీ.. అరవింద్ కేజ్రీవాల్ ల ప‌నితీరును ప్ర‌శంసించిన షారూక్.. ఐపిఎల్ ఫ్రాంచైజ్ కోల్ కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) ద్వారా తన భార్య గౌరీ ఖాన్.. వ్యాపార భాగస్వాములు - జుహి చావ్లా.. జే మెహతా కలిసి పిఎం-కేర్స్ ఫండ్ కు సహకరిస్తారని షారూఖ్ తెలిపారు.

షారుఖ్ -గౌరీ తమ ఫిల్మ్ బ్యానర్ రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ ద్వారా మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం ఇవ్వనున్నారు. ఆరోగ్య సంరక్షణ నిపుణుల కోసం 50 వేల‌ వ్యక్తిగత రక్షణ సామాగ్రి (పిపిఇ) సరఫరా కోసం కెకెఆర్ ఫ్రాంచైజ్ ఎన్జీఓ మీర్ ఫౌండేషన్ .. మహారాష్ట్ర - పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలతో కలిసి పని చేయ‌నుంది. కోవిడ్ -19 పోరాటంలో నిజమైన హీరోల్ని పంపిస్తున్నాన‌ని షారుఖ్ అన్నారు. ముంబైలో కనీసం ఒక నెల 5500 కుటుంబాలకు రోజువారీ ఆహార అవసరాలను అందించడానికి మీర్ ఫౌండేషన్ ఏక్ సాత్ - ఎర్త్ తో ఒప్పందం కుదుర్చుకుంది. రోజువారీ అవ‌స‌రాలు పొంద‌లేని గృహాలు .. ఆసుపత్రులకు సహాయం చేయడానికి ప్రతిరోజూ తాజాగా 2000 వండిన భోజనాన్ని పంపడానికి ఒక వంట గదిని కూడా ఏర్పాటు చేయనున్నట్లు షారుఖ్ చెప్పారు. రోటీ ఫౌండేషన్ సహకారంతో.. షారుఖ్ కి చెందిన‌ ఎన్జీఓ ముంబైలో కనీసం ఒక నెల పాటు నిరుపేదలకు .. రోజువారీ కూలీ కార్మికులకు 10 వేల‌ మందికి 3 లక్షల భోజన వస్తు సామగ్రిని అందిస్తుంది.

దిల్లీలో 2500 మందికి పైగా రోజువారీ కూలీ కార్మికులకు కనీసం ఒక నెలపాటు ప్రాథమిక నిత్యావసరాలు .. కిరాణా వస్తువులను అందించడానికి మీర్ ఫౌండేషన్ `వర్కింగ్ పీపుల్స్ చార్టర్`తో చేతులు కలిపింది. ఉత్తరప్రదేశ్.. బీహార్.. పశ్చిమ బెంగాల్.. ఉత్తరాఖండ్ లోని 100 యాసిడ్ దాడి బాధితులకు మీర్ ఫౌండేషన్ సహకారం అందించనున్నట్లు నటుడు తెలిపారు. ప్రస్తుత విప‌త్తు కాలంలో అందరూ కలిసి వచ్చి ఒకరినొక‌రు ఆదరించాలని షారూఖ్ అన్నారు.

``ఈ మహమ్మారి వ్యాప్తిలో స్పష్టత‌ ఏమీ లేదు.. మనలో ప్రతి ఒక్కరూ ఒకరికొకరు విడదీయరాని అనుసంధానంతో సంబంధం కలిగి ఉన్నాం. ఎటువంటి తేడా రాకుండా చూడాలి`` అని షారూక్ కోరారు. దేశ ప్ర‌జ‌లుగా ``మాకు లభించినదంతా ఇవ్వడం మా కర్తవ్యం`` అని అన్నారు. ``నేను నా వంతు ప్రయత్నం చేయబోతున్నాను. మీలో ప్రతి ఒక్కరూ కూడా అలా చేస్తారని నాకు తెలుసు. కలిసి మాత్ర‌మే ఇలాంటి అనూహ్య విప‌త్తుపై పోరాడగలం`` అని షారుఖ్ కాస్త ఉద్వేగంగానే ప్ర‌సంగించారు.