Begin typing your search above and press return to search.

బాలీవుడ్‌కు షారుఖ్‌ షాక్‌

By:  Tupaki Desk   |   12 April 2015 11:30 PM GMT
బాలీవుడ్‌కు షారుఖ్‌ షాక్‌
X
మహారాష్ట్రలో సాయంత్రం 6-9 గంటల మధ్య మల్టీప్లెక్స్‌ల్లో కచ్చితంగా మరాఠీ సినిమాల్ని ప్రదర్శించాలంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం మీద బాలీవుడ్‌ జనాలు భగభగ మండిపోతున్నారు. కలెక్షన్లు ఉన్న సినిమాలు ప్రదర్శించడం థియేటర్ల యజమానుల ఇష్టమని.. ఇలాంటి విషయాల్లో ప్రభుత్వ నియంత్రణ ఎంత వరకు సమంజసమని చాలామంది బాలీవుడ్‌ ప్రముఖులు గొంతు విప్పుతున్నారు. శోభా డే, ముఖేష్‌ భట్‌ లాంటోళ్లు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు కూడా. ఐతే వాళ్లందరికీ షాకిస్తూ బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

''భారతీయ సినిమా అంటే కేవలం బాలీవుడ్‌ కాదు.. దేశంలో చాలా ప్రాంతీయ భాషల సినిమాలున్నాయి. ప్రాంతీయ సినిమాలకు అందరూ మద్దతుగా నిలవాలి. ప్రోత్సహించాలి. నేను 25 ఏళ్లుగా మహారాష్ట్రలో ఉంటున్నాను. ఎవరైనా ఈ ప్రాంతానికి వ్యతిరేకంగా మాట్లాడితే నేను ఒప్పుకోను. మనం పంజాబీ, బెంగాలీ సినిమాల్ని కూడా ఆదరించాలని అంటాను. సాయంత్రం 6 నుంచి 9 గంటల మధ్య మల్టీప్లెక్స్‌ల్లో మరాఠీ సినిమాల ప్రదర్శన తప్పనిసరి అంటూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిజంగా అద్భుతం'' అన్నాడు షారుఖ్‌. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాడు అనుకుంటే షారుఖ్‌ ఇలా మాట్లాడాడేంటని బాలీవుడ్‌ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు.