Begin typing your search above and press return to search.

సినిమా కోసం రోజుకు 20 సిగరెట్లు

By:  Tupaki Desk   |   12 April 2019 4:44 AM GMT
సినిమా కోసం రోజుకు 20 సిగరెట్లు
X
తెలుగు సినిమాల పరంగా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇచ్చిన అర్జున్ రెడ్డి వచ్చి రెండేళ్ళు అవుతున్నా దాని తాలుకు జ్ఞాపకాలు మాత్రం ప్రేక్షకులకు ఇంకా ఫ్రెష్ గానే ఉన్నాయి. పెళ్లి చూపులు లాంటి సాఫ్ట్ మూవీతో తెరంగేట్రం చేసిన విజయ్ దేవరకొండ దానికి పూర్తి విరుద్ధమైన పాత్రలో ప్రేమికుడిగా నటించిన తీరుకు బాక్స్ ఆఫీస్ దగ్గర కనక వర్షమే కురిసింది. ప్రస్తుతం దీని హింది వెర్షన్ కబీర్ సింగ్ పేరుతో సందీప్ వంగా దర్శకత్వంలోనే రూపొందుతున్న సంగతి తెలిసిందే.

శాలిని పాండే పోషించిన పాత్రను అక్కడ కీయరా అద్వాని చేస్తోంది. ఇప్పటికే ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఒరిజినల్ మేజిక్ ని పునఃసృష్టి చేయడంలో సందీప్ మరోసారి సక్సెస్ అయ్యాడనే కామెంట్స్ బాలీవుడ్ వర్గాల నుంచి కూడా వచ్చాయి. దీని తాలుకు అనుభవాలను పంచుకున్న హీరో షాహిద్ కపూర్ చెప్పిన ఒక సంగతి మాత్రం ఆసక్తి రేపెలా ఉంది

ఇందులో పాత్ర కోసం షాహిద్ రోజుకు 20 సిగరెట్లు తాగేవాడట. ఆ పొగాకు కంపుతో ఇంటికి నేరుగా వెళ్ళలేక రెండు మూడు గంటల పాటు స్నానం చేసి బాత్ టబ్ లోనే గడిపి అంతా పక్కాగా ఇంకే స్మెల్ రావడం లేదు అని ఖరారు చేసుకున్నాకే బయలుదేరేవాడట. ఎంత పాత్ర కోసమైనా మరీ 20 సిగరెట్లు తాగడం అవసరమా అనిపించవచ్చు కానీ సహజ నటన కోసం తప్పదు అంటున్నాడు షాహిద్.

ఇదంతా బాగానే ఉంది కాని మరి విజయ్ దేవరకొండ కూడా నిజంగా ఇన్నేసి సిగరెట్లు తాగేవాడా అంటే అలా చేసిన దాఖలాలు కాని చెప్పిన సంగతులు కాని లేవు. మరి షాహిద్ కు మాత్రమే ఇవి ఎందుకు అవసరమయ్యాయో.జూన్ 21న విడుదల కాబోతున్న కబీర్ సింగ్ మీద అక్కడి ట్రేడ్ లో భారీ అంచనాలే ఉన్నాయి.