Begin typing your search above and press return to search.

రోబో-2లో షారూక్‌, ఆర్నాల్డ్‌

By:  Tupaki Desk   |   2 July 2015 5:31 AM GMT
రోబో-2లో షారూక్‌, ఆర్నాల్డ్‌
X
భారీ చిత్రాల దర్శకుడు శంకర్‌ 'రోబో' చిత్రంతో భారతీయ సినిమా సత్తా ఏంటో ప్రపంచ దేశాలకు రుచి చూపించాడు. ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతికతను వినియోగించి ఈ చిత్రాన్ని హాలీవుడ్‌ ప్రమాణాలతో రూపొందించిన ఘనత అతడికే చెల్లుతుంది. విజువల్‌ గ్రాఫిక్స్‌, ఎఫెక్ట్స్‌ని అత్యంత సమర్ధవంతంగా ఉపయోగించిన దర్శకుడిగా శంకర్‌ పాపులర్‌ అయ్యారు. రోబోతో ఇటు బాలీవుడ్‌, అటు హాలీవుడ్‌ రెండు చోట్లా శంకర్‌ పేరు మార్మోగిపోయింది. అసలు ఎవరీ స్టార్‌ డైరెక్టర్‌? అంటూ హాలీవుడ్‌ హీరోలు సైతం ఆరాలు తీయడం మొదలెట్టారు.

ముఖ్యంగా ప్రిడేటర్‌, టెర్మినేటర్‌ చిత్రాల హీరో ఆర్నాల్డ్‌ స్క్వాజ్‌నెగ్గర్‌ శంకర్‌ తెరకెక్కించిన 'రోబో' చూసి అవాక్కయ్యాడు. అతడి నుంచి ఏదైనా సినిమా వస్తోంది అంటే ఎంతో ఆసక్తిగా ఎదురు చూసే ఫాలోవర్‌గా మారిపోయాడు. ఒక ప్రాంతీయ సినిమాకి ఈ రేంజు విఎఫ్‌ఎక్స్‌ ఉపయోగించారంటే మనవాడి సత్తా ఎంతో ఆర్నాల్డ్‌కి అర్థమైంది. అందుకే అప్పట్లో 'ఐ' ఆడియో వేడుకలో ముఖ్య అతిధిగా హాజరై ఖుషీ చేశాడు. అంతేనా ఆ వేడుక సాక్షిగా శంకర్‌ అవకాశం ఇవ్వాలే కానీ అతడి సినిమాలో నటించడానికి రెడీ అని చెప్పాడు. ఆర్నాల్డ్‌ ఆ రోజు చూపించిన ఆసక్తిని శంకర్‌ మర్చిపోలేదు. అతడి మైండ్‌లో ఆ మాట రింగ్‌మంటూనే ఉంది. అందుకే ఓ కొత్త వార్తతో అందరి కళ్లను తనవైపు తిప్పేసుకుంటున్నాడు ఇప్పుడు.

ఆర్నాల్డ్‌ ఆసక్తిని దృష్టిలో పెట్టుకుని అతడి కోసం రోబో2 చిత్రంలో ఓ క్యారెక్టర్‌ని క్రియేట్‌ చేశాడు శంకర్‌. అంతేనా తన ఫేవరెట్‌ బాలీవుడ్‌ హీరో షారూక్‌ కోసం ఒక విలక్షణమైన పాత్రని సృష్టించాడు. ఇప్పటికే రోబో2లో షారూక్‌ విలన్‌ పాత్రలో నటించబోతున్నాడని ప్రచారమైంది. వాస్తవానికి 'రోబో' చిత్రంలో షారూక్‌కే తొలి అవకాశం. కథ రెడీ చేసి శంకర్‌ని షారూక్‌ సంప్రదిస్తే కాదని అన్నాడు. కానీ రోబో ఫలితం చూశాక తాను ఎంత పెద్ద తప్పు చేశాడో తెలుసుకున్నాడు. ఆ తర్వాత సొంతంగా 'రా-1' చిత్రం తెరకెక్కించి చేతులు కాల్చుకున్నాడు. అందుకే ఇప్పుడు రోబో2లో నటించడానికి షారూక్‌ ఆసక్తి కనబరుస్తున్నాడని తెలుస్తోంది. దీన్నిబట్టి రోబో-2 మరో విజువల్‌ వండర్‌ కాబోతోందని అర్థమవుతోంది.

రజనీకాంత్‌-షారూక్‌- ఆర్నాల్డ్‌ కాంబినేషన్‌తో శంకర్‌ రూపొందించనున్న రోబో-2 విజువల్‌ ఫీస్ట్‌ అవుతుందనడంలో సందేహమేలేదు. దీనికి సంబంధించిన అధికారిక వార్త త్వరలోనే వెలువడనుందని సమాచారం.