Begin typing your search above and press return to search.

నా కొడుకును నేర‌స్తుల మ‌ధ్య జైల్లో వేయొద్దు!-షారూఖ్‌

By:  Tupaki Desk   |   19 May 2023 9:33 PM GMT
నా కొడుకును నేర‌స్తుల మ‌ధ్య జైల్లో వేయొద్దు!-షారూఖ్‌
X
కొడుకును డ్ర‌గ్స్ కేసులో ఇరికిస్తాన‌ని కింగ్ ఖాన్ షారూఖ్ ని ఎమోష‌న‌ల్ బ్లాక్ మెయిల్ చేసి 25 కోట్లు లంచం డిమాండ్ చేశాడ‌నే నేరంపై మాజీ ఎన్సీబీ ముంబై జోన‌ల్ అధికారి స‌మీర్ వాంఖ‌డేపై ఎఫ్.ఐ.ఆర్ న‌మోదైన సంగ‌తి తెలిసిందే. సీబీఐ నేరుగా స‌మీర్ వాంఖ‌డేపై అవినీతి ఆరోప‌ణ‌లు చేయ‌డంతో సంచ‌ల‌న‌మైంది. మ‌రో ఇద్ద‌రు అధికారులు బ‌య‌టి వ్య‌క్తుల‌తో క‌లిసి షారూఖ్ ని అత‌డి కుటుంబాన్ని డ‌బ్బు కోసం బ్లాక్ మెయిల్ చేశాడ‌ని సమీర్ వాంఖడే పై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ కేసులో సీబీఐ అంత‌కంత‌కు ప‌ట్టు బిగిస్తోంది. తాజాగా స‌మీర్ వాంఖ‌డేతో షారుఖ్ ఖాన్ ఎమోషనల్ వాట్సాప్ చాట్ బ‌య‌ట‌ప‌డింది.

ఈ చాటింగ్ లో షారూఖ్ పూర్తిగా డీలా ప‌డిపోయారు.. ``నేను నిన్ను వేడుకుంటున్నాను.. దయచేసి ఆర్యన్ ని నేర‌స్తుల మ‌ధ్య ఆ జైలులో ఉండనివ్వవద్దు`` అని ఖాన్ వేడుకున్నాడు. మ‌రిన్ని వివ‌రాల్లోకి లోతుగా వెళితే తేలిన సంగ‌తులివి. 2021 డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసులో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్‌ కొడుకు ఆర్య‌న్ ఖాన్ అరెస్ట్ అయినప్పుడు NCB మాజీ ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేకు షారూఖ్ కు మధ్య జరిగిన చాట్ లను వెలికి తీయ‌గా ప‌లు విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.

వీరిద్దరి మధ్య జరిగిన చాట్ ల లోతుల్లోకి వెళితే... ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన 10 రోజుల తర్వాత 14 అక్టోబర్ 2021న జరిగిన చాటింగ్ లో SRK వాంఖడేకి ఇలా సందేశం పంపాడు.``మీరు మంచి మనిషి. దయచేసి నా కొడుకు పట్ల దయ చూపండి. నా కొడుకు మనిషిగా కొంత దారి త‌ప్పాడు. నేను మనవి మాత్రమే చేయగలను. ఒక తండ్రిగా మిమ్మ‌ల్ని వేడుకుంటున్నాను. దయచేసి... నా బిడ్డను సంస్కరిస్తానని మీరు వాగ్దానం చేసారు. మీరు చేసే పనికి నేను ఎప్పటికీ అడ్డు నిల‌వ‌ను. నేను మీ మంచితనాన్ని నమ్ముతున్నాను`` అంటూ షారూఖ్ వాట్సాప్ లో త‌న ఆవేద‌న‌ను వెల్ల‌గక్కారు. త‌న కుమారుడిని క‌రుడుగ‌ట్టిన నేర‌స్తుల మ‌ధ్య జైల్లో ఉంచ‌వద్ద‌ని షారూఖ్ అభ్య‌ర్థించారు. ఆర్య‌న్ ని విడిచిపెట్ట‌మ‌ని ప్రాధేయ‌ప‌డిన‌ట్టు ఈ చాట్ లో బ‌య‌ట‌ప‌డింది.

ఇదిలావుండగా లంచం దోపిడీ కేసులో సీబీఐ నుంచి ఎలాంటి బలవంతపు చర్య తీసుకోకుండా బాంబే హైకోర్టు శుక్రవారం సమీర్ వాంఖడేకు రక్షణ కల్పించింది. ఈ కేసులో 41A నోటీసు జారీ చేయబడినందున తదుపరి తేదీ(మ‌రునాటి) వరకు పిటిషనర్ వాంఖ‌డేపై ఎటువంటి బలవంతపు చర్య తీసుకోవద్దని కోర్టు సీబీఐని ఆదేశించింది. 25 కోట్ల లంచం కేసులో సీబీఐ చర్యకు వ్యతిరేకంగా వాంఖడే ఈ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ చర్య ప్రతీకార చర్య అని సమీర్ వాంఖడే అన్నారు. వాంఖడే తరపున న్యాయవాదులు రిజ్వాన్ మర్చంట్- అబాద్ పొండా వాదనలు వినిపించారు.