Begin typing your search above and press return to search.

షారుఖ్ కరవు తీరిపోయిందబ్బా..

By:  Tupaki Desk   |   16 April 2016 9:30 AM GMT
షారుఖ్ కరవు తీరిపోయిందబ్బా..
X
డబ్బుల కోసం కక్కుర్తి పడతాడు.. మంచి సినిమాలు చేయాలన్న ఉద్దేశమే ఉండదు.. ప్రేక్షకుల్ని మరీ తక్కువ అంచనా వేస్తాడు.. హిందీ సినిమాల స్థాయిని దిగజారుస్తున్నాడు.. ప్రమోషనల్ జిమ్మిక్కులతో సినిమాల్ని సేల్ చేసేస్తుంటాడు.. తన టాలెంటుకి తగ్గ సినిమాలు చేయడు.. ఇలా చాలా విమర్శలే ఉన్నాయి షారుఖ్ ఖాన్ మీద. గత కొన్నేళ్లలో కింగ్ ఖాన్ చేసిన సినిమాల వరుస చూస్తే అతడి విషయంలో ఇలాంటి అభిప్రాయాలు కలగడంలో ఆశ్చర్యమేమీ లేదు.

గత రెండేళ్లలో వచ్చిన హ్యాపీ న్యూ ఇయర్.. దిల్ వాలే.. చూసి జనాలు షారుఖ్ ను ఎలా తిట్టుకున్నారో అందరికీ తెలుసు. ఆ సినిమాలకు వసూళ్లయితే వచ్చాయి కానీ.. షారుఖ్ మీద అంతకుమించి విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. ఓవైపు అమీర్ ఖాన్ గొప్ప గొప్ప సినిమాలతో తన విలువ పెంచుకుంటుంటే.. చివరికి సల్మాన్ ఖాన్ కూడా ‘భజరంగి భాయిజాన్’ లాంటి మంచి సినిమాలు చేస్తుంటే షారుఖ్ మాత్రం మారడా.. కంటెంట్ ఉన్న సినిమాలు చేయడా అన్న విమర్శలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి.

ఇలాంటి టైంలో ‘ఫ్యాన్’ షారుఖ్ మీద ఉన్న విమర్శలన్నింటికీ సమాధానంగా నిలుస్తోంది. షారుఖ్ గత దశాబ్ద కాలంలో చేసిన బెస్ట్ మూవీ ఇదే అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. శుక్రవారం రిలీజైన ఈ సినిమాకు అద్భుతమైన రివ్యూలు వచ్చాయి. బాలీవుడ్ విమర్శకుల్లో కొందరు ఈ సినిమాకు 4.. 4.5 రేటింగ్స్ కూడా ఇవ్వడం విశేషం. కమర్షియల్ హంగుల గురించి పట్టించుకోకుండా.. కేవలం కంటెంట్ మీదే సినిమాను నడిపించడం.. ఆద్యంతం ఉత్కంఠభరింగా సినిమా సాగిపోవడం.. షారుఖ్ రెండు పాత్రల్లోనూ గొప్పగా నటించడం.. సినిమాకు ప్లస్ అవుతోంది. ఇందులో ఒక థీమ్ సాంగ్ మినహాయిస్తే అసలు పాటలే లేకపోవడం విశేషం. యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రానికి మనీష్ శర్మ దర్శకుడు. షారుఖ్ కెరీర్లో ఓ మైల్ స్టోన్ మూవీలాగా ‘ఫ్యాన్’ నిలిచిపోతుందని అంచనా వేస్తున్నారు.