Begin typing your search above and press return to search.

షారుఖ్ మాట‌.. అమీర్ మ‌మ్మ‌ల్ని దాటేశాడు

By:  Tupaki Desk   |   22 Dec 2015 2:56 PM GMT
షారుఖ్ మాట‌.. అమీర్ మ‌మ్మ‌ల్ని దాటేశాడు
X
ప‌దేళ్ల కింద‌ట ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ ఎవ‌రంటే షారుఖ్ ఖాన్ అనే వారు. షారుఖ్ కు బాలీవుడ్ బాద్ షా అని, కింగ్ ఖాన్ అని పేర్లు వ‌చ్చింది అందుకే. కానీ ఇప్పడు షారుఖ్ నిజంగా బాద్ షానా, కింగ్ ఖానా అంటే ఔను అన‌లేం. ఎందుకంటే ఇండియ‌న్ సినిమా క‌లెక్ష‌న్ల రికార్డులేవీ అత‌డి పేరిటి లేవు. అన్నీ దాదాపుగా అమీర్ పేరిట ఉన్నాయి. గ‌త ద‌శాబ్దంలో ఇంతింతై అన్న‌ట్లు ఎదిగిన అమీర్‌.. షారుఖ్ ను దాటేసి ఎక్క‌డికో వెళ్లిపోయాడు. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగా పెంచుకున్నాడు. ఐతే అమీర్ గొప్ప‌దనాన్ని ఇప్పుడు స్వ‌యంగా షారుఖే ఒప్పుకోవ‌డం విశేషం.

అమీర్ త‌న‌ను దాటేసిన విష‌యాన్ని ఒప్పుకోవ‌డానికి షారుఖ్ ఏమీ మొహ‌మాట ప‌డ‌లేదు. బిగ్ బాస్ కార్య‌క్ర‌మంలో ప‌క్క‌నే స‌ల్మాన్ ఖాన్ ను కూడా పెట్టుకుని త‌మ ఇద్ద‌రినీ అమీర్ దాటేశాడ‌ని అంగీక‌రించాడు షారుఖ్‌. ప‌నిలో ప‌నిగా త‌న‌కు, స‌ల్మాన్ కు విభేదాలు కూడా స‌మ‌సిపోయాయ‌ని చెప్పాడు. ''నాకు సల్మాన్‌ కు మధ్య పెద్దగా సమస్యలేమీ లేవు. మా రెండు కుటుంబాల మధ్య మంచి అనుబంధమే ఉంది. ఇద్దరం మనస్ఫర్తలు వీడి కలిశాం. ఐతే నేను, సల్మాన్‌ ఖాన్‌ గొడవలు పడుతుంటే.. అమీర్‌ ఖాన్‌ తన సినిమాలతో దూసుకుపోయాడు. బాక్సాఫీస్‌ దగ్గర మమ్మల్నిద్దరినీ దాటేశాడు’’ అని షారుఖ్ చెప్పాడు. త‌న ప్ర‌త్య‌ర్థి గురించి షారుఖ్ ఇలా ఓపెన్ గా మాట్లాడేయ‌డం విశేష‌మే.