Begin typing your search above and press return to search.

కామెడీగా.. కమెడియన్ అంటే స్పూఫేనా??

By:  Tupaki Desk   |   23 May 2018 10:38 AM GMT
కామెడీగా.. కమెడియన్ అంటే స్పూఫేనా??
X
చాలా టాలెంట్ ఉన్న కామెడీ హీరోగా అల్లరి నరేష్‌ తన సత్తా చాటుకున్నాడు. మనోడు రాజేంద్ర ప్రసాద్ తరమాలో కామెడీ జానర్ లో అనతికాలం నిలిచిపోతాడని అనుకుంటే.. అదేంటో విడ్డూరంగా మాయపోయాడు. కాని తన కెరియర్ కు డౌన్ ఫాల్ అయిన ఒక పాయింట్ మాత్రం గుర్తించాడు. ఇప్పుడు దానిని సరిదిద్దుకునే పనిలోనే ఉన్నాడట. అయితే మిగతా హీరోలుగా మారిపోదాం అనుకున్న మిగతా కమెడియన్లు మాత్రం.. నరేష్‌ చేసిన తప్పును ఇంకా నెత్తిమీద వేసుకునే మోస్తున్నారు.

విషయం ఏంటంటే.. అసలు హీరోగా చేస్తున్నప్పడు అస్తమానం స్పూఫులు చేస్తే వర్కవుట్ కావు. అప్పట్లో వేణుమాధవ్ వంటి కమెడియన్లు బ్లాక్ బస్టర్ సినిమాల్లోని హీరోల పాత్రను స్పూఫులుగా చేస్తే బాగానే అలరించాయి. కాని తరువాత తరువాత అల్లరి నరేష్‌ ప్రతీ సినిమాలోనూ అదే చేస్తుండటంతో.. దెబ్బకి సీన్ సితార్ అయిపోయింది. ఆ మధ్యన హీరోగా తన అదృష్టం పరీక్షించుకున్న సప్తగిరి కూడా.. ఎక్కువశాతం పవన్ కళ్యాణ్‌ ను మెగాస్టార్ చిరంజీవిని తెగ ఇమిటేట్ చేసి.. 'సప్తగిరి ఎక్సప్రెస్'తో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కట్ చేస్తే ఇప్పుడు మరో కమెడియన్ షకలక శంకర్ కూడా తొలిసారి హీరోగా చేస్తున్న 'డ్రైవర్ రాముడు' సినిమాలో మళ్ళీ అలాంటి పనే చేస్తున్నాడు.

జబర్ దస్త్ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్‌ ను.. ఆ తరువాత రామ్ గోపాల్ వర్మను తెగ ఇమిటేట్ చేసిన షకలక శంకర్.. ఇప్పుడు డ్రైవర్ రాముడు సినిమా కోసం పెద్ద ఎన్టీఆర్ ను తెగ అనుకరించాడు. బిల్డప్ షాట్లు.. చేతితో అభివాదం.. అబ్బో మామూలు మసాలా కాదనుకోండి. ఒకవేళ ఆ సినిమాలో నిజంగానే కంటెంట్ ఉన్నా కూడా.. మనోడు అలా స్పూఫు తరహా రూటు ఎంచుకోవడం.. అదంతా మరుగునపడిపోయే ఛాన్సుంది. అయినా కామెడియన్లు కామెడీ హీరోలవ్వాలంటే స్పూఫులే చేయాలేటండీ? ఓమారు అప్పుల అప్పారావు.. లేడీస్ టైలర్ సినిమాలు చూడండయ్యా!!