Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : శకుంతలాదేవి

By:  Tupaki Desk   |   31 July 2020 10:10 AM GMT
మూవీ రివ్యూ : శకుంతలాదేవి
X
నటీనటులు : విద్యాబాలన్ - జిష్షు సేన్‌ గుప్తా - సన్యా మల్హోత్రా - అమిత్ షాద్
సంగీతం : సచిన్ - జిగర్
ఛాయాగ్రహణం : కీకో నకహరా
నిర్మాతలు : సోనీ పిక్చర్స్ నెట్‌ వర్క్స్ - విక్రమ్ మల్హోత్రా
స్క్రీన్ ప్లే - డైరెక్షన్ : అను మీనన్

ప్రపంచ వ్యాప్తంగా 'హ్యూమన్‌ కంప్యూటర్‌'గా గుర్తింపు పొందింది శకుంతలా దేవి. ఎలాంటి లెక్కనైనా క్షణాల్లో పరిష్కరించే మేధస్సు ఆమె సొంతం. మూడేళ్ల ప్రాయం నుంచే అంకెలతో గారడీ చేసి.. పదమూడేళ్లకే ప్రపంచాన్ని చుట్టొచ్చిన గణిత మేధావి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి. ఆమె మరణించిన ఏడేళ్ల తర్వాత ఆమె పేరిట 'శకుంతలాదేవి' అనే బయోపిక్‌ తెరకెక్కింది. విద్యా బాలన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీ వేదిక గా రిలీజ్ అయింది.

కథలోకి వెళ్తే స్కూల్ కి కూడా వెళ్లని శకుంతలాదేవి(విద్యా బాలన్) తండ్రి శిక్షణలో గణిత మేధావిగా ఎదుగుతుంది. దీంతో విదేశాలకు వెళ్లిన శకుంతల అక్కడ మరింత పరిజ్ఞానం సాధించడంతో పాటు.. అందరినీ ఆశ్చర్యపరిచే విజయాలు సాధిస్తుంది. ఓ కష్టమైన గణిత సమస్యని కంప్యూటర్‌ తప్పు అని చూపిస్తే... 'నేను కరెక్ట్‌.. కంప్యూటర్‌ రాంగ్‌' అంటూ ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించి 'హ్యూమన్‌ కంప్యూటర్‌'గా పేరుతెచ్చుకుంటుంది. శకుంతలాదేవి 'నాకు ఇంటెలిజెంట్‌, గుడ్‌ లుకింగ్‌ ఉన్న వ్యక్తితో బేబీ కావాలి' అంటూ పరితోష్ బెనర్జీ(జిష్షు సేన్ గుప్తా) ని పెళ్లి చేసుకుంటుంది. వివాహ అనంతరం ఆమె జీవితంలో ఒడిదుడుకులు ఎదురై కూతురు( సన్యా మల్హోత్రా)ని తీసుకొని భర్తకు దూరంగా వెళ్ళిపోతుంది. మ్యాథ్స్ మరియు మాతృత్వం మధ్య నలిగిపోయే శకుంతల తన కూతురికి ప్రేమను అందించే క్రమంలో ఆమె కూతురు అను శకుంతలను వదిలేసి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుంది. శకుంతలాదేవి లైఫ్ లో ఏర్పడిన ఇబ్బందులను ఎదుర్కొని దూరమైన భర్త - కూతురు దగ్గరకు ఎలా చేరింది అని సినిమాలో చూపించారు.

ఈ సినిమా చూసిన తర్వాత ప్రపంచానికి ఒక అద్భుతమైన గణిత మేధావిగా తెలిసిన శకుంతలాదేవి జీవితంలో ఇన్ని కోణాలున్నాయా అని ప్రేక్షకులకు అనిపిస్తుంది. శకుంతలాదేవి గురించి చెప్పే క్రమంలో ఆమె ఎప్పుడూ కొత్తవి నేర్చుకోవాలనే తపనపడుతుందని.. కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లాలని.. జీవితాన్ని గొప్పగా ఆస్వాదించాలని కోరుకునేదని తెలుస్తుంది. సినిమా నిజజీవిత కథతో తెరకెక్కడం వల్ల సీన్స్ రిపీటెడ్ గా అనిపించడంతో పాటు స్లో గాసాగుతోంది అనే ఫీల్ కలిగిస్తుంది. శకుంతలాదేవి పాత్రలో నటించిన విద్యా బాలన్ అద్భుతమైన నటన కనబరిచింది. బయోపిక్‌ అనేది విద్యాబాలన్‌ కు కొత్తేమీ కాదు. ఇంతకు ముందు 'డర్టీ పిక్చర్‌' లో సిల్క్‌ స్మితగా మెప్పించిన విద్యాబాలన్‌ ఈసారి 'శకుంతలాదేవి'గా మ్యాజిక్‌ చేసిందని చెప్పవచ్చు. శకుంతల పాత్రలో వేరియేషన్స్ చూపిస్తూ తన నటన తో కట్టి పడేస్తుంది. క్లైమాక్స్ సన్నివేశాలు మరియు కూతురు తో వచ్చే సీన్స్ లో ఆమె నటన అద్భుతమని చెప్పాలి. లెక్కలతో అట్లాడుకునే శకుంతలా దేవి లాంటి జీనియస్‌ పాత్ర లో నటిస్తున్నప్పుడు ఆ లెక్కలు డైలాగుల్లా కాకుండా.. అర్థం చేసుకుని అంకెలను చకచకా చెప్పాల్సి ఉంటుంది. అందులోనూ ఆమె మాథ్స్‌ లో కూడా సెన్సాఫ్‌ హ్యూమర్‌ చూపిస్తుంది. ఇలాంటి ఛాలెంజింగ్ రోల్ కి విద్యా బాలన్ 100 శాతం న్యాయం చేసారని చెప్పవచ్చు. శాకుంతలాదేవి కూతురు పాత్ర చేసిన సన్యా మల్హోత్రా కూడా మంచి నటన కనబరిచారు.

ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అలాగే కెమెరా వర్క్ కూడా ఆకట్టుకుంటుంది. డైరెక్టర్ అను మీనన్ 'శకుంతలాదేవి' బయోపిక్ తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు. శకుంతలాదేవి అనే పాత్రను ఆమె అనుకున్న విధంగా తెరపై అద్భుతంగా చూపించారు. సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ విషయానికొస్తే కొన్ని సీన్స్ ట్రిమ్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. ఇక ఈ చిత్రానికి ఎక్కువ మంది మహిళలు వర్క్ చేయడం విశేషం. స్ర్కిప్టు రచయిత (నయనిక మహతానీ), సినిమాటోగ్రాఫర్‌ (కీకో నకహరా), క్యాస్టూమ్స్‌ డిజైనర్‌, ఎడిటర్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌ తో పాటు నిర్మాతలతో ఒకరు మహిళలే అవడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. మొత్తం మీద 'హ్యూమన్‌ కంప్యూటర్‌' శకుంతలాదేవి ఎమోషనల్ జర్నీ గురించి తెలియాజేప్పే ''శకుంతలాదేవి'' చిత్రం మంచి సినిమా చూశాం అనే అనుభూతిని కలిగిస్తుందని చెప్పవచ్చు.