Begin typing your search above and press return to search.

ఇలాంటి ప్లానింగ్ శంకర్ కు మాత్రమే సాధ్యం

By:  Tupaki Desk   |   24 Nov 2016 10:30 PM GMT
ఇలాంటి ప్లానింగ్ శంకర్ కు మాత్రమే సాధ్యం
X
టెక్నాలజీని సమర్థంగా వాడుకుని.. ఇండియన్ సినిమాను కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో ముందు శంకర్ పేరు చెప్పుకోవాలి. తొలి సినిమా ‘జెంటిల్మన్’ నుంచి చివరగా తీసిన ‘ఐ’ వరకు శంకర్ వెండితెరపై ఎన్ని సాంకేతిక మాయాజాలాలు చేశాడు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అందులోనూ ‘రోబో’ సినిమా ఆయన ఇండియన్ సినిమాను ఏ స్థాయికి తీసుకెళ్లాడో తెలిసిందే. ఇప్పుడు ‘రోబో’ సీక్వెల్.. ‘2.0’తో మరిన్ని అద్భుతాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు శంకర్. ఇది హాలీవుడ్ స్థాయిని అందుకునేలా కాదు.. హాలీవుడ్ సినిమాలకు దీటుగా ఉంటుందని ప్రేక్షకులు బలమైన నమ్మకంతో ఉన్నారు.

కెరీర్లో తొలిసారిగా శంకర్ 3డీ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాడు తన సినిమాకు. ‘2.0’ 3డీ లోనే తెరకెక్కుతుంది. 3డీలోనే విడుదలవుతుంది. ఐతే ఇండియన్ సినిమాల్లో 3డీ వాడకం కొత్తేమీ కాదు కదా.. శంకర్ కొత్తగా చేసేదేముంది అనిపించొచ్చు. ఐతే శంకర్ నేరుగా హాలీవుడ్ 3డీ నిపుణుల్నే ఈ సినిమాకు ఉపయోగించుకుంటున్నాడు. అత్యున్నత ప్రమాణాలతో.. ఇండియాలో ఇప్పటిదాకా వచ్చిన 3డి సినిమాలకు భిన్నంగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా ఎడిటింగ్ కూడా 3డీ గ్లాసులు వేసుకునే చేయాల్సి వస్తోందని ఎడిటర్ ఆంటోనీ చెప్పడం విశేషం.

ఇక అన్నిటికంటే పెద్ద విశేషం ఏంటంటే.. సాధారణ థియేటర్లలో కూడా మల్టీప్లెక్సుల్లో మాదిరి నాణ్యమైన 3డీ ఎఫెక్ట్ ఉండేలా థియేటర్లను ఇప్పటినుంచే తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘2.0’ విడుదలకు ఇంకా ఏడాది సమయం ఉండగా.. లైకా ప్రొడక్షన్స్ దేశవ్యాప్తంగా థియేటర్ల యాజమాన్య గ్రూపులతో సంప్రదింపులు జరుపుతోంది. ‘2.0’ కోసం థియేటర్లన్నీ ఎక్విప్ అయ్యేలా ఏర్పాట్లు చేసుకోమంటోంది. ఈ సాంకేతికతను అందించే సంస్థతో కలిసి ఉభయతారకంగా ఉండే డీల్స్ చేయిస్తోంది. దీని వెనుక శంకర్ కృషిని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన సినిమాకు వచ్చిన ప్రేక్షకుడికి.. అత్యున్నతమైన వినోదాన్ని అందించడానికి శంకర్ ఎంతగా తపిస్తాడో చెప్పడానికి ‘2.0’ మరో ఉదాహరణగా చెబుతున్నారు సినీ జనాలు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/