Begin typing your search above and press return to search.

25 ఏళ్ల ముందు ఒక సంచలనం

By:  Tupaki Desk   |   20 Oct 2020 1:30 PM GMT
25 ఏళ్ల ముందు ఒక సంచలనం
X
1995 అక్టోబరు 20.. భారతీయ సినిమా చరిత్రలో ఒక సువర్ణాధ్యాయానికి నాంది పడ్డ రోజు. షారుఖ్ ఖాన్, కాజోల్ జంటగా లెజెండరీ యశ్ చోప్రా తనయుడు ఆదిత్య చోప్రా దర్శకుడిగా అరంగేట్రం చేస్తూ తీసిన ‘దిల్ వాలే దుల్హానియా లే జాయేంగే’ సినిమా విడుదలైన రోజు అది. ఆ సినిమా సంచలనాల గురించి మొత్తం చెప్పాలంటే ఒక పుస్తకమంత అవుతుంది. పేరుకు ఇది హిందీ సినిమానే కానీ.. దేశవ్యాప్తంగా అన్ని భాషల వాళ్లనూ ఉర్రూతలూగించింది. తెలుగులో కూడా ‘ప్రేమించి పెళ్ళాడుతా’ పేరుతో విడుదలై వంద రోజులాడిన సినిమా ఇది. ఇక హిందీ ఈ సినిమా బాక్సాఫీస్ విజయం గురించి ఎంత చెప్పినా తక్కువే. పదుల సంఖ్యలో థియేటర్లలో సంవత్సరం పాటు ఆడిందీ సినిమా. ముంబయిలోని మహారాష్ట్రలో అయితే 25 ఏళ్లుగా ఆడుతూనే ఉందీ సినిమా. లాక్ డౌన్‌కు ముందు కూడా సినిమా అక్కడ ఆడుతూనే ఉంది. కరోనా వల్ల దేశవ్యాప్తంగా థియేటర్లు మూతపడటంతో అక్కడ ఈ సినిమా ప్రదర్శన ఆగిపోయింది.

ఏదో మొక్కుబడిగా కాకుండా ‘డీడీఎల్‌జే’ను మరాఠా మందిర్‌లో 25 ఏళ్లుగా డైలీ ఒక షో ఆడిస్తూనే ఉన్నారు. వారాంతాల్లో ఇక్కడ ఈ సినిమా చూడటం ముంబయి వాసులకు ఒక సెలబ్రేషన్ అన్నట్లే. ఇక ఈ సినిమా వివిధ భాషల సినిమాలను, ఫిలిం మేకర్లను ఎంతగా ప్రభావితం చేసిందో చెప్పలేం. హీరో హీరోయిన్ల మధ్య గొడవతో మొదలైన పరిచయం.. తర్వాత ప్రేమగా మారడం.. తర్వాత అమ్మాయి కోసం ఆ అబ్బాయి తన ఇంటికే రావడం.. ఆ ఇంట్లో అందరి మెప్పు పొందేందుకు ప్రయత్నించడం.. కానీ తన స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం అమ్మాయి తండ్రి అతడి కొడుకుతో పెళ్లి చేయడానికి నిశ్చయించడం.. చివరికి వీళ్లిద్దరి ప్రేమను అర్థం చేసుకుని అబ్బాయితో అమ్మాయిని పంపించేయడం.. ఇదీ స్థూలంగా ఈ సినిమా కథ. దీన్ని అన్ని వర్గాల ప్రేక్షకులూ మెచ్చేలా ఆద్యంతం అద్భుతంగా తీర్చిదిద్దాడు ఆదిత్య చోప్రా. దీని స్ఫూర్తితో వివిధ భాషల్లో పదుల సంఖ్యలో సినిమాలు వచ్చాయి. ప్రేక్షకాదరణ పొందాయి. ఈ సినిమాతో షారుఖ్, కాజల్ భారతీయ ప్రేక్షకులకు అత్యంత ఇష్టమైన జంటగా మారిపోయారు. ఈ సినిమా తీసే సమయానికి ఆదిత్య చోప్రా వయసు కేవలం 21 ఏళ్లు కావడం విశేషం. అప్పట్లో భారతీయ సినిమా రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేసిన ఈ సినిమా.. ఇప్పుడు చూసినా ‘ఔట్ డేటెడ్’ అనిపించకుండా ఈ తరం ప్రేక్షకులను కూడా మెప్పించేలా ఉండటం విశేషం.