Begin typing your search above and press return to search.

బోర్ కొట్టేసిందంటున్న శర్వానంద్

By:  Tupaki Desk   |   11 May 2017 4:44 PM GMT
బోర్ కొట్టేసిందంటున్న శర్వానంద్
X
శర్వానంద్‌ కు హీరోగా మొదట్లో మంచి గుర్తింపు తెచ్చిన సినిమాలు.. గమ్యం.. అందరి బంధువయా.. ప్రస్థానం.. జర్నీ. వీటన్నింట్లోనూ అతను చేసింది సీరియస్ క్యారెక్టర్లే. దీంతో అతడికి ఆ తరహా క్యారెక్టర్లే సూటవుతాయని అంతా ఒక అభిప్రాయానికి వచ్చేశారు. ఐతే ‘రన్ రాజా రన్’ నుంచి అనుకోకుండా రూటు మార్చేశాడు శర్వా. మధ్యలో ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ మినహాయిస్తే అతను వరుసగా సరదా పాత్రలే చేస్తున్నాడు. శర్వా చేసిన లేటెస్ట్ మూవీ ‘రాధ’లోనూ ఫన్నీ రోలే చేసినట్లున్నాడు శర్వా. తాను కాన్షియస్ ఎఫర్ట్ తోనే ఇలాంటి పాత్రలు చేస్తున్నట్లుగా చెప్పాడు శర్వా. సీరియస్ పాత్రలు చేసి తనకు ఓ దశలో బోర్ కట్టేసిందని అతను చెప్పాడు.

‘‘హీరోగా మొదట్లో సీరియస్ పాత్రలు చేయడంతో అందరూ అలాంటి పాత్రలు.. కథలతోనే నన్ను సంప్రదించడం మొదలుపెట్టారు. ఒక దశ దాటాకా నాకు ఈ తరహా పాత్రలు.. కథలు చేసి బోర్ కొట్టింది. అందుకే రూటు మార్చాను. ‘రాధ’ కూడా ఆ ఉద్దేశంతో ఎంచుకున్నదే. నేను చాలా త్వరగా సీరియస్ క్యారెక్టర్లు చేశాను. అలాంటి పాత్రలు చేయడానికి ఇంకా సమయముంది. అందుకే ప్రస్తుతానికి సింపుల్.. ఎంటర్టైనింగ్ గా ఉండే సినిమాలే చేయాలనుకుంటున్నా’’ అని శర్వా తెలిపాడు. ఇక ‘రాధ’ ఆలస్యం కావడానికి కారణాలు చెబుతూ.. ‘‘ఈ సినిమా ‘శతమానం భవతి’ కంటే ముందే మొదలైంది. కొంత షూటింగ్ కూడా చేశాం. కానీ శతమానం భవతి సినిమాను సంక్రాంతి సీజన్లో రిలీజ్ చేస్తే బాగుంటుందని దిల్ రాజు గారు అన్నారు. అందుకే ‘రాధ’ను పక్కనబెట్టి దాన్ని పూర్తి చేశాం. ఆ తర్వాత దీన్ని ముగించాం’’ అని శర్వా చెప్పాడు. ‘శతమానం భవతి’ లాంటి పెద్ద సక్సెస్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో.. ‘రాధ’పై ప్రేక్షకులకు ఎక్కువ అంచనాలతో ఉన్నారని.. అందుకే కొంచెం టెన్షన్ గా ఉందని శర్వా తెలిపాడు.