Begin typing your search above and press return to search.

తప్పులో కాలేసిన శర్వానంద్

By:  Tupaki Desk   |   2 April 2017 10:16 AM GMT
తప్పులో కాలేసిన శర్వానంద్
X
సంక్రాంతికి ‘ఖైదీ నెంబర్ 150’.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి భారీ సినిమాలు రేసులో ఉన్నా శర్వానంద్ సినిమా ‘శతమానం భవతి’ని ధైర్యంగా రేసులో నిలబెట్టారు. దానికి అద్భుతమైన ఫలితం వచ్చింది. గత ఏడాది సంక్రాంతికి ‘ఎక్స్ ప్రెస్ రాజా’ విషయంలోనూ ఇలాగే జరిగింది. కానీ శర్వా కొత్త సినిమా ‘రాధ’ విషయంలో మాత్రం ఇలాంటి ధైర్యం చూపించలేకపోయారు. సెన్సార్ కూడా పూర్తి చేసుకుని.. రిలీజ్ డేట్ కూడా ఇచ్చాక ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. అందుక్కారణం ‘కాటమరాయుడు’. పవన్ సినిమా 24న రిలీజవుతుంటే.. ఉగాది రోజైన మార్చి 29న ‘రాధ’ రిలీజ్ అనుకున్నారు. కానీ ఏమైందో ఏమో అంతలోనే సినిమాను వాయిదా వేసేశారు.

‘కాటమరాయుడు’ మీద మాంచి హైప్ ఉండటం వల్లే ‘రాధ’ను వాయిదా వేసినట్లుగా ప్రచారం జరిగింది. పవన్ కళ్యాణ్ తో ‘రాధ’ నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ కు ఇప్పటికే విభేదాలున్న నేపథ్యంలో కయ్యానికి కాలు దువ్వడం వల్ల దూరం మరింత పెరుగుతుందని కూడా సినిమాను వాయిదా వేసినట్లుగా గుసగుసలు వినిపించాయి. ఐతే కారణాలేవైనప్పటికీ ‘రాధ’ మంచి అడ్వాంటేజ్ మిస్సయిన మాట వాస్తవం. స్టూడెంట్స్ పరీక్షలు పూర్తి చేసుకుని సినిమాల వైపు మళ్లుతున్న నేపథ్యంలో ‘రాధ’ లాంటి ఎంటర్టైనర్ వచ్చి ఉంటే మంచి వసూళ్లు దక్కేవేమో. అనవసరంగా ఈ అవకాశాన్ని వృథా చేసుకున్నారే అని ‘రాధ’ టీం మీద జాలి చూపిస్తున్నారు. ఇలా వాయిదా వేయడం వల్ల మళ్లీ మంచి డేట్ దొరకడం కూడా కష్టమయ్యే పరిస్థితి తలెత్తింది. ఏప్రిల్ అంతా ఖాళీ లేకపోవడంతో ఇక మేలో కానీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చేలా కనిపించట్లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/