Begin typing your search above and press return to search.

శర్వా సంబంధం లేదన్న సినిమా మళ్లీ వస్తోంది

By:  Tupaki Desk   |   14 Jun 2016 1:30 PM
శర్వా సంబంధం లేదన్న సినిమా మళ్లీ వస్తోంది
X
ఎప్పుడో నాలుగేళ్ల కిందట తమిళ డైరెక్టర్ చేరన్ దర్శకత్వంలో శర్వానంద్ ఓ సినిమాకు కమిటయ్యాడు. అందులో నిత్యా మీనన్ హీరోయిన్. తమిళ-తెలుగు భాషల్లో మొదలైన ఈ సినిమాకు తెలుగులో ‘ఏమిటో ఈ మాయ’ అనే పేరు పెట్టారు. ఐతే సినిమా షూటింగ్ మధ్యలో ఏవో అవాంతరాలు రావడంతో ఆగిపోయింది. దర్శక నిర్మాత చేరన్ చాలా కష్టపడి సినిమాను పూర్తి చేశాడు కానీ.. విడుదల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో తమిళం వరకు ఈ చిత్రాన్ని ప్రయోగాత్మకంగా డీవీడీల రూపంలో విడుదల చేశాడు చేరన్. రెస్పాన్స్ పర్వాలేదు. ఐతే తెలుగు వెర్షన్ సంగతి ఎవ్వరూ పట్టించుకోలేదు. తమిళంలో డీవీడీలు రిలీజై కూడా దాదాపు రెండేళ్లయిపోతోంది. ఐతే ఈ మధ్యే ఎవరో ఓ డిస్ట్రిబ్యూటర్ తెలుగు హక్కులు తీసుకుని.. ‘రాజాధిరాజా’ పేరుతో విడుదలకు సన్నాహాలు చేశాడు.

కానీ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ సినిమాతో తనకే సంబంధం లేదు అనేశాడు శర్వా. ప్రమోషన్ కు కూడా ఆసక్తి చూపించలేదు. ఏప్రిల్ తొలి వారంలో ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఇచ్చి విడుదలకు సన్నాహాలు కూడా చేశారు. కానీ అనుకున్నట్లుగా సినిమా విడుదల కాలేదు. దీంతో ఆ సినిమా కథ అంతటితో ముగిసినట్లే అనుకున్నారంతా. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి మళ్లీ ఈ సినిమా వార్తల్లోకి వచ్చింది. ఈ నెల 24న ‘రాజాధిరాజా’ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రిలీజ్ డేట్ పోస్టర్లు కూడా వదిలారు. ఐతే ఇప్పుడు కూడా శర్వా ఈ సినిమా గురించి పట్టించుకునే స్థితిలో లేడు. 24న ‘ఒక మనసు’తో పాటు ఇంకో రెండు సినిమాలు కూడా షెడ్యూలై ఉన్నాయి. మరి ఈ పోటీ మధ్య ‘రాజాధిరాజా’ ఏమాత్రం ఉనికిని చాటుకుంటుందో.. అసలు ఈసారైనా అనుకున్న ప్రకారం సినిమా విడుదలవుతుందో లేదో చూద్దాం.