Begin typing your search above and press return to search.

శ‌ర్వానంద్ ఈసారి గ‌ట్టిగా కొట్టేలా ఉన్నాడు

By:  Tupaki Desk   |   31 Dec 2021 4:40 AM GMT
శ‌ర్వానంద్ ఈసారి గ‌ట్టిగా కొట్టేలా ఉన్నాడు
X
కెరీర్ ప్రారంభం నుంచి కొత్త త‌ర‌హా చిత్రాల‌తో త‌న ప్ర‌త్యేక‌త‌ని చాటుకుంటూనే వున్నారు హీరో శ‌ర్వానంద్‌. `మ‌హాను భావుడు` త‌రువాత శ‌ర్వా ఆ స్థాయి హిట్ మాట విని చాలా కాల‌మ‌వుతోంది. ఆ త‌రువాత చేసిన ఏ సినిమా పెద్ద‌గా ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయింది. చాలా ఆశ‌లు పెట్టుకున్న జాను, శ్రీ‌కారం, మ‌హా స‌ముద్రం కూడా శ‌ర్వాని నిరాశ ప‌రిచాయే కానీ ఆశించిన స్థాయి విజ‌యాల్ని అందించ‌లేక‌పోయాయి. దీంతో ఈ సారి గ‌ట్టిగా కొట్టాల‌ని ఫిక్స‌యిన‌ట్టున్నాడు. శ‌ర్వానంద్ న‌టిస్తున్న ద్విభాషా చిత్రం `ఒకే ఒక జీవితం`.

ఈ చిత్రం తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక‌ కాలంలో రూపొందుతోంది. శ‌ర్వా న‌టిస్తున్న తొలి బైలింగ్వ‌ల్ మూవీ ఇది. డ్రీమ్ వారియ‌ర్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఎస్‌. ఆర్‌. ప్ర‌భు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `ఆదిత్య 369` త‌ర‌హాలో సైన్స్ ఫిక్ష‌న్ గా ట్రైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో ఓ గ‌మ్మ‌త్తైన క‌థ‌, క‌థ‌నాల‌తో ఈ సినిమా సాగ‌బోతోంది. ఈ చిత్రం ద్వారా శ్రీ‌కార్తీక్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. రీతు వ‌ర్మ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రంలో శ‌ర్వాకు మ‌ద‌ర్ గా అమ‌ల అక్కినేని న‌టిస్తున్నారు.

ఇందులో శ‌ర్వాకు స్నేహితులుగా ప్రియ‌ద‌ర్శి, వెన్నెల కిషోర్ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపిస్తుండ‌గా సైంటిస్ట్ గా నాజ‌ర్ క‌నిపించ‌నున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ టైటిల్ పోస్ట‌ర్, హీరో శర్వానంద్ స్నీక్ పీక్ సినిమాపై ఆస‌క్తిని రేకెత్తించాయి. తాజాగా హీరో సూర్య రిలీజ్ చేసిన ఈ చిత్ర టీజ‌ర్ సినిమా స‌రికొత్తగా వుంటుంద‌నే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తోంది. `ఇప్పుడు నేను చెప్ప‌బోయే విష‌యానికి మీరు ఆశ్చ‌ర్యపోవ‌చ్చు.. అస‌లు న‌మ్మ‌క‌పోవ‌చ్చు కూడా.. కానీ మీరిది న‌మ్మే తీరాలి` అంటూ నాజ‌ర్ డైలాగ్ ల‌తో మొద‌లైన టీజ‌ర్ సినిమా ఆద్యంతం స‌రికొత్తగా వుంటుంద‌ని తెలియ‌జేస్తోంది.

తాజాగా విడుద‌ల చేసిన టీజ‌ర్ కి అనూహ్య స్పంద‌న ల‌భిస్తోంది. సినిమా గ‌తంలో బాల‌కృష్ణ హీరోగా వ‌చ్చిన `ఆదిత్య 369` చిత్రం త‌ర‌హా టైమ్ మెషీన్ నేప‌థ్యంలో సాగుతుంద‌ని తెలుస్తోంది. నాజ‌ర్ ఓ సైంటిస్ట్. ప్ర‌జెంట్ నుంచి పాస్ట్ కి వెళ్లే ఓ టైమ్ మెషీన్ ని క‌నిపెడ‌తాడు. అయితే ఈ టైమ్ మెషీన్ ద్వారా శ‌ర్వా త‌న ఇద్ద‌రు స్నేహితులు ప్రియ‌ద‌ర్శి, వెన్నెల కిషోర్ ల‌తో క‌లిసి త‌న బాల్యంలోకి వెళ్లిన‌ట్టుగా చూపించారు. నాజ‌ర్ పెట్టిన కండీష‌న్ తో త‌న ఇద్ద‌రు స్నేహితుల‌తో క‌లిసి బాల్యం లోకి వెళ్లిన శ‌ర్వా ఏం చేశాడు?

తిరిగి ప్ర‌స్తుత కాలంలోకి వ‌చ్చాడా? త‌న త‌ల్లి జ్ఞాప‌కాల కోస‌మే గ‌తంలోకి వెళ్లాడా? ఇంకేదైనా బ‌ల‌మైన కార‌ణం వుందా? అన్న‌ది తెలియాలంటే `ఒకే ఒక జీవితం` చూడాల్సిందే. సినిమాకు సైంటిఫిక్ అంశాల‌ని జోడించి టైమ్ మెషీన్ నేప‌థ్యంలో భావోద్వేగాల స‌మాహారంగా స‌రికొత్త క‌థ‌గా ఈ మూవీని తెర‌కెక్కించిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి మ‌రో విశేషం ఏంటంటే `పెళ్లి చూపులు` ఫేమ్ త‌రుణ్ భాస్క‌ర్ ఈ చిత్రానికి మాట‌లు రాయ‌డం. జేక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

ద‌ర్శ‌కుడు శ్రీ‌కార్తీక్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందిన ఈ మూవీ ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో వుంది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఈ చిత్రాన్ని రెండు భాష‌ల్లో ఒకేసారి విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. కొత్త క‌థ‌, డ్రీమ్ వారియ‌ర్ సినిమాపై ప్రేక్ష‌కుల కున్న న‌మ్మ‌కం.. నిర్మాత ఎస్‌.ఆర్‌. ప్ర‌భు జ‌డ్జిమెంట్.. టైమ్ మెషీన్ నేప‌థ్యం.. టీజ‌ర్‌కు ల‌భిస్తున్న అనూహ్య స్పంద‌న వెర‌సి ఈ సినిమాతో శ‌ర్వానంద్ గ‌ట్టిగా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని సొంతం చేసుకోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.