Begin typing your search above and press return to search.

శతమానం.. ఏ స్థాయి ప్రభంజనమంటే

By:  Tupaki Desk   |   31 Jan 2017 6:08 AM GMT
శతమానం.. ఏ స్థాయి ప్రభంజనమంటే
X
ఎలా మొదలుపెట్టామన్నది ముఖ్యం కాదు.. ఎలా ముగించామన్నది ముఖ్యం అని రుజువు చేస్తోంది ‘శతమానం భవతి’. ఈ సంక్రాంతికి ముందు తెలుగు ప్రేక్షకుల దృష్టంతా ‘ఖైదీ నెంబర్ 150’.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ల మీదే నిలిచింది. చర్చంతా చిరు-బాలయ్యల పోటీ మీదే నడిచింది. ‘శతమానం భవతి’ అసలు సోదిలోనే లేదు. ఈ సినిమా రిలీజైనప్పటికి కూడా అది పెద్దగా చర్చనీయాంశం కాలేదు. సంక్రాంతి వీకెండ్ అంతే చిరు.. బాలయ్యల సినిమాల గురించే అంతా చర్చించుకున్నారు. ఆ రెండు సినిమాలకు అదిరిపోయే ఓపెనింగ్స్ వచ్చాయి. ‘శతమానం భవతి’కి కూడా మంచి ఓపెనింగ్సే వచ్చినప్పటికీ.. అవేమీ కళ్లు చెదిరిపోయేవి కావు.

ఐతే చిరు.. బాలయ్యల సినిమాలది ఒక రకంగా ఆరంభ శూరత్వమే అయింది. ఓపెనింగ్స్ కు తగ్గట్లుగా తర్వాతి వసూళ్లు లేవు. ముఖ్యంగా మూడో వారంలో ఈ సినిమాలు బాగా నెమ్మదించాయి. కానీ ‘శతమానం భవతి’ అలా కాదు.. మూడో వారంలో థియేటర్లు మరింతగా పెంచుకుని.. కళ్లు చెదిరే వసూళ్లతో దూసుకెళ్లింది. మూడో వారాంతంలో ఈ సినిమాకే చాలాచోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఖైదీ నెంబర్ 150.. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలకు అలా లేదు. రెండో వారాంతానికి.. మూడో వారాంతానికి వసూళ్ల లెక్కలు చూసినా.. ‘శతమానం భవతి’ ఎలా పైచేయి సాధించిందో అర్థమవుతుంది. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ రెండో వీకెండ్ ముగిసేసరికి రూ.45.8 కోట్ల షేర్ రాబట్టింది. మూడో వారాంతం ముగిసేసరికి ఆ చిత్రం రూ.50 కోట్ల మార్కును టచ్ చేసింది. అంటే వారం రోజుల్లో నాలుగు కోట్లకు కొంచెం ఎక్కువగా షేర్ రాబట్టిందా సినిమా. ఇక చిరంజీవి సినిమా సెకండ్ వీకెండ్ కు రూ.90 కోట్ల దాకా షేర్ రాబట్టింది. మూడో వీకెండ్ అయ్యేసరికి రూ.98 కోట్ల దాకా షేర్ రాబట్టినట్లు అంచనా. ఐతే శతమానం భవతి విషయానికొస్తే రెండో వీకెండ్ అయ్యేసరికి రూ.21 కోట్ల షేర్‌ కలెక్ట్ చేసిన ఆ సినిమా మూడో వీకెండ్ అయ్యేసరికి రూ.29 కోట్ల మార్కును దాటేసింది. బాలయ్య సినిమాకు దాదాపు డబుల్ షేర్ రాబట్టడం.. చాలా ఎక్కువ థియేటర్లలో ఆడుతున్న చిరు సినిమాతో సమానంగా వసూళ్లు తెచ్చుకోవడం అంటే చిన్న విషయం కాదు. దీన్ని బట్టే ‘శతమానం భవతి’ ప్రభంజనం ఎలా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/